హక్కులకు సంకెళ్ళు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

70వ రాజ్యాంగ అవతరణ దినోత్సవాలు జరుపుకున్న సంవత్సరంలోనే ఆ రాజ్యాంగం ప్రసాదించిన పౌరుల ప్రాథమిక హక్కులపై బీజేపీ ప్రభుత్వాలు దాడులకు తెగబడుతుండడం కాకతాళీయం కాదు. రాజ్యాంగమన్నా, మానవ హక్కులన్నా బీజేపీ లెక్కలేనితనానికి, దాని నిరంకుశ స్వభావానికి ఇదొక నిదర్శనం. ఈ పరిస్థితుల్లో మానవ హక్కుల పరిరక్షణకు మరో పోరాటం అవసరం.

కరోనా మహమ్మారిపై పోరులో ప్రజలు ఉంటే, మానవ హక్కుల హననంలో బీజేపీ ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి. కరోనా కట్టడిలోను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలోను ఘోరంగా విఫలమైన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలోని బీజేపీ ప్రభుత్వాలు అణచివేత చర్యలను తీవ్రతరం చేశాయి. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని అవాంఛనీయ నేరాల నిరోధక చట్టం (ఏయూపీఏ) వంటి క్రూరమైన చట్టాల కింద అరెస్టు చేసి జైలులో కుక్కుతున్నాయి. రాజకీయ నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, చివరికి జర్నలిస్టులను సైతం వదలిపెట్టడం లేదు. ఉగ్రవాదం, దేశ ద్రోహం వంటి కల్పిత, తప్పుడు నేరాభియోగాలను మోపి బెయిలు కూడా పుట్టకుండా చేస్తున్నవి. ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతమ్‌ నవలఖా, సుధా భరద్వాజ్‌, సోమ సేన్‌, ప్రొఫెసర్‌ సాయిబాబా, అఖిల్‌ గొగోరు, వరవరరావు వంటి సామాజిక కార్యకర్తలను, ప్రముఖ మేధావులను చీకటి చట్టాల కింద అరెస్టు చేసి నెలల తరబడి జైలులో పెట్టి హింసిస్తున్నది.

అపరిశుభ్ర పరిస్థితులు, అరకొర వసతులతో కూడిన జైలు నాలుగు గోడల మధ్య పలువురు రాజకీయ ఖైదీలు, హక్కుల కార్యకర్తలు ఏండ్ల తరబడి మగ్గిపోతున్నారు. కరోనాసోకి ఇబ్బంది పడుతున్న అఖిల్‌ గొగోరు, శరీరంలో 90శాతం వైకల్యంతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్‌ సాయిబాబా, ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడుతున్న వరవరరావు, ఇతర రాజకీయ ఖైదీలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, బెయిలుపై వారిని విడుదల చేయాలని వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు, పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంస్థలు చేసిన విజ్ఞప్తులను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దాని వర్గ నైజాన్ని తెలియజేస్తోంది. కరోనా మహమ్మారి తరువాత వచ్చేది ఆకలి మహమ్మారేనని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రజలే కేంద్రంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) చేసిన హెచ్చరికలను సైతం మోడీ ప్రభుత్వం బేఖాతరు చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఆగస్టుకల్లా భారతీయ రైల్వే పట్టాలపైకి 15 ప్రయివేట్‌ రైళ్లను ఎక్కించాలని, బీపీసీఎల్‌ వంటి లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలను, బొగ్గు గనులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నది.

మరో వైపు కార్మిక హక్కులను, రైతాంగ ప్రయోజనాలను కాలరాసేందుకు ఆర్డినెన్సుల మీద ఆర్డినెన్సులు జారీ చేస్తున్నది. కరోనాతో ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులను గాలికొదిలేస్తున్నది. ఈ ప్రజావ్యతిరేక విధానాలకు ఎదురవుతున్న ప్రతిఘటనను చర్చలు, సంప్రదింపుల ద్వారా కాకుండా నిర్బంధం ద్వారా అణచివేయాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే మానవ హక్కులపై నగంగా దాడికి తెగబడుతున్నది.

నాలుగు మాసాల క్రితం తూర్పు ఢిల్లీలో ముస్లిం మైనార్టీలపై హింసను ప్రేరేపించిన బీజేపీ నేత కపిల్‌ మిశ్రాను వదిలి పెట్టి, దాడులకు గురైన వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టించింది. సీఏఏను వ్యతిరేకించినందుకు 27 ఏండ్ల జామియా ఎంఫిల్‌ విద్యార్థి సఫూరా జార్గర్‌ను గర్భిణీ అని కూడా చూడకుండా దేశద్రోహం అభియోగం కింద జైలుకు పంపింది. కాశ్మీర్‌లో నిర్బంధం గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. సంఫ్‌ు పరివార్‌ రచించిన స్క్రిప్టును మోడీ డైరెక్షన్‌లో పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు.

పౌరుల ప్రాథమిక హక్కులను బాహాటంగా కాలరాస్తున్నారు. ఢిల్లీలో ముస్లిం మైనార్టీలపై జరిగిన దాడులపై ఐరాస మానవ హక్కుల సంస్థ హైకమిషనర్‌ మిచెలి బెచెలెట్‌ ఆక్షేపించినా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మానవ హక్కులను కాలరాయడంలో ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మోడీతో పోటీ పడుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో మైనార్టీలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు.

వలస కార్మికులపై దాడులు, బూటకపు ఎన్‌కౌంటర్లు అక్కడ సర్వ సాధారణమైపోయాయి. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను ఎలాంటి విచారణ లేకుండానే ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చి చంపేశారు. ఈ రోజు దుబే కావచ్చు. రేపు ఎవరినైనా ఇదే విధంగా ఎన్‌కౌంటర్‌ చేయొచ్చు.

ఇది చాలా ప్రమాదకర ధోరణి. ఎలాంటి విచారణ లేకుండా నేరస్థులను శిక్షించే అధికారాలను పోలీసులు చలాయిస్తే ఇక న్యాయవ్యవస్థ ఉనికికి అర్థం ఏముంది? పోలీసుల విచక్షణ ఏ విధంగా ఉంటుందో తమిళనాడు ఉదంతం సూచిస్తున్నది. తమిళనాడులో తూత్తుకుడి జిల్లా సతాంకుళంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించారన్న పేరుతో తండ్రి కొడుకులను చిత్ర హింసలు పెట్టి హత్య చేసిన పోలీసుల కిరాతకాన్ని చూశాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలపైనే కాదు, హక్కులపైనా దాడులు చేస్తున్నాయి. 70వ రాజ్యాంగ అవతరణ దినోత్సవాలు జరుపుకున్న సంవత్సరంలోనే ఆ రాజ్యాంగం ప్రసాదించిన పౌరుల ప్రాథమిక హక్కులపై బీజేపీ ప్రభుత్వాలు దాడులకు తెగబడుతుండడం కాకతాళీయం కాదు. రాజ్యాంగమన్నా, మానవ హక్కులన్నా బీజేపీ లెక్కలేనితనానికి, దాని నిరంకుశ స్వభావానికి ఇదొక నిదర్శనం. ఈ పరిస్థితుల్లో మానవ హక్కుల పరిరక్షణకు మరో పోరాటం అవసరం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates