కాళేశ్వరమా, ప్రజల మూపులపై ఐరావతమా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎన్‌. వేణుగోపాల్‌ 

ఒక మాటను అన్నవారికి చిత్తశుద్ధి లేదనో, విశ్వసనీయత లేదనో, వారిని లెక్కించనక్కరలేదనో నిందలు వేసి, దూషించి ఆ మాటను కొట్టివేయడం సులభం. కాని ఏ మాటా ఎవరి గుత్తసొమ్మూ కాదు. నిజంగానే ఆ మాట అన్నవారికి దురుద్దేశాలూ, స్వప్రయోజనాలూ ఉండవచ్చు. అందువల్ల తప్పుడు వాదనలతో ఆ నిర్ధారణను సమర్థించుకుంటూ ఉండవచ్చు. కానీ అదే మాట, అదే నిర్ధారణ వేరువేరు వైపుల నుంచి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రజాప్రయోజనం వైపు నుంచి కూడా అదే మాట రావచ్చు. వేరు వేరు కోణాల నుంచీ, వేరువేరు ప్రయోజనాల కోసమూ కూడా ఒకే రకమైన మాటలు రావచ్చు. ముఖ్యంగా ఆ మాట చరిత్రకూ, రాజకీయార్థిక అవగాహనకూ సంబంధించినది అయినప్పుడు అన్నవారి ఉద్దేశాలు మాత్రమే చూపి, అసలు విషయాలు దాటవేయడం, కొట్టివేయడం కుదరదు. అప్పుడు ఆ మాటను అన్న వ్యక్తిని, వ్యక్తులను పక్కనపెట్టి, దానికదిగా స్వతంత్ర ప్రమాణాలతో చర్చించవలసి ఉంటుంది.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే కాళేశ్వరం కరెంటు బిల్లు తడిసి మోపెడవుతున్నదని, తొలి నెలరోజుల్లో ఎనిమిది టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి 11కోట్ల 57లక్షల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని, ఈ లెక్కన సగటున ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి రూ.1.44 కోట్లు అవసరమైందని, అంటే ఎకరానికి కరెంటుబిల్లే లక్షా నలబైనాలుగు వేల రూపాయలు కావచ్చునని కొన్ని పత్రికలలో, ప్రసారసాధనాలలో వార్తలు వచ్చాక, ఒకరిద్దరు పరిశీలకులు దాని మీద తమ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద ప్రభుత్వం తరఫున స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరి నుంచి సలహాదార్ల వరకూ ఎందరో ప్రతి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఆహ్వానించదగిన చర్చా సంప్రదాయమే ప్రజాస్వామ్య స్ఫూర్తికీ, భిన్నాభిప్రాయాల మధ్యన అటుకొసనో, ఇటు కొసనో కాక వాస్తవం మధ్యలో ఎక్కడో ఉన్నదని నిగ్గు తేలడానికీ వీలు కల్పిస్తుంది. అయితే చర్చ పేరుతో అధికారపక్షం ఆ వ్యాఖ్యలు చేసినవారి దురుద్దేశాలను వెతకడం, వారిని ఆంధ్ర పాలకవర్గ ఏజెంట్లుగా అభివర్ణించడం, మహాఘనత వహించిన తెలంగాణాధీశులవారు మరొక అడుగు ముందుకువేసి వ్యాఖ్యాతలు పిచ్చివాళ్లని వ్యాఖ్యానించడం కూడా జరిగాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో రీడిజైన్‌ అవసరం, ఔచిత్యం, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన నిర్మాణ వ్యయం, ఆంధ్ర కాంట్రాక్టర్లకే దోచిపెట్టడం, నిర్వాసితులకు జరిగిన అన్యాయాలు, నీటిపారుదల గణాంకాలలో అతిశయోక్తులు, అబద్ధాలు, అర్ధసత్యాలు, బుకాయింపులు, వంటి ఎన్నెన్నో ప్రజలు బహిరంగంగా చర్చించవలసిన అంశాలు, ప్రభుత్వ దగాకోరుతనాన్ని బైటపెట్టే అంశాలు ఉన్నాయి గానీ, అవన్నీ పక్కనపెట్టినా కాళేశ్వరం నీటికి కరెంటుఖర్చు ఎంత రానున్నదనే విషయంలో, ఈ కరెంటు ఖర్చుతో తెలంగాణలో వ్యవసాయం సాధ్యమేనా అనే విషయంలో వాస్తవాలేమిటి?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారంకు నీళ్లు ఎత్తిపోసేందుకు జూన్‌ 21న ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసినప్పటి నుంచి మొదటి నెలలో ఎనిమిది టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడం జరిగిందనే మాట వాస్తవం. ఆ ఎనిమిది టీఎంసీల నీరు ఎత్తిపోసినందుకు గాను కన్నెపల్లి పంప్‌ హౌజ్‌లో వినియోగించిన 1,97,87,000 యూనిట్ల కరెంటుకు రూ.20 కోట్ల బిల్లు వచ్చిందనేది వాస్తవం. ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు, వక్రీకరణలకు పూనుకున్నా కనీసం ఈ రెండు వాస్తవాలను కాదనడానికి లేదు.

ఇక అక్కడినుంచి ప్రభుత్వ వంచనాశిల్పం మొదలవుతుంది. ఒక టీఎంసీతో ఎన్ని ఎకరాల పంటకు నీరు అందించవచ్చు అనే విషయంలో స్వయంగా ఇదే మేధావులు, ఇప్పటి అధికారపక్షపు నాయకులు 2001 నుంచీ 2014 వరకూ చేసిన వాదనలనే తిరిగి వారికి వినిపిస్తే సరిపోతుంది. అప్పుడు ఒక టీఎంసీకి పదిహేను, పదహారు వేల ఎకరాలు సాగవుతాయని చెపుతూ తెలంగాణలో కాలువల కింద సాగవుతున్న విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాదిస్తే, నాటి తెలంగాణవాదులు అది దొంగలెక్క అని ఖండించారు. నీరు ఎక్కువ అవసరమయ్యే వరి వంటి పంటలకైతే ఒక టీఎంసీ నీటితో ఆరు-ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే సాగవుతుందని, సగటున పదివేల ఎకరాల కన్న ఎక్కువ సాగు చేయడం అసాధ్యమని అన్నారు. నీరు పల్లమెరుగు అని సామెత ఉంది గాని నీరు ఆంధ్రప్రదేశ్‌ పాలకుల కాలంలో ఒకలాగ, తెలంగాణ పాలకుల కాలంలో ఒకలాగ ప్రవహిస్తుందనడానికి లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ పాలకులు వరికి కూడా పదివేల ఎకరాలు, వీలైనచోట్ల అంతకన్న ఎక్కువ కూడా లెక్క కడుతున్నారు. అందువల్ల సగటున ఎకరానికి అయ్యే ఖర్చు తగ్గించి చూపాలని ప్రయత్నిస్తున్నారు.

అంతకన్న మించిన వంచనాపూర్వక వాదన కరెంటు యూనిట్‌ ఖరీదు విషయంలో జరుగుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో తాజాగా వచ్చిన బిల్లు ప్రకారం ఒక యూనిట్‌ ధర రూ.5.84 కాగా, ప్రభుత్వ పక్షం ఇష్టారాజ్యపు దొంగలెక్కలతో, బుకాయింపు వాదనలతో భవిష్యత్తులో ఈ ఖరీదు రూ.3.46కు పడిపోతుందని చెపుతున్నది. భవిష్యత్తులో ధరలు పడిపోతాయనే పచ్చి అబద్ధాన్ని పక్కనపెడితే, తొలిరోజుల్లో ఎక్కువ ఖర్చు కావడం సహజమేనని, భవిష్యత్తులో సౌరవిద్యుత్తు కలుస్తుంది గనుక ధర తగ్గుతుందని ఆకుకు అందని పోకకు పొందని హాస్యాస్పద అబద్ధాలతో ప్రజల కండ్లలో దుమ్ము కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ రెండు రకాల వంచనావాదనలను ఉపయోగించి నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎకరానికి కరెంటు ఖర్చు ఎంత వస్తుందో ప్రభుత్వానికి కూడా కొన్ని అంకెలు ఇవ్వక తప్పలేదు. ఆ లెక్కల ప్రకారం లింక్‌ 1లో ఎకరానికి రూ.5,705, లింక్‌ 2లో రూ.17,780, లింక్‌ 3లో రూ.33,362, లింక్‌ 4లో రూ.37,881 అని చెపుతున్నారు. ఈ అంకెలన్నీ పైన వివరించిన రెండు తప్పుడు వాదనల మీదనే ఆధారపడ్డాయి గనుక వీటిని కనీసం 30శాతం ఎక్కువ చేసి చదువుకోవలసి ఉంటుంది.
ఈ కరెంటు ధర ఎప్పటికప్పుడు, ఏడాదికేడాదికి పెరుగుతుందనేది ఒక అంశం. ఈ ఎత్తిపోతల పథకానికి జరిగిన నిర్మాణ వ్యయాన్ని కూడా ఆ నీటిపారుదలను ఉపయోగించుకునే భూమి మీద విభజించి చూడాలనేది మరొక అంశం. అలా చూసినప్పుడు రానున్న రోజులలో తెలంగాణ వ్యవసాయం కరెంటుకే ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుందో ఊహించడానికే భయం వేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న లెక్కలన్నీ అక్షరాలా సరైనవేనని అనుకున్నా, తెలంగాణ వ్యవసాయ నేపథ్యంలో ఆ మాత్రం అంకెల ఖర్చు కూడా వ్యవసాయానుకూలమైనది కాదని చెప్పవలసి ఉంటుంది.

దేశంలో వ్యవసాయ వ్యయాలను ఎప్పటికప్పుడు అంచనా కట్టడానికి, తద్వారా వ్యవసాయ ఆదాయ వ్యయాలను అంచనావేసి, రైతులకు కనీస మద్దతు ధరల వంటి సహాయాలు సూచించడానికి ఒక కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దాని అంచనాల ప్రకారం వ్యవసాయ వ్యయంలో వినియోగించే మానవశ్రమ వేతనాలు, పశుగణం ఖర్చు, యంత్ర పరికరాల ఖర్చు, పరికరాల తరుగుదల ఖర్చు, విత్తనాల ఖర్చు, ఎరువుల, క్రిమిసంహారకాల ఖర్చు, నీటి పారుదల ఖర్చు, పన్నులు, పెట్టుబడిపై వడ్డీ, కౌలు, కుటుంబ శ్రమ ఖర్చు తదితర దాదాపు ఇరవై రకాల కారకాలను లెక్కిస్తారు. వీటిలో విద్యుత్‌ ఖర్చు (దాన్ని కూడ నీటిపారుదల ఖర్చు అని మాత్రమే అంటారు) ఒకానొకటి మాత్రమే. ఇటువంటి గణాంకాలను దాదాపు ఇరవై ఆరు పంటలకు తయారు చేస్తారు. అందులో కేవలం వరినే చూస్తే, దొరుకుతున్న తాజా గణాంకాల (2015-16) ప్రకారం హెక్టారుకు రూ.42,940 నుంచి రూ.81,811 వరకు వ్యయం జరుగుతున్నది. అంటే ఎకరానికి రూ.17,384 నుంచి రూ.33,121 ఖర్చు వస్తున్నదన్నమాట. ఇందులో నీటిపారుదల వ్యయం హెక్టారుకు రూ.1312 అని, అంటే ఎకరానికి రూ.531 అని ఈ గణాంకాలు చెపుతున్నాయి. (ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింది వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగానికి చెందిన అర్థ, గణాంక డైరెక్టరేట్‌ వెబ్‌ సైట్‌ మీద పొందు పరిచినవి).

అంటే, తెలంగాణ ప్రభుత్వం అన్నీ నిజాలే చెపుతున్నదని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం రైతులు కరెంటు మీద, నీటి పారుదల మీద పెడుతున్న ఖర్చు హఠాత్తుగా లింక్‌ 1లో ఎకరానికి కనీసం పది రెట్లు, లింక్‌ 2లో కనీసం ముప్పై రెట్లు, లింక్‌ 3లో కనీసం అరవై రెట్లు, లింక్‌ 4లో కనీసం డెబ్బై రెట్లు పెరుగుతుందన్నమాట. ఈ లెక్కన వ్యయం పెరిగితే, దానికి తగినట్టు, గిట్టుబాటు ధరలు పెరగవని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అంటే ఈ నీళ్లతో వరి వంటి పంటలు పండించి, మిగులు అలా ఉంచి, పెట్టిన పెట్టుబడిని కూడా రాబట్టడం అసాధ్యం. బంగారు తెలంగాణలో కాళేశ్వరం నీళ్లతో బంగారం పండించడం సాధ్యమవుతుందని ఏలినవారు కలలు కంటున్నారేమో తెలియదు. ఏడాదికి ఇరవైఐదు వేల కోట్ల రూపాయల విలువచేసే మత్స్య సంపద పెరుగుతుందని, మరెన్నో వేల కోట్ల గొర్రెల మాంసం తయారవుతుందని, రాష్ట్ర ఆదాయంలో గణనీయ భాగం వాటినుంచే వస్తుందని మూడు సంవత్సరాల కింద కోసిన ప్రగల్బాలు ప్రజలు ఎలాగూ మర్చిపోయారు గనుక, ఇప్పుడు కాళేశ్వరం నీటితో బంగారం పండించి అందులోంచి కొన్ని తులాలు కరెంటుకు ఖర్చు పెట్టవచ్చునని కొత్త ప్రగల్బాలు పలికి నమ్మించవచ్చు కూడా.
కోటి ఎకరాలకు నీరు అందించడం అనే కలను అమ్ముతూ వాస్తవంగా విద్యుత్‌ యంత్ర పరికరాలు, పైపులు, సిమెంట్‌ తదితర ఉత్పత్తుల బహుళ జాతి సంస్థల, వారి దళారీల, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం, లాభాల కోసం తయారైన ఈ పథకం వాస్తవంగా తెలంగాణ ప్రజలకు మేలు చేస్తుందో లేదో తెలియదు గానీ, వారి వీపుల మీద గుదిబండగా, తెల్ల ఏనుగుగా మాత్రం మారుతున్నది. నిర్మాణ వ్యయం కోసం వెచ్చిస్తున్న ప్రజాధనం, తెస్తున్న అప్పులు, వాటి మీద వడ్డీలు అంతిమంగా ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు కట్టవలసినవే. వాడుకుంటున్న నీటికి కూడా వినియోగదారుల నుంచి పన్నులు వసూలు చేస్తామని, కాకపోతే తక్షణమే చేయలేమని ఫైనాన్స్‌ కమిషన్‌ ముందర ఈ ఫిబ్రవరి 20న స్వయంగా తెలంగాణాధీశులు బాజాప్తా, అక్షరాలా ప్రకటించారు. అంటే, కాళేశ్వరం నీళ్లు అందడం అనే కల ఎలా ఉన్నా, తెలంగాణ ప్రజలు మొత్తంగానూ, ఆ నీరు వస్తే గిస్తే వాడుకునే రైతులు ప్రత్యేకంగానూ ఏటా కొన్ని వేల కోట్లు చెలిస్తూ ఉండవలసిందే. ఆ పథకం ఇప్పుడు ఏలినవారి మోజు కావచ్చు, ఆ ఏలినవారు మరొక ఐదేండ్లకో, పదేండ్లకో ఏలినవారిగా కూడా ఉండకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం తమ మూపుల మీద ఈ తెల్ల ఏనుగుల బండలను కనీసం కొన్ని దశాబ్దాల పాటు మోయవలసిందే.

 

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates