అడ్డూ.. అదుపులేని అధికారదాహం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు
– మోడీ అధికారంలోకి వచ్చాక 11రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు
– రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ..
– అర్థ, అంగబలంతో అధికారం : రాజకీయ విశ్లేషకులు

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా 43మందిపై ఆదాయ పన్ను శాఖ అధికారులతో దాడులు చేయించారు. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మద్దతుదారుల్లో భయాందోళనలు రేకెత్తించటమే ఐటీ దాడుల వెనుకున్న వ్యూహం. గత 6ఏండ్లలో 11రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు ఇదేవిధంగా కుట్రలు జరిగాయి. బీజేపీ అధికారదాహానికి మరో రాష్ట్రం బలయ్యే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజల్ని వెంటాడుతుంటే, అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటంపై కేంద్రంలోని పాలకులు దృష్టి సారించారని వారు విమర్శించారు.

న్యూఢిల్లీ : అనేక రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీవైపు మొగ్గుచూపలేదు. ప్రతిపక్షాల్ని ఎన్నుకున్నాయి. దీనిని సహించలేని మోడీ సర్కార్‌ రాజకీయ కుట్రలకు తెరల ేపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఐటీ, సీబీఐ, ఈడీ…వంటి సంస్థలతో రాజకీయ ఎత్తుగడలను అమలుజేయటం వివాదాస్పదమవుతున్నది. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో…అధికార పీఠం కోసం ఎంతగా దిగజారారో అందరికీ తెలిసిందే. రాజస్థాన్‌లోనూ అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని పెద్దలు రకరకాల వ్యూహాలు అమలుజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దాడులుచేయించటం,ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురిచేయటం..ముఖ్యమైన వ్యూహాలుగా ఉన్నాయి. రాజస్థాన్‌లోనూ ఈ వ్యూహాల్నే ఎంచుకున్నారు. ప్రస్తుతానికి అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని అభద్రతలోకి నెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని అనిశ్చిత వాతావరణం అక్కడ నెలకొంది.

ప్రధానిగా మోడీ అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురైంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, కర్నాటక…వంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రజలు మోడీ-అమిత్‌ షా ద్వయాన్ని తిరస్కరించారు. ఓటర్లు ప్రతిపక్షాల్ని ఎన్నుకున్నాయి. దీనిని జీర్ణించుకోలేని కేంద్రంలోని పెద్దలు రాజకీయ కుట్రలకు తెరలేపారు. రాజస్థాన్‌తో కలుపుకొని 11 రాష్ట్రాల్లో ఈ కుట్రలు సాగాయి. ధనబలం, బెదిరింపులు, గవర్నర్ల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. మహారాష్ట్ర ఉదంతంలో మోడీ-అమిత్‌ షా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన…సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి వచ్చింది. పోలీసు కేసులు, సీబీఐ, ఐటీ, ఎన్‌ఫోర్స్‌మేంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులతో ప్రభుత్వాల్ని కూల్చడం రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజస్థాన్‌ (2020) : కాంగ్రెస్‌ పార్టీలో చీలిక. కాంగ్రెస్‌కు సచిన్‌ పైలట్‌ గుడ్‌ బై. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చివరిఘట్టం మొదలైంది. ఎంతమంది ఎమ్మెల్యేలు సచిన్‌ పైలట్‌ వెంట ఉన్నారన్నది తెలియదు. అభద్రత, అనిశ్చిత పరిస్థితుల్లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం కొనసాగుతున్నది.

మధ్యప్రదేశ్‌ (2019): కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసినట్టుగానే మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ రాజకీయ కుట్రలు సాగాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరటం సంచలనం సృష్టించింది. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ అధికారంలోకి వచ్చింది.

మహారాష్ట్ర (2019) : బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం ఇది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేన చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేక పోయింది. నాటకీయ పరిణామాలు, రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయటంతో బీజేపీ ఎత్తుగడలు సజావుగా సాగలేదు. ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ను తమవైపునకు లాక్కున్నా ఫలితం దక్కలేదు. రాజకీయ సంక్షోభంలో గవర్నర్‌ కొశ్యారీ పాత్ర వివాదాస్పదమైంది. బీజేపీ రాజకీయ కుట్రలను ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ గట్టిగా తిప్పికొట్టాయి.

కర్నాటక (2019లో) : ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెండుసార్లు రాజకీయ కుట్రలు జరిగాయి. గుజరాత్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే వజూభాయి పటేల్‌ రాష్ట్ర గవర్నర్‌గా ఉండటంతో, ఆయన అండదండలతో మెజార్టీ లేకున్నా ఎడ్యూరప్ప ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది. విశ్వాస పరీక్షలో ఎడ్యూరప్ప ఓడిపోయారు. జేడీ(యూ) నాయకుడు కుమారస్వామి సీఎం అయ్యారు. మళ్లీ రాజకీయ కుట్రలకు తెరలేపి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోశారు. తిరిగి బీజేపీ నాయకుడు ఎడ్యూరప్ప సీఎం అయ్యారు.

మేఘాలయ (2018) : 60 అసెంబ్లీ స్థానాలున్న శాసనసభలో బీజేపీ బలం కేవలం 2. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీతో కూటమి కట్టి, గవర్నర్‌ గంగా ప్రసాద్‌ సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

మణిపూర్‌ (2017) : 60 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ బలం 21, కాంగ్రెస్‌ బలం 28. గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా సహకారంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పిలుపునందుకుంది. రెండు ప్రాంతీయ పార్టీలైన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, లోక్‌జన్‌ శక్తిపార్టీల ఎమ్మెల్యేలతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది.

గోవా (2017) : 40 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీకి దక్కినవి 13. కాంగ్రెస్‌ 17స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఎమ్మెల్యేలను ధనబలంతో బీజేపీ తనవైపునకు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు.

బీహార్‌ (2015) : 243 స్థానాలకు ఎన్నికలు జరగగా, ఆర్జేడీ-నితీష్‌ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. బీజేపీ 53స్థానాలకు పరిమితమైంది. కొద్దినెలల తర్వాత ఆర్జేడీ నుంచి నితీష్‌కుమార్‌ను బయటకులాగటంలో బీజేపీ పెద్దలు సక్సెస్‌ అయ్యారు. జులై 2017లో నితిష్‌కుమార్‌-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

జార్ఖండ్‌ (2014) : 81స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ గెలుచుకున్నవి కేవలం 35. మిత్రపక్షం ఆల్‌ జార్ఖాండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌కు 5 స్థానాలున్నా మెజార్టీ మార్క్‌ రాలేదు. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేసిన జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా పార్టీకి చెందిన 6గురు ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ (2014) : ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు దేశాన్నే నివ్వెరపర్చాయి. కాంగ్రెస్‌ బలం 42, బీజేపీ బలం 11. పీపుల్స్‌ పార్టీకి 5, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వరుస రాజకీయ సంక్షోభాలు, గవర్నర్‌ సహకారంతో అసెంబ్లీలో బలాబలాలు మారిపోయాయి. బీజేపీ బలం 48కు, కాంగ్రెస్‌ బలం 1కి పడిపోయింది. ఫైనల్‌గా బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates