హంతకులెవరు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాజస్థాన్‌ ఆళ్వార్‌జిల్లాలో పెహ్లూఖాన్‌ అనే ఓ పాడిరైతును గోరక్షకులమని అంటున్న కొందరు నడిరోడ్డుమీద కొట్టిచంపిన రెండేళ్ళకు వారంతా నిర్దోషులని అక్కడి సెషన్స్‌ కోర్టు తేల్చేసింది. యాభైఐదేళ్ళ పెహ్లూఖాన్‌ని నడిరోడ్డుమీదకు లాగి, ఆవులతో ఉన్న ఓ ట్రక్కుముందు చావగొడుతున్న వీడియోను దేశమంతా చూసింది. ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించలేమంటూ, దర్యాప్తులో చోటుచేసుకున్న సవాలక్ష అక్రమాలను గుద్దిచెబుతూ విచారణ ఎదుర్కొంటున్న ఆరుగురు నిందితులనూ బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ పేరిట న్యాయమూర్తి వదిలివేశారు. గత ఏడాది ఓ టెలివిజన్‌ చానెల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో గంటన్నరపాటు పెహ్లూఖాన్‌ని తామంతా ఎలా చావగొట్టిందీ గర్వంగా, ఘనంగా చెప్పిన విపిన్‌యాదవ్‌ ఈ తీర్పు తరువాత మనసులో గట్టిగా నవ్వుకొని ఉంటాడు. పెహ్లూఖాన్‌ను ఎవరు చంపలేదు. ఇక, ఏ అనుమానాలు అక్కరలేదు.

దర్యాప్తు ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? పెహ్లూను కొడుతున్న వీడియోను పోలీసులు ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపలేదు. వీడియో తీసిన వ్యక్తి సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాలేదు. మరో సాక్షి ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగాడు. వీడియోలు, ఫోటోలు, స్టింగ్‌ ఆపరేషన్‌ ఎన్ని ఆధారాలున్నా, పోలీసులు ఉద్దేశపూర్వకంగా వేసిన తప్పటడుగుల వల్ల, ఈ ఆరుగురే నేరం చేసినట్టుగా, వారే అక్కడున్నట్టుగా భావించలేమని నిర్థారించేశారు న్యాయమూర్తి. ప్రభుత్వాసుపత్రి పోస్టుమార్టమ్‌ నివేదికకూ, ప్రాథమిక చికిత్స చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రి నివేదికకూ హస్తిమశకాంతరం ఉంది. ఒంటిమీద తీవ్ర గాయాలున్నా అవి ఆవుల్ని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కిస్తున్నప్పుడు కలిగినవే తప్ప, ఎవరో కొట్టిన కొత్త గాయాలు కావని వైద్యులు నిర్థారించేశారు. సంఘటన జరిగిన ఐదుగంటల తరువాత పెహ్లూ వాంగ్మూలం తీసుకున్న పోలీసు అధికారికి వైద్యుడి సంతకం కూడా దానిపై ఉండాలని పాపం తెలియకపోయింది. ఆ ప్రకటన చేస్తున్న సమయానికి పెహ్లూ సరైన మానసికస్థితిలోనే ఉన్నాడన్న నిర్థారణ లేకపోవడంతో అది కూడా న్యాయస్థానంలో వీగిపోయింది. మరణవాంగ్మూలంలో పెహ్లూ చెప్పిన పేర్లకూ, పోలీసులు నిందితులుగా చూపించినవారికీ కూడా తేడా ఉన్నదట. పెహ్లూ మూడురోజుల్లోనే కన్నుమూసినప్పటికీ, అతడి కుమారులు, మిగతా సాక్షులతో నిందితులను గుర్తింపచేసే కార్యక్రమాన్ని కూడా పోలీసులు చేపట్టలేదు. పెహ్లూ ఒంటిపై ఉన్న గాయాలు అతడిని చంపేటంత బలమైనవి కావనీ, ఆస్తమా, గుండెజబ్బు వంటి సమస్యలతో బాధపడుతూ అప్పటికే స్టెంట్లు కూడా వేయించుకున్న అతడు కేవలం గుండెపోటుతోనే మరణించాడన్నది అంతిమంగా నిలబడిన వాదన. రెండువందలమంది దాడి చేశారని పెహ్లూ చెబుతుంటే, పదిమంది ఉండవచ్చని ఆయన కుమారులు ఎలా అంటారన్నది న్యాయస్థానానికి వచ్చిన సందేహం. పైగా, సంఘటన జరిగిన వెంటనే దాడి చేసినవారి పేర్లను చెప్పలేమన్నవారు, ఏడాదిన్నర తరువాత పేర్లు మాత్రమే చెప్పగలిగి, న్యాయస్థానంలో తమకు ఎదురుగా ఉన్నవారిని కూడా గుర్తించలేకపోవడం ఏమిటన్నది న్యాయమూర్తి అనుమానం.

దర్యాప్తు వ్యవస్థలు తలుచుకుంటే, దేశమంతా చూసిన ఓ భయానకఘటనని సైతం సులభంగా నీరుగార్చేయవచ్చని ఈ తీర్పు స్పష్టంచేస్తున్నది. చావుముంగిట్లో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడన్న న్యాయసూత్రం కూడా పెహ్లూకు వర్తించలేదు. తాను స్మగ్లర్‌ని కానని మొత్తుకుంటూ గోరక్షకులకు చూపిన అనుమతి పత్రం అతడి ప్రాణాలు కాపాడలేకపోయినట్టే, అతడి మరణవాంగ్మూలం కూడా ఓ చెత్తకాగితంలాగా మిగిలిపోయింది. పైగా, బాధితులమీదే ఆవుల అక్రమరవాణాదారులన్న ఎదురు కేసు ఒకటి. మూక దాడికేసును అద్భుతంగా నీరుగార్చిన పోలీసులు ఈ కేసును మాత్రం న్యాయస్థానాల అనుమతితో వేగంగా ముందుకు తీసుకుపోయారు. గత ఏడాది డిసెంబరులో తీవ్ర వివాదం రేగిన తరువాత, ఈ ఏడాది జూన్‌లో సమర్పించిన చార్జిషీటులో చనిపోయిన వ్యక్తిగా పెహ్లూ పేరు తొలగిపోయి ఉండవచ్చును కానీ, అతడి కుమారులను మాత్రం ఈ కేసు బలంగా వెంటాడుతున్నది. పెహ్లూ కేసును నీరుగార్చేందుకు వసుంధర రాజే కాలం నుంచి సాగుతున్న కుట్రను వమ్ముచేయడానికి అశోక్‌ గెహ్లాట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నించకపోవడం విశేషం. ఎందుకూ కొరగాని ఆధారాలు, వీగిపోయే వాదనలు అవే కొనసాగుతూ చివరకు దేశాన్ని కుదిపేసిన ఓ కేసు ఇలా కొట్టుకుపోయింది. న్యాయమూర్తి సైతం ఏ మాత్రం చొరవచూపకుండా పుస్తకానికి కట్టుబడిపోవడం ఆశ్చర్యకరం. వీడియో నిజాలు సైతం నిలబడకుండా పోయి, అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని అప్రదిష్టపాల్జేసిన ఓ కేసు ఇలా అయిపోతే, ఇక మూకదాడులకు అడ్డేముంటుంది, ఉన్మాదులను ఆపగలిగేదెవ్వరు?

(Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates