ఆత్మహత్యల సంగతేంటి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • ఇంటర్‌విద్యార్థుల మృతిపై రాష్ట్రపతి ప్రశ్న
  • తక్షణమే నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం
  • కేంద్ర హోం శాఖకు కూడా ఉత్తర్వులు
  • బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విజ్ఞాపనకు స్పందన

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ కోరింది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాలు తప్పుల తడకలుగా వెలువడిన విషయం తెలిసిందే. మెరిట్‌ విద్యార్థులు కూడా ఫెయిలయ్యారు. వారిలో కొందరికి సున్నా మార్కులు కూడా వచ్చాయి. ఫలితాలతో మనస్తాపానికి గురై వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్‌ బోర్డుకు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థదే తప్పంటూ అప్పట్లో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే, విచారణకు ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు జరిగాయని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది.

వేల మంది విద్యార్థుల విషయంలో వివిధ స్థాయుల్లో తప్పులు జరిగాయని స్పష్టం చేసింది. కొంతమంది విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లను బబ్లింగ్‌ చేయడంలో తప్పు జరిగితే.. మరికొందరి విషయంలో మెమోల్లో తేడాలు వచ్చాయని తెలిపింది. ఇంకొందరి విషయంలో కోడింగ్‌, డీకోడింగ్‌లలో తప్పులు జరిగాయని తేల్చింది. ఇందుకు ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థ.. రెండింటిదీ తప్పు ఉందని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాల వల్లే తప్పులు జరిగాయని, వీటిని బోర్డు, గ్లోబరీనా సకాలంలో గుర్తించలేకపోయాయని ఆక్షేపించింది. ఇంటర్‌ బోర్డుకు సాంకేతిక సహకారాన్ని అందించిన గ్లోబరీనా సంస్థకు లోపాలను సరిదిద్దే వ్యవస్థ లేదని తప్పుబట్టింది. మెమోల్లో ‘ఏపీ (ఆబ్సెంట్‌ పాస్‌)’; ‘ఆబ్సెంట్‌ ఫెయిల్డ్‌ (ఏఎఫ్‌)’ విషయంలో గందరగోళం నెలకొందని తెలిపింది. 4,288 మంది ఎంఈసీ విద్యార్థులకు సంబంధించిన మ్యాథ్స్‌ సబ్జెక్టులో సింగిల్‌ డిజిట్‌ మార్కులు వేశారు. అంటే.. ఒకటి వస్తే 01 అని.. 9 వస్తే.. 09 అంటూ డబుల్‌ డిజిట్‌లలో వేయాలి. కానీ… 1, 9 అంటూ సింగిల్‌ డిజిట్‌లలో మార్కులు వేశారని తప్పుబట్టింది. కొంతమంది విద్యార్థుల విషయంలో ఓఎంఆర్‌ బబ్లింగ్‌లో మానవ తప్పిదం (హ్యూమన్‌ ఎర్రర్‌) జరిగిందని తేల్చింది.

ఓ విద్యార్థి విషయంలో 99కు బదులు 00 అని బబ్లింగ్‌ చేశారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే, ఇంటర్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం గత నెల 1న రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం అందజేసింది. వరుసగా జరుగుతున్న విషాద ఘటనలను మీ దృష్టికి తీసుకురావడం తప్ప మరో గత్యంతరం లేకపోయిందని అందులో పేర్కొంది. తీవ్ర మానసిక వేదన కలిగించడం ద్వారా ప్రభుత్వ సంస్థలే అమాయక విద్యార్థుల జీవించే హక్కును హరించి వేశాయని, అయినా, ఏమీ జరగలేదంటూ ప్రభుత్వం తేల్చేసిందని వివరించారు. రాష్ట్రపతి జోక్యాన్ని కోరడం తప్ప తమకు మరో మార్గాంతరం లేకపోయిందని పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యలు, అందుకు దారి తీసిన పరిస్థితులపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నామని, ఈ మేరకు గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను ప్రస్తావించింది. కమిటీ అంత స్పష్టంగా నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎవరిపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

(Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates