తవ్వకాలతో తీరని నష్టాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– డాక్టర్‌ కె.బాబూరావు

నల్లమలలో యురేనియం అన్వేషణ

నల్లమల అడవుల్లో మళ్ళీ ‘యురేనియం’ అలజడి మొదలైంది. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టనున్నట్లు వస్తున్న వార్తలు స్థానికుల్లో కలవరం కలిగిస్తున్నాయి. దీనివల్ల ఎదురయ్యే దుష్ఫలితాల గురించి వారు ఆందోళన చెందుతున్నారు. ఇవేమీ కేంద్ర ప్రభుత్వానికి పట్టినట్లు లేదు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. తన నిర్ణయం అమలు దిశగానే కేంద్రం అడుగులు వేస్తోంది. గతంలోనూ ఈ విషయమై కొంత హడావుడి జరిగింది. 2005లో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంబాపూర్‌లలో తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదించారు. తొలుత మల్లాపురం, తరవాత సేరిపల్లిలలో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముందుకు వెళ్లలేదు. తాజాగా నాగర్‌ కర్నూలు, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న అటవీ సలహా కమిటీ, నల్లమలలో యురేనియం కోసం దాదాపు నాలుగువేల బోర్ల తవ్వకాలకు సూత్రప్రాయ అనుమతికి నిర్ణయం తీసుకుంది. అణు విభాగం, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన దరఖాస్తులో మూడు అంగుళాల బోర్లు వెయ్యి, ఏడు అంగుళాల బోర్లు మూడువేలు తవ్వుతామని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ గత నెలలో తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి తెలియజేసింది.

అడవుల విధ్వంసం
యురేనియం తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆది నుంచీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని వాటిల్లుతుంది. అడవుల్లో నివసించే స్థానిక గిరిజనుల ఉపాధి దెబ్బతింటుంది. వారు ఉన్న ఊరు వదిలి పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అడవిలో నివసించే వన్యప్రాణుల మనుగడకు ముప్పు తలెత్తి, అవి వేరే ప్రాంతానికి వలస వెళ్లాల్సివస్తుంది. ఒకవేళ అవి అక్కడే ఉంటే యురేనియం తవ్వకాల వల్ల రేడియేషన్‌ ప్రభావానికి గురవుతాయి. సమీపంలో ప్రవహించే కృష్ణా నదీ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఈ నదీజలాలు హైదరాబాద్‌ తాగునీటి సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ జలాల ఆధారంగా లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. నీరు కలుషితమైతే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకపక్క పర్యావరణ పరిరక్షణకు చట్టాలు చేస్తూ మరోపక్క దాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడంలో అర్థం లేదు. యురేనియం తవ్వకాల వల్ల కలిగే ప్రయోజనాల కన్నా ఎదురయ్యే అనర్థాలే ఎక్కువన్న పర్యావరణవేత్తల ఆందోళనను తోసిపుచ్చలేం! ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా వివిధ దేశాలను సన్నద్ధం చేస్తోంది. ఐరాస ఏర్పాటు చేసిన ఐపీసీసీ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) కమిటీ ఇటీవల జెనీవాలో ఒక నివేదిక విడుదల చేసింది. గాలిలో బొగ్గుపులుసు వాయువును తొలగించడంలో అడవుల పాత్ర, ప్రాధాన్యాలను నివేదిక వివరించింది. అడవుల విధ్వంసాన్ని ఆపి, వాటిని పునరుద్ధరించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. 1990 తరవాత ప్రపంచవ్యాప్తంగా ‘అభివృద్ధి’ పనుల పేరిట మూడు శాతం అడవులు హరించుకుపోయాయి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం సహజ సంపదను ధ్వంసం చేయడం మొదలైంది. పెట్టుబడిదారుల ప్రయోజనాలు ప్రకృతికి విఘాతంగా పరిణమిస్తున్నాయి.

అడవులను కాపాడుకోవలసిన, విస్తరించాల్సిన ఆవశ్యకతపై ఐపీసీసీకి  సమర్పించిన నివేదికలో శాస్త్రవేత్తలు ముఖ్యాంశాలను ప్రస్తావించారు. అడవుల సంరక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం ఇందులో కీలకమైనది. అడవుల మూలాలు దెబ్బతినకుండా అక్కడి సహజ వనరులను వినియోగించుకుని అభివృద్ధికి బాటలు వేయాలి. పారిస్‌ ఒప్పందం ప్రకారం ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు మించకుండా ఉంచడానికి అన్ని చర్యలు చేపట్టాలి. అడవుల ధ్వంసానికి అడ్డుకట్ట వేయాలి. అదుపు తప్పుతున్న భూతాపం నుంచి అడవులను సంరక్షించడం అవసరం. పారిస్‌ ఒప్పందం మేరకు అడవుల పునరుద్ధరణ తప్పనిసరి. అడవులను విస్తరించి వాటికి పునర్‌ వైభవం కల్పిస్తే అవి అదనంగా 18 శాతం వరకు కర్బనాన్ని తొలగించి ప్రమాదస్థాయిని తగ్గించగలవు. కట్టెలను ఇంధనంగా వాడి, విడుదలైన బొగ్గుపులుసు వాయువును సాంకేతికతతో తొలగించి, భూమిలో నిక్షిప్తం చేద్దామనే ఆలోచన ఇంకా ఆచరణయోగ్య దశకు చేరలేదు. గాలిలోని కర్బనాన్ని తొలగించే ఉష్ణమండల అడవులను సంరక్షించుకోవడం ప్రయోజనకరం. ఉష్ణమండల అడవులు (నల్లమల లాంటివి) సహజమైన ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) యంత్రంలా పనిచేసి పరిసరాల ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. అడవుల ధ్వంసం వల్ల పరిసర ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల వరకు పెరగవచ్చు. నల్లమల అడవులు తెలుగు రాష్ట్రాల సహజ వారసత్వ సంపద. ఇవి జీవ వైవిధ్యానికి నెలవుగా ఉన్నాయి. అనేక రకాల వన్యప్రాణులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. యురేనియం తవ్వకాల వల్ల ఈ అడవులు తమ సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. హరితహారం వంటి కార్యక్రమాలు అడవులకు ప్రత్యామ్నాయం కావు. గత 30 సంవత్సరాల్లో తెలంగాణలో దాదాపు 56 వేల హెక్టార్ల అటవీ భూమిని గనుల తవ్వకాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపన, నీటి పారుదల పథకాలు, రక్షణ అవసరాలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 68వేల హెక్టార్ల అటవీ భూములను అభివృద్ధి పథకాల కోసమంటూ మళ్లించారు.

చేదు అనుభవాలు
అణు విద్యుదుత్పాదన పెంచేందుకు యురేనియం తవ్వకాలు చేపడుతున్నట్లు అణుశక్తి శాఖ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో అణుశక్తి స్థాపిత సామర్థ్యం 1.9 శాతమే. ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్‌ వాటా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (2018) నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ప్రస్తుత అణు విద్యుత్‌ వాటా 11శాతం లోపే. 2050 నాటికది 5.6 శాతానికి పడిపోనుందని అంచనా. అణు విద్యుత్‌ ధర కూడా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో ప్రతిపాదించిన అణువిద్యుత్‌ కర్మాగారంలో ఉత్పత్తి చేసే యూనిట్‌ ధర రూ.20 నుంచి రూ.32 వరకు ఉంటుందని ఒక అంచనా. విద్యుదుత్పత్తికి ప్రమాద రహిత ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. థర్మల్‌, జల, సౌర విద్యుత్‌ వంటివి ఉన్నాయి. వాటిని విస్మరించి అడవులను ధ్వంసం చేసి, ఆదిమ తెగ చెంచులను నిర్వాసితులను చేసి, నదులను విషమయం చేసి, పరిసర ప్రాంత ప్రజల బతుకులను పణంగా పెట్టే అణువిద్యుత్తుపై దృష్టి సారించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం తవ్వకాలు చేపట్టిన ప్రతిచోటా ఆ ప్రాంత ప్రజలకు విషాదమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలో జరిగిన విధ్వంసం తెలిసిందే. ఆ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎడారీకరణలో ముందున్న తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలో 31.34 శాతం నేల ఎడారీకరణకు సంబంధించి వివిధ దశల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న కొద్ది అడవులను, అందునా కీలకమైన నల్లమలవంటివాటిని కాపాడుకోవడం అవసరం. ఇక్కడ యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల కలిగే లాభాల కన్నా నష్టాలే అధికం! ఈ నిర్ణయం అటవీప్రాంత ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుంది!

పర్యావరణానికి పెనుశాపం

దట్టమైన అడవులు మేఘాలను ఆకర్షించి వానలు కురిసేలా చేస్తాయి. ఒక చెట్టు ఇచ్చే నీడ, చల్లదనం- ఆధునిక ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) యంత్రం కూడా ఇవ్వలేదు. అడవుల నిర్మూలన వాతావరణంపై చూపే ప్రభావానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు జరిగాయి. అడవుల ధ్వంసం వల్ల వర్షపాతం తగ్గే ప్రమాదం ఉంది. అమెజాన్‌ అడవుల నరికివేతతో కరిబీయన్‌ దీవుల్లో వర్షపాతం తగ్గినట్లు గుర్తించారు. ఇండొనేసియాలోని బోర్నియో దీవిలో అటవీ నిర్మూలన వల్ల ఆ దీవిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వర్షపాతం సైతం తగ్గిందని పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. పులులు, ఇతర వన్యప్రాణులు నశిస్తే నల్లమల అడవులు సహజత్వాన్ని కోల్పోతాయి. ఇప్పుడు జరుగుతున్న వినాశనం పూర్తిగా మానవ ప్రేరితం. అడవుల ధ్వంసం వల్ల కలిగే అనర్థాలపై ఐరాస సదస్సులు, నివేదికలు ఇప్పటికే పలు హెచ్చరికలు చేశాయి. ప్రమాద ఘంటికలు మోగించాయి. వాతావరణ మార్పుల మూలాన దాదాపు పది లక్షల జీవులు అంతరించే దశకు చేరువవుతున్నాయి. కీటకాలు పదేళ్లలో 25 శాతం నశిస్తాయని, 2050 నాటికి 50 శాతం నశిస్తాయని, శతాబ్దాంతానికి పూర్తిగా కనుమరుగవుతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ప్రకృతి సమతూకం దెబ్బతిని మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ప్రకృతి అందించే సేవల ముందు ఆర్థిక వ్యవస్థ కల్పించే ప్రయోజనాలు పరిమితమే.

 (రచయిత- పర్యావరణ రంగ నిపుణులు)

 

(Courtacy Eenadu)

RELATED ARTICLES

Latest Updates