ఒప్పుకోం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కేంద్రానికి తేల్చిచెప్పిన రైతులు
– సవరణలు కాదు.. చట్టాలు రద్దు చేయాల్సిందే
– మూడో దఫా చర్చలూ అసంపూర్ణంగానే ముగింపు
– డిసెంబర్‌ 9న మరో దఫా చర్చలు
– చర్చల పేరిట సాగదీస్తున్న మోడీ సర్కారు
– రైతు నేతల సత్యాగ్రహం
– ప్రభుత్వ భోజనాన్ని తిరస్కరించిన రైతు సంఘాల ప్రతినిధులు
– భారత్‌ బంద్‌ జరిపితీరుతాం :హన్నన్‌ మొల్లా, ఏఐకేఎస్‌
– ప్రధాని మోడీతో కేంద్రమంత్రుల భేటీ

న్యూఢిల్లీ : సాగు వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా ఉధతంగా పోరాటం చేస్తున్న అన్నదాతల డిమాండ్ల పై మోడీ సర్కార్‌ సాగదీస్తోంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తోంది. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడు సార్లు చర్చలు చేపట్టి నప్పటికీ స్పష్టమైన పరిష్కారాన్ని తీసుకురాలేక పోయింది. మరోసారి చర్చలు జరిపేందుకు నిర్ణయించింది. మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దు, విద్యుత్‌ బిల్లు ఉపసంహరించుకో వాలని డిమాండ్‌ చేస్తున్న రైతు ఉద్యమం ఉధతం అవ్వడంతో రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తుంది. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన చర్చల్లో రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ తేల్చలేదు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలమవ్వయ్యాయి. రైతులు డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పకోకపోవడంతో, ప్రభుత్వ ప్రతిపాదనలకు రైతు సంఘాలు ససేమిరా అన్నాయి. చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో మళ్లీ డిసెంబర్‌ 9 (బుధవారం) చర్చలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్‌ హాజరయ్యారు. గత సమావేశంలో 35 మంది రైతు సంఘాల నేతలు హాజరైతే, ఈ సమావేశంలో 40 మంది రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. హన్నన్‌ మొల్లా (ఏఐకేఎస్‌), గుర్నామ్‌ సింగ్‌ (బీకేయూ), శివ కుమార్‌ (మధ్యప్రదేశ్‌), మేజర్‌ సింగ్‌ పునివాలా (ఏఐకేఎస్‌, పంజాబ్‌), దర్శన్‌ పాల్‌, జగ్‌మోహన్‌ సింగ్‌, సత్‌నామ్‌ సింగ్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాలా, జగ్‌జీత్‌ సింగ్‌ దళ్లేవాల్‌ (పంజాబ్‌), కవితా కూరగంటి(ఏఐకేఎస్సీసీ), రాకేష్‌ తికాయత్‌, హర్బల్‌ సింగ్‌ , అంచావతా, అభిమన్యు కుహర్‌ తదితర నేతలు హాజరయ్యారు.

చర్చలో రైతు నేతలు అరగంట పాటు మౌనం
దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో క్లాజ్‌ టూ క్లాజ్‌ ఏయే మార్పులు చేయాలో చెప్పాలని రైతు నేతలను కేంద్ర మంత్రులు అడిగారు. అయితే అందుకు రైతు సంఘాల నేతలు తాము సవరణలకు ఒప్పుకోము, చట్టాలనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఇలా చాలా సేపు అటూ కేంద్ర ప్రభుత్వం, ఇటూ రైతు నేతలు రెండు వైపుల తమ తమ వాదనలు వినిపించారు. లంచ్‌ బ్రేక్‌ అనంతరం చట్టాలను రద్దు చేస్తారా? లేదా? చెప్పాలని రైతు నేతలు ఒకేఒక్క మాట స్పష్టంగా అడిగారు. దీనికి కేంద్ర మంత్రులు స్పందిస్తూ అలా ఎలా అవుతుంది. చర్చలంటే అన్ని వస్తాయి కదా అని, ఒక్కొక్క అంశాన్ని చర్చించాలి కదా అని పేర్కొ న్నారు. చట్టాలు రద్దు చేయకుండా ఇలాంటి చర్చల వల్ల ఉపయోగమేమీ లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అనంతరం రైతులు మౌన సత్యా గ్రహానికి దిగారు. రైతు నేతలు మాట్లాడేందుకు నిరాకరించారు. తమ ముందు ఉన్న మైక్‌లను తీసి వెనక్కి పెట్టారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తారా? లేదా? (ఎస్‌ ఆర్‌ నో) అంటూ ప్లకార్డులు పట్టుకొని 40 నిమిషాల పాటు రైతు నేతలు మౌన సత్యాగ్రహం చేశారు. ఈ సమయంలో కేంద్ర మంత్రులు ఒకరి తరువాత రైతు చట్టాలు గురించి మాట్లాడారు. దీంతో కేంద్ర మంత్రులు బయట ఎలాగూ ఆందోళనలు జరుగుతున్నాయని, ఇక్కడకు చర్చలకు వచ్చారు కదా, ఇక్కడ చర్చిద్దామని పేర్కొన్నారు. అయినప్పటీ రైతు నేతలు మాట్లాడేం దుకు నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రులు, అధికారులు బయటకు వెళ్లి విడిగా సమావేశం అయ్యారు. అనంతరం చర్చలకు వచ్చిన కేంద్ర మంత్రులు తమకు సమయం కావాలని, ప్రభుత్వం నేతలతో చర్చించి వీలైనంత త్వరగా చెబుతామని అన్నారు. అయితే దీనికి రైతు సంఘాల నేతలు సమ యం అడుగుతున్నారు కదా, అంతా త్వరగా ఎందుకు ఒకరోజు, రెండు రోజుల సమయం అని కాకుండా కాస్తా బాగా ఆలోచించుకొని తమకు చెప్పాలని ప్రభు త్వానికి తెలిపారు. దీంతో డిసెంబర్‌ 9న మళ్లీ చర్చ లు జరుపుతారు. అప్పుడు స్పష్టమైన ప్రతిపాదనలతో వస్తామని కేంద్ర మంత్రులు చెప్పారు.

