ఢిల్లీలో ఎంట్రీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– అడ్డంకులు.. అవాంతరాలను ఎదురొడ్డిన అన్నదాతలు
– కర్షకుల కన్నెర్రతో దిగొచ్చిన కమలం సర్కారు
– హస్తినలో రైతుల ఆందోళనకు అనుమతి
– దేశ రాజధాని సరిహద్దులో హైడ్రామా… గంటలపాటు ఉద్రిక్తత
– నిరంకారీ గ్రౌండ్స్‌లో అన్నదాతలు ఆందోళనకు లైన్‌క్లియర్‌
– రైతులకి ఆహారం, నీరు పంపిణీ చేస్తామన్న కేజ్రీవాల్‌ సర్కారు
– జంతర్‌మంతర్‌లో ఏఐకేఎస్‌, సీఐటీయూ, ఐద్వా నాయకుల నిరసన

అన్నదాతల ముందు మోడీ సర్కార్‌ తలవంచకతప్పలేదు. ఉక్కుపాదం మోపి రైతులను ఢిల్లీలోకి అడుగుపెట్టనీయకుండా శతవిధాలా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బారికేడ్లు… ముండ్లకంచెలు నిర్బంధాలు.. జలఫిరంగులు.. బాష్పవాయుగోళాలు…ఇలా బలప్రయోగాలు చేసినా రైతు ఒక్కఅడుగు కూడా వెనుకేయలేదు. అరెస్టులు చేసినా.. అదుపులోకి తీసుకున్నా అన్నదాత మడమతిప్పలేదు. మోడీసర్కార్‌ బెదిరింపులకు లొంగలేదు. చివరికి నిరంకారీ గ్రౌండ్స్‌లో అన్నదాతల ఆందోళనకు అనుమతించకతప్పలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్లచట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేననీ రైతు,కార్మిక,ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

అన్నదాతను అడ్టుకోవటానికి మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలకు ఎదురొడ్డి రైతన్నలు హస్తినలోకి శుక్రవారం అడుగుపెట్టారు. కార్పొరేట్‌ అనుకూల చట్టాలు మాకొద్దంటూ నినదిస్తూ దేశ రాజధాని నలువైపులా నుంచి చీమలదండులా వచ్చిన రైతులను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. కర్షకులు కన్నెర్రతో కమలం సర్కారు దిగొచ్చింది. హర్యానా, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకు ఢిల్లీలోకి తొలుత అనుమతి లేదన్న మోడీ ప్రభుత్వం గురువారం వారిపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో నగర శివార్లలో బైటాయించిన వారికి అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భాష్పవాయువు(టీయర్‌ గ్యాస్‌), నీటి ఫిరంగులు(వాటర్‌ కెనాన్స్‌) ఉపయోగించి వారిని భయాందోళనలకి గురి చేసేందుకు యత్నించారు. రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే, ఎంతటి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించినా రైతులు వెనక్కి తగ్గకపోగా, మరింత ఉధృతంగా ముందుకు చొచ్చుకొచ్చారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకి ముందుకొచ్చిన అన్నదాతలను కట్టడి చేయడం ఆయా రాష్ట్ర పోలీసులతో పాటు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు కూడా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిళ్ళ నడుమ రైతుల నిరసనకి అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ సరిహద్దులోని నిరంకారీ స్టేడియంలోకి రైతులను అనుమతించింది. రైతులంతా ఆయా ప్రాంతాల నుంచి నిరంకారీ స్టేడియం వైపు నినాదాలు చేసుకుంటూ కదిలారు.

రైతులకి ఆహారం, నీరు పంపిణీ చేయనున్న కేజ్రీవాల్‌ సర్కారు
పంజాబ్‌, హర్యానా, యూపీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి దేశ రాజధాని వైపు వస్తున్న రైతులకు ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. వారికి ఆహారం, నీరు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ నేత రాఘవ్‌ చడ్డా మీడియాకు వెల్లడించారు. అన్నదాతలు తమ న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. వారి ఉద్యమానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్టేడియాలను ఓపెన్‌ జైళ్ళుగా చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వం తొలుత కోరగా.. ఢిల్లీ సర్కారు అందుకు నిరాకరించింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులని నేరస్తుల మాదిరి జైళ్ళల్లో పెట్టడాన్ని తమ ప్రభుత్వం సమర్థించదని ఆప్‌ సర్కారు స్పష్టం చేసింది. అందుకే తాము కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించి, రైతులకి ఇబ్బందులు కలగకుండా ఇద్దరు నోడల్‌ అధికారులను నియమించినట్టు వెల్లడించింది.

రైతు ఉద్యమాన్నిఏ ప్రభుత్వమూ ఆపలేదు:రాహుల్‌ గాంధీ
ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా రైతుల న్యాయ మైన ఉద్యమాన్ని ఆపలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న రైతులకి తమ పార్టీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుందన్నారు. రైతులతో తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరిం చాలన్నారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరిం చారు.

హుందాగా వ్యవహరించాలి : పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌
రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. కానీ, మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. రైతులను కాంగ్రెస్‌ రెచ్చగొడుతుందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం సరికాద న్నారు. కడుపు కాలిన రైతు రోడ్డు మీదకి వచ్చి ఆందో ళన చేపడుతున్నాడనీ, ఎవరో రెచ్చగొడితే అన్నదాత రోడ్లపైకి రాడని బదులు సమాధానం ఇచ్చారు.

రైతులతో చర్చలకు సిద్ధం:కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌
రైతు చట్టాలపై ఉద్యమం చేస్తున్న అన్నదాతలతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. కరోనా విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో సమూహాలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. ప్రభుత్వం రైతులతో వీలైనంత తొందరగా చర్చలు జరుపుతుందని హామీనిచ్చారు. ఇప్పటికైనా ఆందోళన ఆపాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates