ఏ తల్లి కన్నబిడ్డలో!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అనారోగ్యపు ఒడిలో అనాథ బాల్యం
రెండు నెలల్లో ముగ్గురు చిన్నారుల మృతి
శిశువిహార్‌ నిర్వహణలో పర్యవేక్షణ లోపం

చింపిరిజుత్తు.. ఒళ్లంతా పుండ్లు..శరీరంపై చిరిగిన దుస్తులు. ఆకలేసినా అడగలేని అమాయకత్వం…   ఎవరైనా కనికరించి ఏదో ఒకటి పెడితే తినడమే ఆ చిన్నారికి తెలుసు. తానెవరో, ఎందుకిలా మారానో తెలియని వయసు. దారినపోయే ఓ మంచి మనసు డయల్‌ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. అలా వీధి నుంచి అనాథాశ్రమానికి చేరిందా బాలిక. పరీక్షించిన వైద్యులు చిట్టితల్లి గుండెకు చిల్లు ఉందని గుర్తించారు. బిడ్డకు చికిత్స అందించలేని దుస్థితిలో తల్లిదండ్రులు వదిలేసి ఉండవచ్చని భావించారు.

అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన బాల్యం అనాథగా మారుతోంది. ఏటా పదుల సంఖ్యలో పసికందులు చెత్తతొట్లు.. మురుగుకాల్వల పక్కన చేరుతున్నారు. ఒక్కోసారి శునకాల బారిన పడుతున్నారు. సమయానికి ఎవరైనా గుర్తిస్తేనే వారి ఆయువు నిలబడేది.   ఇటువంటి వారిని సంరక్షించి చక్కటి జీవితాన్ని అందించాలనే సంకల్పంతో ఏర్పాటైనదే మధురానగర్‌ స్టేట్‌హోంలోని శిశువిహార్‌. ఇక్కడ  పిల్లలకు డబ్బాపాలు పట్టించి కడుపు నింపుతున్నారు. కొన్నిసార్లు అర్ధాకలితో వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పసికూనలను ఆదరించి ఆత్మీయత పంచాల్సిన చోట కొన్ని తప్పిదాలు వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయి. శిశువిహార్‌లో ఉన్న పిల్లలంతా రోజుల ప్రాయం నుంచి 2-3 ఏళ్ల వయసులో అనాథలుగా మారి ఇక్కడికి వచ్చిన వారే.

ఎవరిదీ తప్పిదం? గత నెలలో తక్కువ బరువుతో పుట్టిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ శిశువిహార్‌లో చనిపోయింది. ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతున్న మరో 9 నెలల చిన్నారిదీ అదే పరిస్థితి. ఫుట్‌పాత్‌పై దొరికిన ఈ చిన్నారి తల్లి అదే జబ్బుతో చనిపోయింది. 17 రోజుల వయసున్న మరో పసికందు ఈనెల 17న  మరణించాడు. ఇలా రెండు నెలల వ్యవధిలో ముగ్గురు మృత్యుఒడికి చేరడం చర్చనీయాంశంగా మారింది. శిశువిహార్‌లో 24 గంటలూ వైద్యసిబ్బంది ఉంటారు. పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసేందుకు 125 మంది ఆయాలు పనిచేస్తున్నారు. మూడు విడతల్లో ఒక్కొక్కరు ఆరుగురిని పర్యవేక్షిస్తుంటారు. నిరంతరం అప్రమత్తంగా మెలగాల్సిన సిబ్బంది కొన్నిసార్లు ఉదాశీనంగా ఉంటున్నారు. డాక్టర్‌ యోగితారాణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రత్యేక అవసరాల చిన్నారుల కోసం తగిన ఏర్పాట్లు చేయించారు. ఫిజియోథెరపీ అందించేందుకు సిబ్బందిని నియమించారు.

ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు
అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం
అనాథ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి  పిల్లలను తరలించే  ముందుగానే వైద్యపరీక్షలు చేయించాలి.  అత్యవసర సమయంలో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ ఉన్నా ప్రయివేటు వాహనాల్లో తీసుకెళుతున్నారు. ఇటీవల ఓ చిన్నారి వ్యాధితో మరణించినట్లు చెబుతున్నా.. తలకు గాయం ఉన్న విషయాన్ని విస్మరించారు. స్నానం చేయించే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమే అసలు కారణం.  అనాథలను వీలైనంత త్వరగా దత్తత ఇచ్చి కుటుంబానికి దగ్గర చేయాలి.

అనారోగ్యమే కారణం: ఝాన్సీ లక్ష్మీభాయి, జిల్లా సంక్షేమ అధికారి
అనారోగ్య సమస్యలతోనే చిన్నారులు మరణించారు. ప్రత్యేక అవసరాలు, రుగ్మతలున్న పిల్లలే అధికశాతం శిశువిహార్‌కు వస్తుంటారు. వీరికి చికిత్స, ఆహారం విషయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. తీవ్ర అనారోగ్య లక్షణాలతో చేరిన పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించి సేవలు అందిస్తున్నాం. వారికి 9 మంది ఆయాలు సపర్యలు చేస్తున్నారు. 75 మంది పిల్లల్ని ప్రీస్కూల్‌లో ఉంచాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ శిక్షణ ఇస్తున్నాం.

శిశువిహార్‌లో ఇదీ పరిస్థితి
204 ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారు
89 గుండె జబ్బులు, క్షయ, న్యుమోనియా తదితర వ్యాధుల బాధితులు
50 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు
125 పనిచేస్తున్న ఆయాలు

 

RELATED ARTICLES

Latest Updates