ఫోర్బ్స్‌ జాబితాలో నల్గొండ యువకుడు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ‘30 అండర్‌ 30’లో చోటు
  • ఆరోగ్య సంరక్షణ విభాగంలో కృషికి గుర్తింపు

నల్గొండ : ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ జాబితాలో తెలంగాణ వాసి, నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కోణం సందీప్‌ స్థానం దక్కించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కృషి చేసిన 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొందించిన ‘30 అండర్‌ 30 జాబితా’లో సందీప్‌ పేరును చేర్చింది. ఈ నెల 1న అమెరికాలో దీనిని విడుదల చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మొబైల్‌ యాప్‌ రూపొందించినందుకు సందీప్‌కు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను అత్యంత భద్రంగా రోగులకు వారి మాతృ భాషల్లోకి ఈ యాప్‌ తర్జుమా చేసి అందిస్తుందని సందీప్‌ తెలిపారు. 2018లో డా.శివరావ్‌తో కలిసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ‘అబ్రిడ్‌’్జ పేరుతో హెల్త్‌కేర్‌ గ్రూప్‌ సంస్థను స్థాపించిన సందీప్‌.. వైద్యరంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పరిశోధనలు చేస్తున్నారు.

ఇడుపులపాయ ఆర్‌జీయూకేటీలో ఇంజినీరింగ్‌ చదివిన సందీప్‌.. అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్‌ విభాగంలో ఎంఎస్‌ పూర్తిచేశారు. పలు హెల్త్‌కేర్‌ టెక్నాలజీ అప్లికేషన్లు రూపొందించారు. క్యాన్సర్‌ రోగులకు ఉపయోగపడే క్లినికల్‌ ట్రయల్‌ మ్యాచింగ్‌, పాక్షిక అంధత్వం గలవారికి ఉపయోగపడే యాప్‌, బయోమెట్రిక్‌ పద్ధతిలో క్యాన్సర్‌ పరీక్ష వంటివి ఆవిష్కరించారు. సందీప్‌ కోణం పేరుతో ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలూ చేపడుతున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదువు వైపు ఆకర్షించేలా వర్చువల్‌ రియాల్టీ ప్రాజెక్టులు చేపట్టారు. సందీప్‌ తండ్రి కోణం శ్రీనివాస్‌ కనగల్‌ మండలంలోని కురంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి అనురాధ గృహిణి.

అభినందించిన కేటీఆర్‌
‘‘ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది. అత్యున్నత పురస్కారానికి ఎంపిక కావడానికి అబ్రిడ్జ్‌ కో-ఫౌండర్‌ డా.శివరావు, ఇతర సభ్యులు సహాయ సహకారాలు అందించారు’’ అని సందీప్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ అన్నారు. సందీప్‌ను తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా అభినందించారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates