కలెక్టర్ల రాజీనామాల వెనుక..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ప్రాధాన్యత తగ్గిస్తుండటంపై ఆందోళన
– పాలకుల తీరు.. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారనే ఆరోపణతో మరికొందరు
– రాజీపడక కెరీర్‌నే పణంగా పెడుతున్న యువ ఐఏఎస్‌లు
– వృత్తిగత జీవితం మధ్యలోనే వదిలేస్తున్న వైనం

న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రజానీకానికి అందేలా చేయడంలో రాజకీయ నాయకుల కంటే కూడా పాలనాధికారుల (కలెక్టర్లు) పాత్ర ఎంతో కీలకం. దేశ ఉద్యోగాలలో అత్యున్నత పోస్ట్‌ కలెక్టర్‌. అయితే గత కొంతకాలంగా పాలకుల రాజకీయాలకు ఇమడలేక రాజీనామాల బాట పడుతున్నారు. గతంలో అడపాదడపాగా కలెక్టర్ల రాజీనామాల వార్తలు వస్తుండేవి. గడిచిన నాలుగైదేండ్లలో మీడియాలో పతాక శీర్షికలెక్కుతున్నాయి. రాజకీయ నాయకుల వైఖరి.. పై అధికారుల ఒత్తిళ్ల మూలంగా వారు తమ పదవుల్లో ఇమడలేకపోతున్నారు. మోడీ సర్కారు-2.ం పాలన ప్రారంభమైన తర్వాత గత రెండు నెలల్లోనే ముగ్గురు కలెక్టర్లు రాజీనామా చేయడం గమనార్హం. అసలే ఐఏఎస్‌ అధికారుల కొరతతో పలు కలెక్టర్ల మీద పనిభారం అధికమవుతుండగా.. తాజాగా రాజీనామాల పర్వం పెరుగుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.

ఆకర్షణీయమైన వేతనం..ప్రమోషన్లు.. సకల సౌకర్యాలు.. వీటన్నింటినీ వదులుకుని కలెక్టర్లు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు కారణమని విశ్లేషకులు చెబుతున్నా.. రాజీనామా చేస్తున్న వారు మాత్రం తాము వైదొలగడం వెనుక విషయాన్ని కరాఖండీగా చెబుతున్నారు. తమకు ప్రాధాన్యత లేదని కొంతమంది వాదిస్తుండగా.. ఈ ఉద్యోగాల్లో ఇమడలేమని కొందరు చెబుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేస్తూ ఇటీవలే రాజీనామా చేసిన ఎస్‌.శశికాంత్‌ సెంథిల్‌ అయితే.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదనీ, ఫాసిజం కోరలు విప్పుతున్నదని వ్యాఖ్యానించారు. అలాగే మరో ఐఏఎస్‌ కన్నన్‌ గోపినాథన్‌.. కాశ్మీర్‌పై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఆయన కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్‌ హవేలిలో విద్యుత్‌, పట్టణాభివృద్ధి, నగర ప్రణాళిక శాఖలో సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. ఇక నిటిఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ రాజీవ్‌కుమార్‌కు అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న కశిశ్‌ మిట్టల్‌ సైతం తాను ఉద్యోగంలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. అకారణంగా తనను బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా సమర్పించారు. వీరేగాక మరో రెండేండ్లలో రిటైర్‌ కాబోతున్న సుభాశ్‌ చంద్ర గార్గ్‌ ఈ ఏడాది జులైలో ఉద్యోగం నుంచి వైదొలిగారు. ఫైనాన్స్‌ సెక్రెటరీగా సేవలందిస్తున్న ఆయనను అంతగా ప్రాముఖ్యత లేని స్థానానికి బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. గార్గ్‌ మినహా పైన రాజీనామా చేసిన వారిలో మిగిలిన ముగ్గురు 40 ఏండ్ల లోపువారే కావడం గమనార్హం.

దేశంలో 6,699 ఐఏఎస్‌ అధికారులకు గానూ 5,205 మంది మాత్రమే (2019 జనవరిలో డీవోపీటీ వెలువరించిన దాని ప్రకారం) అధికారులున్నారు. అంటే దాదాపుగా 1,500 మంది ఐఏఎస్‌ అధికారుల అవసరముండగా.. ఉన్నవారు సైతం రాజీనామాలు చేస్తుండటం, ఒత్తిళ్లు తట్టుకోక పలువురు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తుండటం గమనార్హం. కాగా, మోడీ పాలనలో తొలిసారిగా 2016లో కలెక్టర్ల రాజీనామా పర్వం మొదలైంది. ఆ ఏడాదిలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను, రైల్వేలు, అటవీశాఖలో పెద్ద ఎత్తున కేంద్రానికి నచ్చిన (కాషాయనేతలు సిఫారసు చేసిన వారికి) నాన్‌ ఐఏఎస్‌లను నియమించడం వారి నిరసనకు కారణమవుతున్నది. కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో ఉండే అడిషనల్‌ సెక్రెటరీ, సెక్రెటరీ పోస్టులను సైతం ఐఏఎస్‌ కానివారికి నియమిస్తుండటంపైనా వారు ఆగ్రహంగా ఉన్నారని పలు వార్తాకథనాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రయివేటు రంగానికి చెందిన తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్స్‌ను.. పలు శాఖలకు జాయింట్‌ సెక్రెటరీలుగా నియమించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంతేగాక రెండు కీలక కేంద్ర సంస్థలైన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ)లలో ఐఏఎస్‌ ఆఫీసర్లను కాదని వేరేవారికి ఆ స్థానాన్ని అప్పగించడం కూడా వారిలో అసంతృప్తిని రగుల్చుతున్నది. 2018 అక్టోబర్‌ 27న కేంద్రం.. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి సంజరు కుమార్‌ మిశ్రాను ఈడీకి బాస్‌ను చేయగా, ఐపీఎస్‌ అధికారి శరద్‌ కుమార్‌ను సీవీసీకి అత్యున్నత అధికారిగా నియమించింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ఐఆర్‌ఎస్‌ అధికారి సుశీల్‌ చంద్రను ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) సీఈసీగా నియమించింది. గతంలో ఈ పోస్టులన్నీ ఐఏఎస్‌ అధికారులకే దక్కేవి.

వీటితో పాటు తమను ప్రాధాన్యత లేని వ్యక్తులుగా చేస్తున్నారనీ, తమకుండే అధికారాలను తగ్గిస్తున్నారని పలువురు కలెక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఈ ఏడాది జులైలో పలువురు కలెక్టర్లు ఓ ఆంగ్ల మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. మోడీ సర్కారు తమ అధికారాలను తగ్గిస్తున్నదని బాహాటంగానే ఆరోపించారు. ఒక ఐఏఎస్‌ అధికారికి యూనియన్‌ జాయింట్‌ సెక్రెటరీ అయ్యే గ్యారంటీ లేకుండా పోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్‌ సెక్రెటరీ, అడిషనల్‌ సెక్రెటరీ, సెక్రెటరీ స్థాయి వరకూ వెళ్లే అవకాశమున్నా.. కేంద్రం మాత్రం ఐఏఎస్‌లను కాదని మిగతా సర్వీసులోని అధికారులను నియమిస్తూ తమపై పక్షపాత వైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. ఐఏఎస్‌ అంటే దేశం మొత్తం పనిచేసే ఉద్యోగం అనీ, కానీ అలా కాకుండా కేంద్రం తమను ఒకే రాష్ట్రానికి పరిమితం చేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై పలువురు మాజీ ఐఏఎస్‌లు స్పందిస్తూ.. యువ ఐఏఎస్‌లు అద్భుతమైన కెరీర్‌ను వదులుకుని సైతం రాజీనామాలు చేస్తుండటం ఆందోళనకరమని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లు గతంలోనూ ఉండేవనీ.. కానీ ప్రస్తుతం వారు చెబుతున్న దాంతో భవిష్యత్తులో ఐఏఎస్‌లుగా చేరి దేశసేవ చేయాలనుకునేవారు సైతం ఆలోచనలో పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

గత మూడు నెలల్లో రాజీనామా చేసిన వారు
1. సుభాశ్‌ చంద్ర గార్గ్‌ (58).. రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన గార్గ్‌, 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌. గతంలో పలు శాఖల్లో పనిచేసిన ఆయన.. జులైలో ఫైనాన్స్‌ సెక్రెటరీ నుంచి అప్రధాన్యత ఉన్న శాఖకు మార్చారని ఆరోపిస్తూ రాజీనామా.
2. కన్నన్‌ గోపినాథన్‌ (35).. కేరళకు చెందిన గోపినాథన్‌, 2012 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌. కాశ్మీర్‌పై మోడీ సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా అక్కడి ప్రజల స్వేచ్ఛను హరించారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు.
3. ఎస్‌.శశికాంత్‌ సెంథిల్‌ (40).. కర్నాటకకు చెందిన సెంథిల్‌, 2009 బ్యాచ్‌కు చెందిన అధికారి. కొద్ది రోజులగా దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి, తదనుగుణంగా దేశాన్ని ఫాసిజం వైపునకు తీసుకెళ్తున్నారనే ఆరోపణతో ఉద్యోగం నుంచి వైదొలిగారు.
వీరితో పాటు కె.మిట్టల్‌ (30) కూడా చిన్న వయస్సులోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates