నిర్వాసితుల గోడు పట్టేనా..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • హామీలపై నోరుమెదపని ప్రభుత్వం
  • గతంలో భూసేకరణ చేసిన భూములకు రూ.ఐదు లక్షల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.పది లక్షలిస్తామని ప్రకటన

పోలవరం నిర్వాసితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసిపి ప్రభుత్వం మరిచిపోయిందా.. అధికారం చేపట్టి మూడునెలలు గడిచినా నోరుమెదపకపోవడంపై నిర్వాసితులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరిపోతాయని ఎన్నో ఆశలతో ఉన్న నిర్వాసితులకు.. ప్రభుత్వ తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా తమకు అన్యాయం చేస్తారా అన్న వేదన అందరినీ కరటిమీద కునుకులేకుండా చేస్తోంది.తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేస్తామని గడిచిన ఎన్నికల్లో వైసిపి హామీ ఇచ్చింది. గత ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోయిన నిర్వాసితులు ఆ మాటలు నమ్మి ఎన్నికల్లో వైసిపికి పట్టంకట్టారు. 2006లో భూసేకరణ చేసిన భూములకు అప్పట్లో ప్రభుత్వం రూ.లక్షా 15వేలు మాత్రమే ఇచ్చింది. 2014లో ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. గతంలో సేకరించిన భూములను ప్రభుత్వం ఐదేళ్లు దాటినా స్వాధీనం చేసుకోలేదు. 2013 చట్ట ప్రకారం సేకరించిన భూములను ఐదేళ్లలోపు స్వాధీనం చేసుకోకపోతే ఆ భూములకు తిరిగి పరిహారం ఇవ్వాల్సి ఉంది. దీనిపై గిరిజనులు గత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే గతంలో భూసేకరణ చేసిన భూములకు మళ్లీ ఎకరాకు రూ.ఐదు లక్షలు ఇస్తామని వైసిపి ప్రకటించింది. దీంతో నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా యుతవకు, పునరావాస ప్యాకేజీ కింద కుటుంబానికి ఇస్తున్న రూ. 6.36 లక్షల ప్యాకేజీని మార్పుచేస్తామని చెప్పింది. అధికారంలోకొస్తే పునరావాస, యువతకు ప్యాకేజీ కింద రూ.పది లక్షలు ఇస్తామని వైసిపి హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం నిర్వాసితుల కోసం నిర్మించిన, నిర్మిస్తున్న ఇళ్లపై అనేక విమర్శలొచ్చాయి. చిన్నపాటి ఇళ్లు, నాణ్యతలేకుండా కడుతున్నారంటూ నిర్వాసితులు ఆందోళనలు సైతం చేశారు. కట్టిన ఇళ్లు వర్షాలకు లీకై నీరుకారుతున్నాయి. దీంతో నిర్వాసితులే సొంతగా ఇళ్లు నిర్మించుకునే విధంగా సొమ్ములు వారికే ఇస్తామని ఎన్నికల్లో వైసిపి చెప్పింది. భూమికి భూమి అందని గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పారు. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని నిర్వాసితులు ఎంతో ఆనందపడ్డారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడునెలలు పూర్తయింది. ఇప్పటి వరకూ పోలవరం నిర్వాసితులకిచ్చిన హామీల గురించి నోరుమెదపలేదు. అసలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు. జిల్లాలో దాదాపు 28 వేల నిర్వాసిత కుటుంబాలు న్నాయి. వీరంతా ప్రభుత్వం నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంగానీ, ప్రజాప్రతి నిధులుగానీ నిర్వాసితుల హామీలపై మాట్లాడకపోవడంపై అంతటా అనుమానాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వం మాదిరిగా మాటలతో కాలక్షేపం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. దీంతో తమకు న్యాయం జరుగుతుందా.. లేదా అన్న ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకిచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని అంతా కోరుతున్నారు.

(COURTECY PRAJA SHAKTHI)

RELATED ARTICLES

Latest Updates