వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అమృతా ప్రణయ్‌

కులాంతర వివాహాల కోసం తన జీవితాంతం పోరాటం చేస్తానని గత ఏడాది మిర్యాలగూడలో సంచలనాత్మక రీతిలో హత్యకు గురైన ప్రణయ్‌ సతీమణి అమృత అన్నారు. ప్రస్తుతం పలువురు కులదురహంకార ధోరణితో వ్యక్తుల ప్రాణాలకుంటే కులానికే ప్రాధాన్యమివ్వడం దారుణమన్నారు. అందరి సహకారం వల్లనే తాను ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుశ్రుత, దేవార్ష్ల న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న ‘కులదురహంకార హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం–బాధితులకు న్యాయం కోసం జరగాల్సిన ఉద్యమం మన కర్తవ్యాలు’అనే అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమృ త మాట్లాడుతూ.. ప్రణయ్‌ హత్యలో భాగస్వాములైన 8 మందిలో ఒక్కరే జైలులో ఉన్నారని, మిగతా వారంతా బయట తిరుగుతున్నారని, అందరికీ శిక్ష పడేవరకు తాను రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.

కులదురహంకార హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రేమ పేరుతో ఒక్కరు మోసం చేస్తే అందరూ అలా చేస్తారని భావించవద్దన్నారు. వ్యక్తుల ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమివ్వడం సరైంది కాదన్నారు. ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అనేక మంది బాధితులు తమకు డబ్బులు కాదు.. న్యాయం కావాలని కోరుకుంటున్నారన్నారు. సామాజిక వేత్త సాంబశివరావు మాట్లాడుతూ.. జనగామ జిల్లా గూడూరు మండ లానికి చెందిన సుశృత, ఆమె నాలుగేళ్ల కుమారుడు దేవార్ష్లను అతి కిరాతకంగా హత్య చేశారని, ఇలాంటి వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు.

కులనిర్మూలన సంఘం నేత గాంధీ మాట్లాడుతూ ఇప్పటివరకు 50 కులదురంహంకార హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాల ప్రోత్సాహానికి గాను ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ… తన కొడుకుదే చివరి హత్య కావాలని కోరుకున్నానని కానీ ఇంకా అలాంటి హత్యలే కొనసాగడం బాధాకరమన్నారు. తన కోడలు అమృత చేస్తున్న పోరాటం అమోఘమైందని ఆమె తన కూతురైతే పాదాభివందనం చేసేవాడినన్నారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

(సాక్షి సౌజన్యంతో)

RELATED ARTICLES

Latest Updates