రైతులపై మోడీ ప్రభుత్వ యుద్ధం – ప్రతిఘటన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
అశోక్‌ ధావలే
(వ్యాసకర్త ఎఐకెఎస్‌ అధ్యక్షుడు)

ఈ రెండు సమ్మెలు బిజెపి దుష్ట పాలనకు గట్టి చెంపదెబ్బ వంటివి. తమకు ఉమ్మడి శత్రువు అయిన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా…కార్మికవర్గం, భారత రైతాంగం ఒకరి డిమాండ్లకు మరొకరు మద్దతు పలికాయి. కుల, మత, విభజన వాద కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి … ఐక్య వర్గ పోరాటానికి మాత్రమే వుందని…నవంబర్‌ పోరాటం మరోసారి రుజువు చేసింది.

గత కొన్ని దశాబ్దాలలో భారత దేశంలో ఇటువంటిది ఎన్నడూ కనిపించలేదు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం తన సొంత ప్రజల పైన యుద్ధం చేస్తోంది. దేశానికే అన్నదాతలైన రైతుల పైన యుద్ధం చేస్తోంది. మున్నెన్నడూ లేనంత ప్రభుత్వ అణచివేత, అద్భుతమైన రైతు ప్రతిఘటన మనకు నేడు కనిపిస్తోంది. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వాలు, వాటి అధీనం లోని పోలీసులు…కేంద్రం లోను, హర్యానా లోను అదే చేశారు. వారు పంజాబ్‌, హర్యానా రైతులపై నీటి ఫిరంగులను ఎక్కుపెట్టారు. ట్యాంకర్‌ పైకి ఎక్కి నీటి ఫిరంగులను ఆపివేసిన యువ రైతుపై వారు హత్యారోపణలు చేశారు. బాష్ప వాయు గోళాలతో రైతుల మీద దాడి చేశారు. క్రూరమైన లాఠీచార్జికి పాల్పడ్డారు. వందలాది మంది రైతు కార్యకర్తలను అరెస్టు చేశారు. భారీ బారికేడ్లు, ముళ్ల తీగ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేశారు. రాజధాని ఢిల్లీకి రైతులు రాకుండా అడ్డుకునేందుకు జాతీయ రహదారుల మీద భారీ కందకాలు తవ్వారు. ఉత్తరప్రదేశ్‌ లోని బిజెపి ప్రభుత్వం సైతం అక్కడి నుండి ఢిల్లీకి తరలి వస్తున్న రైతులపై విరుచుకు పడింది.

‘రాజ్యాంగ దినోత్సవం’గా చెప్పుకునే నవంబర్‌ 26వ తేదీన ఈ ఘటనలు జరగడం హాస్యాస్పదం. భారత రాజ్యాంగ సభ 71 సంవత్సరాల క్రితం 1949లో అదే తేదీన…రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది మన దేశాన్ని ‘సార్వభౌమ, ప్రజాస్వామ్య, లౌకిక, సోషలిస్టు’ రాజ్యంగా పేర్కొంది. అయితే, నేడు ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రమైన అసమ్మతిని…ఫాసిస్టు అత్యుత్సాహంతో అణచివేస్తున్నారు.

 ప్రభుత్వ అణచివేత..రైతుల ప్రతిఘటన..
పంజాబ్‌-హర్యానా, హర్యానా-ఢిల్లీ సరిహద్దులలో ప్రభుత్వం నిర్మించిన ఈ అణచివేత కుడ్యాన్ని పరాక్రమశాలులైన వేలాది మంది రైతులు ఛేదించారు. వీరిలో అన్ని మతాలు, కులాలకు చెందిన యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు భారీ సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య, సంకల్పం వారి నిజమైన బలం. వారు వేలాది ట్రాక్టర్లు, ట్రాలీలలో కదలి వచ్చారు. అవసరమైతే నెలల తరబడి పోరు సాగించడానికి తగిన ఏర్పాట్లతో వచ్చారు.

రైతులు ప్రదర్శించిన గొప్ప ప్రతిఘటనకు…కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా లొంగిపోవలసి వచ్చింది. చివరకు రైతులు ఢిల్లీ లోకి ప్రవేశించవచ్చని ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ రైతులు ఢిల్లీ లోకి ప్రవేశించకుండా నివారించడానికి ఉద్దేశించినవే. రైతులు బురారీ మైదానంలో శిబిరాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే వేలాదిమంది రైతులు ఢిల్లీ లోకి ప్రవేశించడానికి నిరాకరించారు. హర్యానా-ఢిల్లీ సరిహద్దు లోని సింఘా, తిక్రీ వద్ద రెండు ప్రధాన జాతీయ రహదారుల పైనే బైఠాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ వ్యాసం రాసే సమయానికి, ఆ రెండు పాయింట్ల వద్ద ఉన్న జాతీయ రహదారులు అనేక కిలోమీటర్ల మేరకు రైతుల ట్రాక్టర్లు, ట్రాలీలతో నిండిపోయాయి. ఢిల్లీ లోకి రావడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ వారు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు, ఒక యువ రైతు ఇలా సమాధానమిచ్చాడు. ”మేం బురారీ మైదానానికి వెళ్ళం. ఎందుకంటే మేం అక్కడ…రోజులు తరబడి కూర్చున్నా ఒరిగేదేం లేదు. అదే ఇక్కడ చూడండి. సరిహద్దు మూసేశారు. దాని ప్రభావం వుంటుంది” అన్నాడు.

కేంద్ర ప్రభుత్వం చర్చలకు మొదట డిసెంబర్‌ 3వ తేదీని ఖరారు చేసింది. అప్పటికి పోరాటం విఫలమవుతుందనే భ్రమలో కేంద్రం వుంది. అయితే అలాంటిదేమీ జరగదని స్పష్టమైంది. దాంతో…ఆందోళన చేస్తున్న రైతులు బురారీ మైదానానికి వెళ్లిన వెంటనే ప్రభుత్వం చర్చలు జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా షరతు విధించారు. అయితే రైతులు దానిని తిరస్కరించారు. చివరికి, డిసెంబరు 1వ తేదీన మొదటి విడత చర్చలను నిర్వహించాల్సి వచ్చింది.
కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఇటీవలి ‘మన్‌ కీ బాత్‌’ లో మూడు వ్యవసాయ చట్టాలను గట్టిగా సమర్థించుకున్నారు. ఏ చట్టాలనైతే రద్దు చేయాలని కోరుతూ లక్షలాది మంది రైతులు రాజధాని ఢిల్లీని ముట్టడించారో, సరిగ్గా అప్పుడు ఆ చట్టాలు రైతులకు ప్రయోజనకరమైనవని మోడీ మరోసారి ప్రకటించారు. ఊహించిన విధంగానే చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. వివాదాస్పద చట్టాలను పరిశీలించేందుకుగాను ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ‘ఆఫర్‌’ను రైతులు తిరస్కరించారు. ప్రభుత్వంతో తదుపరి రౌండ్‌ చర్చలు డిసెంబర్‌ 3 న జరగాల్సి ఉంది. ఈ పోరాటం సుదీర్ఘకాలం జరగబోతోందని ప్రస్తుతానికి స్పష్టమైంది.

‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ (ఎస్‌కెఎం) ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తోంది. ఇందులో పంజాబ్‌, హర్యానా రైతు సంఘాల ప్రతినిధులు వున్నారు. ఎఐకెఎస్‌ సహా 250 పైగా రైతు సంఘాలతో ఏర్పడిన అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి), రాష్ట్రీయ కిసాన్‌ మహాసభ (ఆర్‌కెఎంఎస్‌) సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 500 పైగా రైతు సంఘాలు ఒక సమస్య మీద జరుగుతున్న పోరాటంలో కలిసి వచ్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా ఎఐకెఎస్‌సిసి తరపున పాల్గొన్నారు.

ప్రధాన డిమాండ్‌ ఇదే
సెప్టెంబరు 2020లో పార్లమెంటులో బిజెపి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవేశ పెట్టిన మూడు రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల చట్టాలను రద్దు చేయడమే ఎస్‌కెఎం ప్రధాన డిమాండ్‌. దానితో పాటు, రైతులకు మాత్రమే కాక, దేశంలోని గ్రామీణ, పట్టణ వినియోగదారులందరి మీదా విద్యుత్‌ భారాలను మోపే ‘విద్యుత్‌ బిల్లు-2020’ను సైతం ఉపసంహరించుకోవాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిన వెంటనే, బిజెపి కేంద్ర ప్రభుత్వం మరో క్రూర చర్యకు పాల్పడింది. కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల నాలుగు లేబర్‌ కోడ్‌ లను పార్లమెంట్‌లో ఆమోదింపచేసింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా కార్మికులు, రైతులు వీధుల్లోకి రాలేరని, వాటిని వ్యతిరేకించలేరనే భ్రమలో కేంద్రం హడావుడిగా చేసేసింది. మోడీ ప్రభుత్వం దేశీయ, విదేశీ కార్పొరేట్లు, అమెరికా సామ్రాజ్యవాదం ఆదేశాల మేరకు పని చేస్తోందనేది స్పష్టమౌతోంది.

సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు (సిటియు) నేతృత్వంలో జరిగిన అద్భుతమైన నవంబర్‌ 26 అఖిల భారత సమ్మెలో లక్షలాది మంది (సంఘటిత, అసంఘటిత) కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నవంబర్‌ 26-27 ఎస్‌కెఎం నేతృత్వం లోని అఖిల భారత పోరాటం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించింది. ఈ రెండు సమ్మెలు బిజెపి దుష్ట పాలనకు గట్టి చెంపదెబ్బ వంటివి. దేశ రాజధాని సరిహద్దులో వాటిని మించి…ఈ చారిత్రాత్మక రైతు పోరాటం నడుస్తోంది. కార్మిక-కర్షక ఐక్యతకు చిహ్నంగా ఈ నవంబర్‌ పోరాటాన్ని చెప్పుకోవచ్చు. తమకు ఉమ్మడి శత్రువు అయిన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికవర్గం, భారత రైతాంగం ఒకరి డిమాండ్లకు మరొకరు మద్దతు పలికాయి. కుల, మత, విభజన వాద కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి…ఐక్య వర్గ పోరాటానికి మాత్రమే వుందని…కార్మికవర్గం, రైతాంగం చేపట్టిన నవంబర్‌ పోరాటం మరోసారి రుజువు చేసింది.
మూడు రైతు బిల్లులను మొట్టమొదట జూన్‌ 5, 2020న ఆర్డినెన్స్‌గా ప్రవేశ పెట్టారు. దేశంలోని అనేక రైతు సంఘాలు వెంటనే వాటిని ఖండించాయి. జూన్‌ 10న వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటి నిరసనలు జరిగాయి. 2020 ఆగస్టు 9న క్విట్‌ ఇండియా రోజు సందర్భంగా, లక్షలాది మంది కార్మికులు, రైతులు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి వాటిని వ్యతిరేకించారు. అయితే ఈ మూడు బిల్లులను రాజ్యసభలో కపటోపాయంతో ‘ఆమోదింపంచేసుకున్నారు’.

వెంటనే, సిటియు లు సెప్టెంబర్‌ 23న భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయిు. ఎఐకెఎస్‌సిసి సెప్టెంబర్‌ 25న దేశవ్యాప్తంగా భారీ రహదారి దిగ్బంధనాలకు పిలుపునిచ్చింది. లక్షలాది మంది కార్మికులు, రైతులు వీధుల్లోకి వచ్చారు. ఈ తర్వాతే ఎఐకెఎస్‌సిసి నవంబర్‌ 26-27 తేదీలలో దేశవ్యాప్త పోరాటంతో పాటు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చింది. సిటియు లు నవంబర్‌ 26న అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి. అక్టోబర్‌ 26-27 తేదీలలో, ఢిల్లీలో ఎఐకెఎస్‌సిసి కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఇది పంజాబ్‌, హర్యానా, ఇతర రాష్ట్రాల నుండి అనేక సంఘాలను ఆహ్వానించింది. ఇవన్నీ కలిసి ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ (ఎస్‌కెఎం)ను ఏర్పాటు చేశాయి. ఇది ప్రస్తుత పోరాటానికి సంయుక్తంగా నాయకత్వం వహిస్తోంది.

మరింత విస్తృతంగా దేశవ్యాప్త పోరాటాలు
సింఘా, తిక్రీ సరిహద్దులలో రైతులు చేస్తున్న పోరాట వేదికలను కార్మిక సంఘాల కేంద్ర నాయకత్వం క్రమం తప్పకుండా సందర్శించి వారికి అవసరమైన మద్దతునిస్తోంది. వారిలో ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా, అధ్యక్షుడు అశోక్‌ ధావలే, కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శులు కె.కె.రాగేష్‌, ఎం.పి బాదల్‌ సరోజ్‌, సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, అధ్యక్షులు కె.హేమలత, కార్యదర్శి ఎ.ఆర్‌.సింధు, ఎఐఎడబ్లుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సంయుక్త కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిస్వాస్‌ తదితరులు ఉన్నారు. ఈ కీలకమైన పోరాటానికి పంజాబ్‌, హర్యానా లోనూ…ఢిల్లీ లోనూ కార్మిక, ప్రజా సంఘాలు అన్ని విధాలుగా విలువైన సహకారాన్ని అందిస్తున్నాయి.

ప్రస్తుత దశలో, పోరాటాన్ని దేశమంతటా విస్తృతం చేయడం, తీవ్రతరం చేయడం చాలా అవసరం. ఐదు వామపక్ష పార్టీలు, ఎన్‌సిపి, ఆర్‌జెడి, డిఎంకె వంటి లౌకిక పార్టీలు రైతుల పోరాటానికి మద్దతుగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇంకా చాలా మంది వీరిని అనుసరించే అవకాశం ఉంది. ఎఐకెఎస్‌సిసి డిసెంబర్‌1 నుండి దేశవ్యాప్తంగా విస్తృత సామూహిక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

డిసెంబరు 3న దేశవ్యాప్త రహదారి దిగ్బంధనాలకు… డిసెంబర్‌ 3 నుండి 10 వరకు వివిధ రూపాల్లో వారం రోజుల పోరాటం కోసం…పోరాటంలో పాల్గొనడం కోసం…ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎఐకెఎస్‌ పిలుపునిచ్చింది. సిఐటియు, ఎఐఎడబ్లుయు, ఎఐడిడబ్లుఎ, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఈ పిలుపునకు చురుకుగా మద్దతునిచ్చాయి.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates