ఆ పాపం బీజేపీదే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– నకిలీ వెంటిలేటర్ల వివాదం
– వడోదరా ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదానికి కారణం ‘నకిలీ వెంటిలేటర్లే’ : విచారణ కమిటీ
– ‘ధామన్‌-1’ వెంటిలేటర్లపై చికిత్సపొందుతూ కరోనా రోగులు మృతి
– సరఫరాదారు గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీకి సన్నిహితుడు
– నిపుణులు, సాంకేతిక నిపుణులు వద్దన్నా..పట్టుబట్టి తెప్పించిన..విజయ్ రూపానీ
– ప్రధాని మోడీకి అత్యంత ఖరీదైన సూట్‌ను కుట్టించిన కంపెనీ ప్రమోటర్‌

ధామన్‌-1 వెంటిలేటర్లకు ‘డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ లైసెన్స్‌ లేకున్నా, వైద్య నిపుణులు వద్దని చెప్పినా గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ ప్రభుత్వం వినలేదు. పట్టుబట్టి వెంటిలేటర్లను తెప్పించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించారు. ‘ధామన్‌-1’ తయారుదార్లు ‘జ్యోతీ సీఎన్‌సీ’ ..గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీకి అత్యంత సన్నిహితులు. అలాగే ఈ కంపెనీ ప్రమోటర్లలో ఒకరు..ప్రధాని మోడీకి సైతం చాలా దగ్గరివాడని తెలింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన (2015లో) సందర్భంగా ప్రధాని మోడీ ధరించిన అత్యంత ఖరీదైన సూట్‌..’ధామన్‌-1′ ప్రమోటర్లలో ఒకరు బహూకరించేదేనని తేలింది. సంచలనం సృష్టిస్తున్న నకిలీ వెంటిలేటర్ల కుంభకోణంలో బీజేపీకి చెందిన పెద్ద పెద్ద నాయకుల పేర్లు వినపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గుజరాత్‌ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్‌కు 900 ‘ధామన్‌-1’ యూనిట్లను ప్రభుత్వం అందజేసింది. ఇందులో 230 యూనిట్లు ఒక్క అహ్మదాబాద్‌ సివిల్‌ హాస్పిటల్‌కు వెళ్లాయి. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయకుండానే గుజరాత్‌ సీఎం రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌లు ‘ధామన్‌-1’ గొప్ప ఆవిష్కరణగా ప్రకటించారు. వీరి మాటల్ని నమ్మి ఇతర రాష్ట్రాలు కూడా ‘ధామన్‌-1’ వెంటిలేటర్లను ఆర్డర్‌ చేశాయి. తర్వాత నిపుణుల సలహామేరకు ఆర్డర్లను రద్దుచేశాయి. ‘ధామన్‌-1’ పరికరాల ఆర్డర్‌ రద్దు చేశామని పుదుచ్చెరీ సీఎం నారాయణస్వామి ఏకంగా ట్విట్టర్‌లోనే ప్రకటించారు.

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌కు..రాజకీయ అవినీతి తోడైంది. ఎవడెక్కడ పోతేంటి..?మనవాళ్లకు కాంట్రాక్ట్‌ దక్కింది కదా? అని ఆలోచించే నాయకులక్కడ అధికారంలో ఉన్నారు. ఫలితం..నాణ్యమైన వెంటిలేటర్లు లేక గుజరాత్‌లోని వడోదర ప్రభుత్వ హాస్పిటల్‌లో 300మందికిపైగా కరోనా రోగులు మరణించారు. సెప్టెంబరు 8న ఐసీయూలో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి కారణం నాణ్యతలేని ‘ధామన్‌-1’ వెంటిలేటర్లేనని నిపుణుల కమిటీ తేల్చింది. దాంతో ఈ ‘వెంటిలేటర్ల’ అంశం జాతీయ వార్తల్లో ప్రముఖ అంశంగా మారింది. దీనిపై అహ్మదాబాద్‌ మిర్రర్‌, అవుట్‌లుక్‌ ఇండియా, బూమ్‌లైవ్‌, ద వైర్‌..మొదలైన న్యూస్‌ వెబ్‌పోర్టల్స్‌ వెలువరించిన వార్తా కథనాలు చర్చనీయాంశమయ్యాయి. ఇందులో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.. వడోదరలోని ప్రభుత్వ హాస్పిటల్‌లోని(ఎస్‌ఎస్‌జీ) కరోనా రోగులన్న ఐసీయూ వార్డ్‌లో సెప్టెంబరు 8న అగ్నిప్రమాదం సంభవించింది. ‘ధామన్‌-1’ వెంటిలేటర్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణ కమిటీకి నేతృత్వం వహించిన డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌కె.పాటిల్‌ నివేదిక ఇచ్చారు. ఇదే హాస్పిటల్‌లో ఇవే వెంటిలేటర్లమీద ఉన్న కరోనా రోగులు 300మంది చనిపోయారని ఆరోపణలున్నాయి. నాణ్యతలేని వెంటిలేటర్ల వల్లే వందలాది కరోనా రోగులు మరణించారని వైద్యులు సైతం చెబుతున్నారు.

మనోడే..కొనండి..
జ్యోతీ సీఎన్‌సీ కంపెనీ ప్రమోటర్లలో అందరికీ బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇందులో ఒకరికి ప్రధాని మోడీ అత్యంత సన్నిహిత మిత్రుడని వార్తా కథనాలు వెలువడ్డాయి. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో జరిగిన పెండ్లికి సైతం ప్రధాని మోడీ వెళ్లారట. కంపెనీ సీఈఓ పరాక్రమసిన్హా జడేజా సీఎం రూపానీకి స్నేహితుడని ‘అహ్మదాబాద్‌ మిర్రర్‌’ వార్తా కథనం పేర్కొన్నది. ‘ధామన్‌-1’ వెంటిలేటర్ల పనితనం సరిగాలేదని వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్‌లలో వైద్య నిపుణులు సైతం ముందుగానే ప్రభుత్వానికి తెలిపారట. వెంటిలేటర్లు ‘హై ఎండ్‌’ ప్రమాణాలతో లేవని రాతపూర్వకంగా ప్రభుత్వ వర్గాలకు నిపుణులు, వైద్య నిపుణులు రాసినట్టు ‘మిర్రర్‌’ తెలిపింది.

నాణ్యమైనవి కావాలన్నాం : వైద్యులు
” కోవిడ్‌ పేషంట్లపై ‘ధామన్‌-1’ వెంటిలేటర్లను వాడుతున్నాం. ఇవి సరిగా పనిచేయటం లేదు. రోగులు కోలుకోవటం లేదు. వెంటనే మాకు నాణ్యమైన వెంటిలేటర్లు కావాలి ” అని అహ్మదాబాద్‌ సివిల్‌ హాస్పిటల్‌ వైద్యులు ఈ ఏడాది మే 19న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అహ్మదాబాద్‌లో 600మంది కరోనా రోగులు చనిపోవడానికి కారణం నాణ్యమైన వెంటిలేటర్లు లేకపోవటమేనని ‘అహ్మదాబాద్‌ మిర్రర్‌’ వార్తా కథనం పేర్కొంది. కేవలం ‘ధామన్‌-1’ వెంటిలేటర్లు ఉపయోగించాల్సి రావటం మరణాల సంఖ్యను పెంచిందని ఆరోపణలున్నాయి.

దీనిపై సివిల్‌ హాస్పిటల్‌ ఎనస్థీసియా హెడ్‌ శైలేష్‌ షా మాట్లాడుతూ..” ఇటీవల కాలంలో ‘ధామన్‌-1′ వెంటిలేటర్లు పెద్దగా ఉపయోగించలేదు. చాలా మంది కరోనా రోగుల కోసం వేరే వెంటిలేటర్లు వాడాం. ఇవి నాణ్యమైనవి కాబట్టే..రోగులు కోలుకొని ఇంటికెళ్లారు. ఒకవేళ హాస్పిటల్‌కు పెద్ద సంఖ్యలో ఎమర్జెన్సీ కేసులు వచ్చాయంటే…’ధామన్‌-1’ వెంటిలేటర్లు వాడక తప్పదు కదా..?” అని అన్నారు.

2వేల కోట్లకుపైగా ఖర్చు..
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రతీ సుదాన్‌ ఈ ఏడాది మే 20న ప్రధాని మోడీ సలహాదారు భాస్కర్‌ కుల్బేకు ఒక లేఖ రాశారు. 58,850 వెంటిలేషన్‌ పరికరాల సేకరణ జరుపుతున్నామని అందులో ఆమె తెలిపారు. ఇందుకోసంగానూ కేంద్రం ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’లోని రూ.2,332.2కోట్లను ఖర్చు చేసింది.

ప్రభుత్వరంగంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌కు 30వేల యూనిట్లు, ఏఎంటీజెడ్‌ అనే కంపెనీకి 13వేల యూనిట్లు, ఏజీవీఏ హెల్త్‌కేర్‌కు 10వేల యూనిట్లు, జ్యోతీ సీఎన్‌సీ ఆటోమేషన్‌కు 5వేల యూనిట్లు ఆర్డర్లు దక్కాయి. డీజీహెచ్‌ఎస్‌ క్లినికల్‌ పరీక్షలు జరిపి..40,350 యూనిట్లు సరిపోతాయని నివేదిక ఇచ్చింది. జ్యోతీ సీఎన్‌సీ, ఏఎంటీజెడ్‌ కంపెనీలను కాకుండా మిగిలిన మూడు కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలని తెలిపింది. అయినప్పటికీ కేంద్రం జ్యోతీ, ఏఎంటీజెడ్‌కు రూ.22.5కోట్లు ముందస్తు చెల్లింపులు చేసింది.

RELATED ARTICLES

Latest Updates