మహా గర్జన..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిర్బంధాలకు సవాల్‌ విసిరిన చారిత్రాత్మక సమ్మె
సమ్మెలో 25 కోట్ల మంది కార్మిక, ఉద్యోగులు
అడుగడుగునా నిర్బంధాలు
ఢిల్లీలో నీటి ఫిరంగులకు ఎదురొడ్డి…
మోడీ ముర్దాబాద్‌..అంటూ మారుమోగిన దేశ రాజధాని
జాతీయ కార్మిక సంఘాల నేతల అరెస్ట్‌

గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్మిక,కర్షకలోకం కదంతొక్కింది. మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలు మాకు వద్దు అంటూ మహాగర్జన చేసింది. ఏడు ప్రధాన డిమాండ్ల సాధన కొరకు పది కేంద్ర కార్మిక సంఘాల నేతృత్వంలో జరిగిన సార్వత్రిక సమ్మె దేశాన్ని స్తంభింపజేసింది. మరోవైపు ఢిల్లీలో అడుగడుగునా అడ్డంకులు..రోడ్లపై సిమెంట్‌ దిమ్మెలు ముండ్ల కంచెలు..బారికేడ్లు..ఇవన్నీ దాటుకుని రారనుకున్నది మోడీ సర్కార్‌. పిడికిలి బిగించి కదంతొక్కారు. కన్నెర్ర చేస్తూ ముందడగువేశారు. వారిని ఎలాగైనా దేశరాజధానిలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. లాఠీలు ఝుళిపించారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా జల ఫిరంగులు..టియర్‌ గ్యాస్‌లతో పోలీసులు విరుచుకుపడ్డారు.

కేంద్రంలోని మోడీ సర్కార్‌ కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వర్గం, కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ సమ్మెలో పాల్గొన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ, ఇతర కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఎస్మాలు ప్రయోగించినప్పటికీ హక్కుల పోరాటం ఉధృతం గా కనిపించింది.

దేశవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు, అధ్యపకులు రోడ్డు, రైలు దిగ్బంధనాల్లో పాల్గొన్నారు. దేశంలో కార్మిక, రైతు, ప్రజల హక్కులు, జీవితాలు, జీవనోపాధిపైన మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జరుపుతున్న దారుణమైన దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా వందలాది మిలియన్ల మంది కార్మికులు, రైతులు ఒకటై నిలదీశారు. దేశ సంపదను సష్టించే 25 కోట్ల మంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, శ్రమించే ఇతర వర్గాలు సమ్మెలో పాల్గొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా భారీ నిరసనల్లో మిలియన్ల మంది రైతులు కూడా భాగస్వామ్యం అయ్యారు.

చాలా రాష్ట్రాల్లో బంద్‌ ఛాయలు
కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో బంద్‌ వాతావరణం నెలకొంది. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. కర్మాగారాలు, దుకాణాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. అసోం, పుదుచ్చేరి, ఒడిశా, తెలంగాణతో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లోనూ బంద్‌ ప్రభావం కనిపించింది. తమిళనాడులో 13 జిల్లాల్లో పూర్తి స్థాయి బంద్‌ పాటించాయి మిగిలిన జిల్లాల్లో పారిశ్రామిక సమ్మెతో కర్మాగారాలు మూతపడ్డాయి. పంజాబ్‌, హర్యానా ల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ బాల్కోతో సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల శ్రామికజనం రోడ్డె క్కారు. కర్నాటక, తెలంగాణ, పంజాబ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ మొ దలైన రాష్ట్రాల్లో పారిశ్రామిక వాడలు పూర్తిగా మూత పడ్డాయి. కోల్‌కతా, చెన్నై, టుటికోరిన్‌, కొచ్చిన్‌, జేఎన్‌పీటీ, విశాఖ, పారాడిప్‌ పోర్టుల్లో అత్యధికమంది కార్మికులు సమ్మె భేరీ మోగించారు. కాంట్రాక్టుల బెదిరింపులు ఉన్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులతో సహా బొగ్గు, రాగి గనుల, ఉక్కు, ఇను ప ఖనిజ కార్మికులు కదంతొక్కారు. బెంగళూరులో ప్రభుత్వ రంగంలోనూ సమ్మె ప్రభావం పూర్తిగా కనిపించింది. హైద రాబాద్‌లోని పీఎస్‌యూల్లో కూడా సమ్మె దెబ్బకు స్తంభిం చిపోయాయి. అసోం, పంజాబ్‌, మధ్య ప్రదేశ్‌ వంటి అనేక రాష్ట్రాల్లో సమ్మె కారణంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్టు తీవ్రంగా ప్రభావితమైంది. భారత నౌకాదళం దేశంలోనే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విధుల్లో ఉన్నవారు కూడా అక్కడ నుంచి సంఘీభావం తెలిపారు.

సమరభేరీలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు
ఇన్సురెన్సు రంగలో సమ్మె పూర్తిగా జరిగింది. బ్యాంకుల్లో భారీగా జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. టెలికాం, పోస్టల్‌, ఉక్కు రంగ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. ఆదాయపు పన్నుశాఖ ఉద్యోగులు, గ్రామీణ డాక్‌ సేవకులు వంద శాతం సమ్మెలో పాల్గొన్నారు. పీఎస్‌యూ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైల్వే, రక్షణ ఉద్యోగులు సమ్మెకు మద్దతుగా ఆయా పని ప్రదేశాలలో ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అనేక చోట్ల చమురు రంగ సంఘాలు కూడా సమ్మెలో భాగస్వామ్యం అయ్యాయి. నిర్మాణ రంగం కార్మికులు, హెడ్‌ లోడ్‌ కార్మికులు, షాప్‌ ఉద్యోగులు, గృహ కార్మికులు, బీడీ కార్మికులు, ప్రయివేట్‌ రోడ్డు రవాణా కార్మికులు, హాకర్లు, అమ్మకందారులు, తోటల పెంపకం , కోయిర్‌ కార్మికులతో సహా సాంప్రదాయ రంగ కార్మికులు మొదలైన కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున స్కీమ్‌ వర్కర్లు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు.

అంతర్జాతీయ సంఘీభావం
సార్వత్రిక సమ్మెకు అంతర్జాతీయ సంఘీభావం లభించింది. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (డబ్ల్యూఎఫ్‌టీయూ)తో పాటు, దాని అనుబంధ సంస్థలు సంఘీభావ సందేశాలు పంపాయి.

ఇది ఆరంభమే… : సీఐటీయూ
బీజేపీ ప్రభుత్వ వినాశకరమైన, విఘాతకర విధానాలు నశించే వరకూ కార్మికులు, రైతులు విశ్రాంతి తీసుకోరనీ, ఈ సమ్మె ప్రారంభం మాత్రమేనని, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేవరకూ తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమలత, తపన్‌ సేన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోపాల్గొన్న ఆందోళనలో ఎఆర్‌ సింధూ (సీఐటీయూ),అమర్‌ జిత్‌ కౌర్‌ (ఏఐటీయూసీ), అశోక్‌ సింగ్‌ (ఐఎన్‌టీయూసీ), హర్భజన్‌ సింగ్‌ సిద్దూ (హెచ్‌ఎంఎస్‌), ఆర్‌కె శర్మ (ఏఐయూటీయూసీ ి), లతా (సెవా), సంతోష్‌ రారు (ఏఐసీసీటీయూ), జెపి సింగ్‌ (ఎల్‌పీఎఫ్‌), శత్రుజీత్‌ సింగ్‌ (యూటీయూసీ) తదితరులు పాల్గొన్నారు.

ఛలో ఢిల్లీఉద్రిక్తం
రైతాంగం నడ్డివిరిచే నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ… ట్రేడ్‌ యూనియన్లు, రైతు సంఘాలు పిలుపునిచ్చిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ముఖ్యంగా రైతాంగాన్ని నిలువరించే చర్యల్లో భాగంగా ఢిల్లీ సరిహద్దు చేరుకున్న రైతులపై నీటి ఫిరంగు (వాటర్‌కెనాన్‌)లతో విరుచుకుపడ్డారు. తొలుత పాదయాత్ర ద్వారా ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన అంబాలా చేరుకున్న రైతులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. మరోవైపు హర్యానాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుక్షేత్రకు చేరుకున్న వందలాది మంది రైతులపై వాటర్‌కెనాన్‌లతో పోలీసులు విరుచుకుపడ్డారు. వాటి నుంచి తప్పించుకునేందుకు రైతులు పరుగులు తీయడం, పైగా శీతాకాలం కావడంతో చలికి వణుకుతూనే ఢిల్లీ వైపు కదం తొక్కడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఏ చట్టం కింద అరెస్టు చేశారు..
ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వెళుతున్న రైతులు అడుగడునా అడ్డగించిన పోలీసులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, యూపీ సరిహద్దులో పోలీసులు అడ్డుకోవడం పట్ల కర్షకులు కన్నెర్ర చేశారు. యూపీ సరిహద్దు వద్ద ప్రముఖ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఏం చట్టం కింద మమల్ని అరెస్టులు చేశారో, ఏ చట్టం ప్రకారం మమ్మల్ని అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులను అడ్డగిస్తున్నా మని పోలీసులు చెబుతున్నారనీ, సరైన ఆదేశాలు లిఖితపూర్వకంగా చూపించలేదని ఆగహ్రం వ్యక్తం చేశారు. ఎందుకు నిరసనలు చేపడుతున్నామో, ఎందుకు ఢిల్లీకి వెళుతున్నామో అడగకుండానే అడ్డుకుంటున్నారని తెలిపారు.

రోడ్లపైనే వంట వార్పు.. వెనక్కేది తగ్గం.అన్నదాత…
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదార విధానాలకు వ్యతిరేకంగా ఛలో పార్లమెంట్‌కు పయనమైన రైతులు తమ వంట వండుకునేందుకు బియ్యం, కూరగా యలు తెచ్చుకున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్న రైతులు… చలిని కూడా తట్టుకునేందుకు దుప్పట్లు కూడా తెచ్చుకున్నారు. హర్యానాలో చలో ఢిల్లీని జయప్రదం చేసేందుకు బయలు దేరిన రైతులు, ఆందోళనకారులను అణఛివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం… నీటి ఫిరంగులు వినియోగించినప్పటికీ…. వారిని ఏమి చేయలేకపోయాయి. వీటి అన్నింటిని ఎదుర్కొంటూ ఉద్యమకారులు ముందుకు సాగారు. ఎన్ని అడ్డంకులెదురైనా నిరసనల్లో పాల్గొంటామని ఏఐకేఎస్‌సీసీ కన్వీనర్‌ విఎం సింగ్‌ పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా ఉపయోగించడాన్ని అడ్డుకుంటే, రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. అన్నదాతలను అడ్డుకుంటూ… అక్రమ నిర్బంధాలు, దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నా ప్రధాని కార్యాలయము తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ఎదుర్కొంటూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ వైపు కదలడం ప్రభుత్వ వ్యతిరేకతని స్పష్టం చేస్తుందన్నారు.

జంతర్‌ మంతర్‌ వద్ద అరెస్టులు
జంతర్‌మంతర్‌ దాని పరిసర ప్రాంతాలు ”మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌… శరం కరో, శరం కరో” అంటూ నినాదాలు, ప్లకార్డులతో హోరెత్తాయి. పోలీసులు ఎక్కడిక్కడ నిరసనకారులను అరెస్టులు చేశారు. అరెస్టు చేసిన నేతలు, కార్మికులు, విద్యార్థులను స్థానిక పార్లమెంట్‌ స్ట్రీట్‌లో పోలీసు స్టేషన్‌కి తరలించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఛలో ఢిల్లీని జయప్రదం చేసేందుకు సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్‌ నేతలు తపన్‌సేన్‌, హేమలత, ఏఆర్‌ సింధూ(సీఐటీయూ), అమర్‌జీత్‌ కౌర్‌(ఏఐటీయూసీ), అశోక్‌ సింగ్‌(ఐఎన్‌టీయూసీ), ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ నేతలు హన్నన్‌ మొల్లా, విజయప్రసాద్‌, విజూకృష్ణ(ఏఐకేఎస్‌), ప్రముఖ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌, ప్రతిభా షిండే తదితర నేతలు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోనళా కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాజ్యాంగ దినోత్సవం రోజున రైతులపై దాడినా?: హన్నన్‌ మొల్లా, ఏఐకేఎస్‌
రైతే రాజు అని అభివర్ణించే దేశంలోనే రాజ్యాంగ దినోత్సవం నాడే రైతులపై పోలీసులు దాడి చేయడం దారుణమని ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా అన్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం పెట్టుబడిదారుల కనుసన్నల్లో నడవటం బాధాకరం అన్నారు. వేలది మంది రైతులను, రైతు నాయకులను ఢిల్లీకి వెళ్లనివ్వకుండా వారి రాష్ట్రాలలోను, ఇతర రాష్ట్రాలలోను అరెస్టు చేసి ఆపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల ఆర్తనాదం వినిపిస్తోందా? : ఏచూరి
బడాపెట్టుబడిదారుల మోజులో ఉన్నటువంటి ప్రధాని మోడీకి రైతుల ఆర్తనాదం వినిపిస్తోందా? అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నిలదీశారు. మీరు వినకుంటే… తాము ప్రజాస్వామ్యయుతమైన ఆందోళనలతో తమరి ప్రభుత్వాన్ని వినే విధంగా చేస్తామని ఆయన గురువారం ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటే… దేశమంతా చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ సమ్మెలో పాల్గొన్న కార్మికవర్గాన్ని ఏచూరి ప్రత్యేకంగా అభినందించారు. మోడీ సర్కారు రాజ్యాంగ దినోత్సవం నాడే రైతులను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకోవడం సంవిధాన్ని ఉల్లంఘించినట్టే ఆయన అభిప్రాయపడ్డారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates