ఉధృతంగా రైతు ఉద్యమం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వేలాది మంది రైతులు చేరుతున్నారు
– రైతులకు కార్మిక సంఘాలు సంఘీభావం
– నేడు మరోసారి చర్చలు
– రైతులను ఖలిస్తానీలు అనడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆగ్రహం
– రైతులపై కేసులు వెనక్కి తీసుకోవాలని ఎన్డీయే పక్ష పార్టీ డిమాండ్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఢిల్లీ-హర్యానా సరిహద్దులు, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులను రైతులు దిగ్బంధించారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ, విద్యుత్‌ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన శుక్రవారం తొమ్మిదో రోజు కొనసాగింది. వేలాది మంది రైతులు ఢిల్లీ పరిసరాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులు సింఘూ, టిక్రీ, ఝారోడా ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులు ఘజిపూర్‌, నోయిడా లింక్‌ రోడ్డు, చిల్లా వద్ద వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. యూపీ గేట్‌ వద్ద రైతులు తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారిని దిగ్భందించారు. కర్నాటక, తమిళనాడు రైతులు కూడా చలో ఢిల్లీకి రానున్నారు. హర్యానాలో ఆందోళనలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జేజేపీ డిమాండ్‌ చేసింది. సింఘూ వద్ద జరిగిన ఆందోళనలో కార్మిక సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. తపన్‌ సేన్‌, హేమలత, స్వదేశ్‌ దేవరారు, ఎఆర్‌ సింధూ (సీఐటీయూ), అమర్‌ జిత్‌ కౌర్‌, విఎస్‌ గిరి (ఏఐటీయూపీ), ఆర్‌కె శర్మ (ఏఐయూటీయూసీ), లతా (ఎస్‌ఈడబ్ల్యూఏ), శత్రూజిత్‌ (టీయూసీసీి) తదితరులు రైతులు పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడాలనీ, ఒకరికి ఒకరు తోడు నీడ కావాలని పిలుపు నిచ్చారు. మోడీ సర్కార్‌ రైతులు, కార్మికులను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. మోడీ సర్కార్‌ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాల ఆవశ్యకత ఉందన్నారు. టిక్రీ ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు సంఘీభావం తెలిపుతూ ర్యాలీ నిర్వహించారు.

ఖలిస్తానీలనడం నైతిక జర్నలిజానికి వ్యతిరేకం: ఎడిటర్స్‌ గిల్డ్‌
ఎటువంటి ఆధారాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై ఖలిస్తానీలు, దేశ వ్యతిరేకులు అని ముద్ర వేయడం నైతిక జర్నలిజానికి వ్యతిరేకమని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) పేర్కొంది. రైతుల ఆందోళనలకు సంబంధించిన వార్తలు గురించి ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సీమా ముస్తాఫా, సంజరు కపూర్‌, కోశాధికారి అనంత్‌ నాథ్‌ ప్రకటన విడుదల చేశారు. రైతుల ఆందోళనలు కవర్‌ చేసే కొన్ని వర్గాల మీడియా వారిని ”ఖలిస్తానీలు”, ”దేశ వ్యతిరేకులు” అని పేర్కొంటున్నాయనీ, ఎటువంటి ఆధారాలు, రుజువులు లేకుండా నిరసనలను అలా పేర్కొనడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది బాధ్యతాయుతమైన, నైతిక జర్నలిజం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుందని, ఇటువంటి చర్యలు మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. రైతుల నిరసనలను నివేదించడంలో సరసత, నిష్పాక్షికత, సమతుల్యతను ప్రదర్శించాలని ఈజీఐ మీడియా సంస్థలకు సూచించిందన్నారు. తమను తాము వ్యక్తీకరించడానికి తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకునే వారిపై పక్షపాతాన్ని ప్రదర్శించవద్దని తెలిపారు. అసమ్మతిని కించపరిచే ఏ కథనానికైనా మీడియా సహకరించకూడదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం విఫలం
ప్రముఖ కెనడ నాయకులు కూడా వ్యవసాయ బిల్లుల ఆమోదంతో మన రైతుల దుస్థితిని అర్థం చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి దేశంలో సమస్యలను పెంచిందని, ఇది రైతుల సమస్య అయినా, లేదా కోవిడ్‌ -19 సంక్షోభాన్ని నిర్వహించడం అయినా ఇలా ఈ ప్రభుత్వం (కేంద్రం) అనేక అంశాలలో విఫలమైందని ఎన్‌సిపి అధినేత శరద్‌ పవర్‌ విమర్శించారు. శనివారం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు నిరసనగా నల్ల జెండాలతో ఆందోళన చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ పిలుపు ఇచ్చారు. సింగూ సరిహద్దు ప్రాంతంలో టిఎంసి ఎంపి డెరిక్‌ ఒబ్రయిన్‌ రైతులకు మద్దతు ఇచ్చారు. ఆయన మమతా బెనార్జీకి చేసి రైతులతో మాట్లాడించారు. రైతుల నిరసన కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్ళకు తీసుకువచ్చిందని జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ”ఆర్టికల్‌ 370 ను చట్టవిరుద్ధంగా రద్దు చేసినప్పటి నుంచి బీజేపీ ప్రజల శక్తికి భయపడుతోంది. జమ్ము కాశ్మీర్‌లో అణచివేత పాలన నిర్వహిస్తోంది. అసమ్మతి కోసం శాంతియుత మాధ్యమాన్ని అనుమతించకపోవడం అన్ని రంగాల్లో వారి భయము, వైఫల్యాన్ని చూపిస్తున్నది” అని ఆమె తెలిపారు.

నేడు మరోదఫా చర్చలు
రైతులతో కేంద్ర ప్రభుత్వం మరోదఫా చర్చలు చేపట్టనుంది. నేడు విజ్ఞాన్‌ భవన్‌లో మద్యాహ్నం 2 గంటలకు రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనున్నది. ఇప్పటి నాలుగు సార్లు చర్చించిన ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం తీసుకురాలేకపోయింది. గురువారం జరిగిన చర్చల్లో మూడు చట్టాల్లో ఎనిమిది సవరణలు చేసేందుకు ప్రతిపాదన చేసింది. అయితే దాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. ”శనివారం తదుపరి రౌండ్‌ చర్చలు జరిగినప్పుడు చర్చలు అంతిమ దిశగా పయనిస్తాయని ఆశిస్తున్నాము” అని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.

సాహిత్య అవార్డు వెనక్కి
రైతుల ఉద్యమానికి మద్దతుగా సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు జస్విందర్‌ సింగ్‌ ప్రకటించారు. ”ఒక రచయిత ప్రజల గొంతును ప్రదర్శించలేకపోతే, దాని అర్థం ఏమిటి? నేను అవార్డుల కోసం రాయడం ప్రారంభించలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులతో కనికరం లేకుండా వ్యవహరించడం. ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించడం చూడటం బాధ కలిగించింది” అని నవలా రచయిత డాక్టర్‌ జస్విందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates