గుడ్లు చాలవు.. పాలు అందవు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
అంగన్‌వాడీల్లో అస్తవ్యస్త సరఫరా 
స్టాకు ఉన్నా అధికారుల అలసత్వం
పౌష్టికాహార లోపంతో పిల్లలు,బాలింతల అవస్థలు

 

అంగన్‌వాడీల్లో పౌష్టికాహార పంపిణీ గాడి తప్పుతోంది. పంపిణీలో సమస్యలను పరిష్కరించకపోవడం… పలు చోట్ల పంపిణీ దారులను ఎంపిక చేయకపోవడం… స్టాకు ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాశీన వైఖరితో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలు తీవ్రమవుతున్నాయి.ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ రోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. పౌష్టికాహారలోపం తీవ్రంగా ఉన్న పిల్లలు, బాలింతకు అదనంగా మరో 100 మిల్లీ లీటర్ల పాలు అందజేయాలి. వీటితో పాటు పూర్తి పోషక విలువలున్న ఆహారాన్ని సైతం వడ్డించాలి. కానీ చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్ల పంపిణీ గందరగోళంగా మారింది. పలు జిల్లాల్లో పాలు, గుడ్ల సరఫరాదారుల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని చోట్ల సరఫరా దారులను ఎంపిక చేసినప్పటికీ సాంకేతిక కారణాలు, సరఫరాలో సమస్యలను అధిగమించకపోవడంతో అది అస్తవ్యస్తంగా మారింది.

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. వీటి పరిధిలో 5.31లక్షల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 7నెలల నుంచి 3 ఏళ్ల లోపు వయసున్న వారు 10.42 లక్షల మంది, ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 6.54లక్షల మంది నమోదయ్యారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారాన్ని అందివ్వాలి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఈ క్రమంలో అంగన్‌వాడీల్లో హాజరు శాతం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పాలు, గుడ్లు పొందిన వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. సిద్దిపేట, ఆసీఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో హాజరు, లబ్ధి వత్యాసం అధికంగా ఉంది. ఈ వత్యాసాన్ని లోతుగా పరిశీలిస్తే అక్కడ సరుకుల పంపిణీలోని లొసుగులు బయటపడుతున్నాయి.

రెండు నెలలుగా అరకొరే… 
అంగన్‌వాడీ కేంద్రాలకు గత రెండు నెలలుగా పాలు, గుడ్ల సరఫరా లోపభూయిష్టంగా ఉంది. కేంద్రాలకు హాజరవుతున్న విద్యార్థుల ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ కాకపోవడంతో సరఫరా కావడం లేదని కొన్నిచోట్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటీపీలు రావడం లేదని, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గుడ్లు ఇవ్వలేక పోయామని కాంట్రాక్టర్లు అంటున్నారు. వాస్తవానికి ఓటీపీలు రాకపోతే సీడీపీఓలకు మరోమారు అర్జీ పెడితే సరిపోయేదని, కాంట్రాక్టర్లు తప్పించుకునే ధోరణితో ఇలా సరఫరా చేయడం లేదంటున్నారు. పలురకాల సమస్యలతో అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు చేరడం లేదు. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం గమనార్హం. అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ ఆగమాగం కావడంతో చిన్నారులు, బాలింతల్లో పోషకాహార సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

(Courtacy Sakshi)

RELATED ARTICLES

Latest Updates