ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో మే 1న కార్మికదినం. చిత్రం ఏమిటంటే మేడే పోరాటాల గడ్డ అమెరికాలో మాత్రం అధికారయుతంగా సెప్టెంబరు 2న కార్మిక దినం. అంతర్జాతీయ కార్మిక ఉద్యమం ఖరారు చేసిన మేడేను అంగీకరిస్తే కార్మికవర్గం ఎక్కడ కమ్యూనిజం వైపు పయని స్తుందో అనే భయంతో అమెరికా పారిశ్రామికవేత్తలు దానికి బదులుగా 1880 దశకంలో సెప్టెంబరు 2న కార్మిక దినంగా నిర్ణయించాలని తమకు అనుకూలురైన కార్మికులతో ఒక ప్రతిపాదన చేయించారు. ముందే తెలుసు గనుక నాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ అంగీకరించారు. అంటే ఆచరణలో అది కార్మికవర్గానికి చెందినది కాని యజమానుల దినం. అమెరికా కార్మికదినాన్ని జరుపుకొనేందుకు నిజానికి అక్కడి కార్మికవర్గం సంతోషించాల్సిందేమీ లేదు. నానాటికీ వారి పరిస్థితులు దిగజారుతున్నాయి. 2003తో పోల్చితే సగం అమెరికన్‌ కుటుంబాల (12.9కోట్ల మంది) సంపద ఇప్పుడు 32శాతం తక్కువ. ఇదే కాలంలో ఎగువన ఉన్న ఒక శాతం మంది(పన్నెండు లక్షల 90వేల మంది) ధనికుల సంపద రెండు రెట్లు పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రతి ఏటా సగటు వేతనాలు 1970వరకు పెరిగాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగా మారారు. ట్రంప్‌ బడ్జెట్‌లో లక్ష కోట్ల డాలర్లమేరకు లోటు పెంచి ఒక శాతం ధనికులకు పెద్దఎత్తున రాయితీలు ఇచ్చారు. ఇది వారికి రాయితీలు అనటం కంటే పేదల మీద విధించిన పన్ను అనటం సబబు.