కేంద్రంపై కినుక!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • రక్షణశాఖకు భూ కేటాయింపులపై రాష్ట్రం మెలిక
  • తాము అడిగిన భూములు ఇవ్వకపోవడంపై అసంతృప్తి
  • నౌకాదళానికి కేటాయించిన 2,934 ఎకరాలు పెండింగులో
  • ఇతర ప్రాజెక్టులపైనా ఇదే ధోరణి

తెలంగాణలో అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములను కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్న రాష్ట్రప్రభుత్వం.. అదే శాఖకు అవసరమైన భూకేటాయింపులపై పునరాలోచించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వికారాబాద్‌లో రక్షణశాఖ పరిధిలోని నౌకాదళానికి కేటాయించిన 2,934 ఎకరాల అప్పగింతను పెండింగులో పెట్టినట్లు తెలిసింది. ఈ అంశం కేంద్రం దృష్టికి వెళ్లడంతో నేవీ అధికారులు రంగంలోకి దిగితెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో కొత్త సచివాలయం, హైదరాబాద్‌ వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డిపి) కింద రాజీవ్‌ రహదారి, 44వ నంబరు జాతీయ రహదారి (హైదరాబాద్‌-నాగ్‌పుర్‌)పై ఆకాశమార్గం (స్కైవే) నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల కోసం సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానం, రక్షణశాఖకు చెందిన 200 ఎకరాల భూమిని కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్రమంత్రులు, ఎంపీలు.. ఈ విషయమై ప్రధాని మోదీ, రక్షణ మంత్రులను కోరినా వారినుంచి సానుకూల స్పందన లభించలేదు. దీంతో ప్రస్తుతం సచివాలయం ఉన్నచోటనే కొత్త భవనాన్ని నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఎస్‌ఆర్‌డీపీ కింద రాజీవ్‌ రహదారి, 44వ నంబరు జాతీయ రహదారిలో ఆకాశమార్గాల నిర్మాణం పెండింగులో ఉంది. రక్షణశాఖ భూమి ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ వైఖరిపై కేంద్రం వద్ద ఒత్తిడి తేవాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

కేంద్రం ప్రతిపాదనలపై రాష్ట్రం ఆరా
ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించిన భూముల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. వికారాబాద్‌ దామగుండం వద్ద అతి తక్కువ సామర్థ్యం(వీఎల్‌ఎఫ్‌) రాడార్‌ సమాచార కేంద్రం స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం 2934 ఎకరాల అటవీ భూమిని నౌకాదళానికి సూత్రప్రాయంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 1,090 ఎకరాల్లో రాడార్‌ కేంద్రం, 100 ఎకరాల్లో నేవీ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం, 1500 ఎకరాల్లో హరితహారం ఏర్పాటు చేయాలి. భూకేటాయింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నౌకాదళానికి పలు సూచనలు చేసింది. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ స్థలంలో మొక్కల పెంపకం, రాడార్‌ కేంద్రం నిర్మించే స్థలం వద్ద ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, 32 ఎకరాల భూపరిహారం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సూచనల అమలుకు నౌకాదళం సన్నాహాలు చేపట్టింది. దీనికి కేంద్రం నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి.

తాజా నిర్ణయమిదీ
Difeతమకు భూములు ఇవ్వకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాడార్‌ ప్రాజెక్టు విషయంలోనూ పునరాలోచన చేయాలని తాజాగా నిర్ణయించింది. వికారాబాద్‌ జిల్లాలో రాడార్‌ కేంద్ర ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పక్కన బెట్టారు. నేవీ అధికారులు ఇప్పుడు తమ పనుల కోసం వీరిని సంప్రదించినా స్పందించడం లేదు. ఇటీవల నేవీ అధికారులు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో రక్షణశాఖ నుంచి భూ కేటాయింపులపై స్తబ్దత కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ శాఖకు భూములివ్వడంపై ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిని నేవీ అధికారులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. సమస్య క్లిష్టంగా మారడంతో ఈస్టర్న్‌ నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసేందుకు సమయం కోరారు. ఈ సందర్భంగానూ సీఎస్‌ సైతం తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో కోరిన దాదాపు 8 భూసేకరణ ప్రతిపాదనలు సైతం పెండింగులో పెట్టాలని భావిస్తోంది. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ఓడను ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే నౌకాదళం ప్రాజెక్టు ఇందులో ఉంది. దీనికోసం మూడెకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దీనిని కూడా పెండింగులో పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఈ అంశాన్ని నేవీ అధికారులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టులు

కొత్త సచివాలయం, స్కైవేల కోసం.

కోరిన భూములు…

సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానం.

రక్షణశాఖకు చెందిన 200 ఎకరాలు.

కేంద్రం వైఖరి

ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్రమంత్రులు, ఎంపీలు.. ప్రధాని మోదీ, రక్షణ మంత్రిని కోరినా స్పందన శూన్యం.

(ఈనాడు సౌజన్యంతో)

RELATED ARTICLES

Latest Updates