రవిదాస్‌ మందిరాన్నే కాదు, ‘బేగంపురా’నీ నిర్మించుకోవాలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కృపాకర్‌ పొనుగోటి
చమార్‌ సామాజిక వర్గంలో పుట్టిన రవిదాస్‌ (1377–1528) చర్మకారవృత్తిని అవలంబిస్తూనే, సాంఘిక సమానత్వ భావ విప్లవాన్ని సృష్టించాడు. తన కవితలు, కీర్తనలు, ప్రబోధాలు, ఆలోచనలతో సృష్టించిన ఆదర్శ నగరమే ‘బేగంపుర’. పాలకులు రవిదాస్‌ మందిరాన్ని కూల్చగలరేమో గాని, ఆయన బేగంపురాని ఎన్నటికీ కూల్చలేరు.
సామాజిక సమానత్వాన్ని గానం చేసిన సంఘసంస్కర్త, తత్వవేత్త, కవి సంత్‌ శిరోమణి గురు రవిదాస్‌ మందిరాన్ని కూల్చడమంటే వర్ణ, కుల, జెండర్‌ వివక్షలను, ఆధిపత్యాలను నిరసించిన రవిదాస్‌ సమానత్వ భావజాలాన్ని కూల్చ ప్రయత్నించడమే. వర్ణ, కుల, జెండర్‌ వ్యత్యాసాలను పెంచి పోషించ పూనుకోవడమే.
సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతో ఆగస్టు పదో తేదీ నాడు డిడిఏ (ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ) దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ అటవీ ప్రాంతంలో క్రీ.శ. 1502 నుంచి వున్న పురాతన గురు రవిదాస్‌ మందిరాన్ని, ఆశ్రమాన్ని కూల్చివేయటం సరైంది కాదు. దేశవ్యాప్తంగా రవిదాస్‌ సమతా ధర్మాన్ని అనుసరించే కోట్లాది అభిమానులు, అనుచరులు, భక్తులు, కమ్యూనిటీస్‌ నుంచి పెద్ద ఎత్తున ఈ కూల్చివేతకు నిరసనలు ప్రారంభమయ్యాయి.
ఈ నెల 13న పంజాబ్‌లో బంద్‌లు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మొదలగు రాష్ట్రాల్లో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నెల 21 నాటికి ఈ ‘విప్లవం’ సెగ ఢిల్లీని తాకింది. అఖిల భారతీయ సంత్‌ శిరోమణి గురు రవిదాస్‌ మందిర్‌ సంయుక్త సంరక్షణ సమితి గొడుగు కింద అనేక ప్రజా సంఘాలు, సమూహాలు ఏకమై రవిదాస్‌ మందిర పునర్నిర్మాణ ఉద్యమాన్ని ప్రారంభించాయి. లక్షలాది రవిదాస్‌ అభిమానులు, అనుయాయులు ఢిల్లీలోని ఝండేవాలన్‌ అంబేడ్కర్‌ భవన్‌ నుంచి రామ్‌లీలా మైదానం వరకు కదం తొక్కారు. నీలి టోపీలు, నీలి జెండాలు ధరించిన అన్ని వయసుల ప్రజల ‘జై భీమ్‌’ నినాదాలతో ఢిల్లీ నగర వీధులు మార్మోగాయి. రవిదాస్‌ మందిరాన్ని కూల్చివేసిన చోటే తిరిగి పునర్నిర్మించడానికి ప్రభుత్వం తక్షణం పూనుకోవాలని, ఆందోళనలో పాల్గొన్న ప్రజా సంఘాలు, ప్రజలు డిమాండ్‌ చేసారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించే వరకూ ఈ రవిదాస్‌ మందిర పునర్నిర్మాణ ఉద్యమం సద్దుమణిగేటట్టు లేదు.
వాస్తవానికి, ఇప్పటి ఈ ఉద్యమానికి సంత్‌ రవిదాస్‌ మందిరం కూల్చివేత కేంద్ర బిందువైనప్పటికీ అట్టడుగు సాంఘిక సమూహాల్లో వచ్చిన ఈ అశాంతి, అలజడికి నేపథ్యం చాలానే ఉందని భావించాలి. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు, ఆధిపత్యాలకు వీలు కల్పించే హిందూ ఆధిపత్య కులాల రాజకీయ ధార్మిక ఆచరణ దేశంలోని బహుజనుల సమస్త ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దుతో భారత సమాఖ్యతత్వంపై అనుమానాలు పెరిగాయి. వివాదాస్పదమైన ముస్లిం విడాకుల చట్టం వచ్చింది. మాంసాహారం అలవాటున్న మతాలు, సాంఘిక సమూహాల వారిపై గో గూండాల దాడులు పెరిగాయి. హేతువాదులు, నాస్తికులపై, స్వేచ్ఛగా వార్తలు రాసే పాత్రికేయులపై హంతక దాడులు పెరిగాయి. అణగారిన సమూహాల ఆత్మగౌరవ చిహ్నాలైన వారి దివంగత నాయకుల విగ్రహాలు, స్మారక మందిరాలు, కట్టడాల కూల్చివేతలు పెరిగాయి.
అణగారిన వర్గాలకు రాజ్యాంగ సంరక్షణలుగా ఉంటున్న విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రిజర్వేషన్ల అమలు రోజు రోజుకూ క్షీణించిపోతున్నది. పుష్కరాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు పెరిగాయి. గుడుల బడ్జెట్‌ పెరిగింది. పాలకులు ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెట్టి స్వాములు, పూజారులు, మఠాధిపతులకు ప్రాధాన్యతనివ్వడం పెరిగింది. తీవ్రమైన ఆర్థిక, హత్యా నేరారోపణ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికవుతుండటం పెరిగింది. సాధారణ ప్రజల జీవన భద్రత ప్రమాదంలో పడింది. సాంఘిక గౌరవం, ఆర్థిక భద్రత కోల్పోయి, భవిష్యత్తు పట్ల తీవ్రమైన అసంతృప్తి, ఆందోళన, అశాంతి, పాలకుల పట్ల అపనమ్మకం దేశ ప్రజల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యం కూడా రవిదాస్‌ మందిర్‌ పునర్నిర్మాణం చెయ్యాలనే ఉద్యమకారుల్లో ఆగ్రహం పెరగడానికి కారణమైంది.
చమార్‌ సామాజిక వర్గంలో పుట్టిన రవిదాస్‌ (1377–1528) చర్మకారవృత్తిని అవలంబిస్తూనే, సాంఘిక సమానత్వ భావ విప్లవాన్ని సృష్టించాడు. భారతీయ సమాజానికి పట్టిన వర్ణ, కుల, మత కుడ్యాల జాఢ్యాల తోలుని ఝాడించి వూనిన సాంఘిక విప్లవకారుడు సంత్‌ రవిదాసు. సాంఘిక మూఢాచారాల నిర్మూలన కోసం తన కవితల్ని, కీర్తనల్ని, బోధనలను కత్తి, ఆరె, గూటములుగా ప్రయోగించిన సామాజిక సంస్కర్త సంత్‌ శిరోమణి గురు రవిదాస్‌. పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు హీనులు కారని, ధర్మాన్ని వల్లిస్తూ కర్మని మాత్రమే ఆచరించడం సరికాదని, ధర్మ కర్మల్ని వదిలేసి, ఆధిక్యతా అహంకారాలను ప్రదర్శిస్తున్న నాటి బ్రాహ్మణ వర్ణ ధర్మంపై సాంఘిక సమానత్వం, మానవత్వం అస్త్రాలతో రవిదాస్‌ దండెత్తినాడు. సత్యమెప్పుడూ అహంకార హీనంగానే ఉంటుందని స్పష్టం చేసాడు.
సామాజిక ఆధిక్యతా న్యూనతలతో రోగగ్రస్తమైన మనస్సుకి విశ్వ మానవ సహోదరత్వం, మత సామరస్యం, సమానత్వం, మానవతావాదం అనే సహజ విశ్వాసాల సన్మార్గాన్ని రవిదాసు ప్రపంచానికందించాడు. దీన్నే రవిదాసియా ధర్మంగా నేడు కోట్లాది ప్రజలు అనుసరిస్తున్నారు. సిక్కు మతానికి పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్‌ సాహెబ్‌’లో ఎనభైకి పైగా సంత్‌ రవిదాస్‌ కవితలు, కీర్తనలు పొందుపరచబడినాయి. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, తాను రాసిన ‘అంటరానివారెవరు?’ గ్రంథాన్ని వర్ణ, కుల వివక్షల నిర్మూలనావాదియైన రవిదాస్‌కి అంకితం చేశారు. అంతేగాదు, బహుజనుల రాజకీయ గురువు, నాయకుడు కాన్షీరామ్‌ ‘రవిదాసియా’ సామాజిక వర్గంలోనే జన్మించాడు.
రవిదాస్‌ తన కవితలు, కీర్తనలు, ప్రబోధాలు, ఆలోచనలతో సృష్టించిన ఆదర్శ నగరమే ‘బేగంపుర’. విచారాలు, దుఃఖాలు, వివక్షలు, భయాలు, హింసలు, పన్నులు లేని నగరం – బేగంపుర. శాంతి, సౌఖ్యం, మానవత్వం, స్వేచ్ఛ, సమానత్వాలతో ప్రజలు జీవించే ఆనంద నిలయమే బేగంపుర. సంత్‌ రవిదాస్‌ బేగంపుర కోసమే స్వప్నించాడు. జీవించాడు. గానం చేసాడు. రవిదాస్‌ మహనీయా! పాలకులు నీ మందిరాన్ని కూల్చగలరేమో గాని, నీ బేగంపురాని ఎన్నటికీ కూల్చలేరు. రవిదాసియా ధర్మం నిలిచే ఉంది. రవిదాస్‌ మందిరమూ పునర్నిర్మించబడుతుంది. రవిదాస్‌ ‘బేగంపుర’ సమాజమూ నిర్మించబడుతుంది. అందుకే ఈ ఆందోళనలు.
(COURTACY… ANDHRA JYOTHI)

RELATED ARTICLES

Latest Updates