ఉద్యమాన్ని తీవ్రతరం ఎందుకు?
ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, ఉద్యమాన్ని ఎందుకు తీవ్రతరం చేస్తారని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతు సంఘాల నేతలతో అన్నారు. భారత్‌ బంద్‌ వంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేసే పిలుపులు ఇచ్చినట్టు తెలిసిందని, చర్చల సమయంలో ఎందుకు అని అడిగారు. తాము తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భోజనాన్ని తిరస్కరించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘూ వద్ద తయారు చేసిన భోజనాన్ని తెప్పించుకొని తిన్నారు. అక్కడ కవరేజీకి వచ్చిన జర్నలిస్టులకి సైతం రైతులే భోజనం ఏర్పాట్లు చేశారు.

భారత్‌ బంద్‌ జరిపి తీరుతాం
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ భారత్‌ బంద్‌ కొనసాగిస్తామని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఇలా చర్చలు పెట్టుకుంటూ పోతే సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. భవిష్యత్‌ చర్చలకు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. తాము ఎప్పుడైనా చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే చర్చల్లో కూడా తమ డిమాండ్‌ అదే ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిందే ఇప్పడు కూడా చెప్పిందని ఏఐకేఎస్‌ పంజాబ్‌ కార్యదర్శి మేజర్‌ సింగ్‌ పునివాలా పేర్కొన్నారు. రైతు చట్టాలు రద్దు చేయకపోతే తాము తమ మౌన సత్యాగ్రహను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏఐకేఎస్సీసీ నేత కవితా కూరగంటి మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని రాజకీయ ప్రేరేపిత అని, ఎజెన్సీలు డబ్బులు ఇచ్చి నడుపుతున్నాయని మాట్లాడిన వారు, ఇప్పడు చర్చల్లో తమ ఉద్యమాన్ని అభినందించారని తెలిపారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ముసాయిదా సిద్ధం చేసి తమకు ఇస్తుందని, రాష్ట్రాలను కూడా సంప్రదిస్తామని చెప్పిందని అన్నారు. ఎంఎస్‌పీ పై కూడా చర్చలు జరిగాయని, కాని తాము ముందు చట్టాల రద్దు గురించి మాట్లాడాలని చెప్పినట్టు తెలిపారు.

రైతుల డిమాండ్లు కేంద్రం పరిశీలిస్తుంది
రైతుల అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పారు. రైతుల ఆందోళనలో ఉన్న సీనియర్‌ సిటిజన్లు, పిల్లలు ఇంటికి వెళ్ళమని సమావేశంలో అందరికీ తాను విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. చర్చలు ఎప్పటిలాగే జరిగాయని, వారి సూచనలు లిఖిత పూర్వంగా ఇవ్వమని అడిగామని అన్నారు. దానిద్వారా సమస్య పరిష్కరం సులభం అవుతోందని, కానీ ఈ రోజు చర్చల సందర్భంగా రైతు నేతలు ఇవ్వలేదని, దానికోసం తాము ఇప్పటికీ ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంఘాల ఆందోళన (డిసెంబర్‌ 8 భారత్‌ బంద్‌)పై తాను వ్యాఖ్యానించడానికి ఇష్టపడనన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు భేటీ
రైతు ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పియూష్‌ గోయల్‌ కలిశారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళనపై చర్చించారు. రైతుల డిమాండ్లను ఆయన ముందుంచారు. అన్నదాతల డిమాండ్లపై విస్తతంగా చర్చ జరిగినప్పటికీ పరిష్కారం దొరక్కపోవడంతో ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షాకి సమావేశ వివరాలు అందజేస్తామని భేటీల్లో పాల్గొన్న మంత్రులు మీడియాకి వెల్లడించారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates