‘స్థానిక’ స్ఫూర్తికి ఎక్స్‌ అఫిషియో విఘాతం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ప్రజా తీర్పునకు భిన్నంగా అధ్యక్ష పదవులు
  • ఎక్స్‌ అఫిషియోలుగా వేరే ప్రాంతాల వారూ 
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు చాన్స్‌
  • ప్రజలు మెజారిటీ ఇచ్చినా ఫలితాల్లో మార్పు
  • ఇటీవలి మునిసిపల్‌ ఎన్నికల్లో జరిగిందిదే! 
  • ‘గ్రేటర్‌’లోనూ భారీగా ఎక్స్‌ అఫిషియోలు

స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్ఠితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. అధికార వికేంద్రీకరణతోనే స్థానిక పాలన సుసాధ్యం. కానీ, స్థానికంలోనూ శాసన/చట్ట సభ్యుల ప్రమేయం ఆ స్ఫూర్తికి విఘాతాన్ని కలిగిస్తోంది. ప్రజలు స్థానికంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని.. ఎక్స్‌-అఫిషియో ఓటు ద్వారా ఫలితాలను తారుమారు చేస్తూ.. ఓటర్ల విశ్వాసానికి తూట్లు పొడవడం గడిచిన 15 ఏళ్లుగా.. మండల పరిషత్‌ ఎన్నికలు మొదలు.. జడ్పీ, పురపాలికలు, నగరపాలికల ఎన్నికల్లో కనిపిస్తూనే ఉంది. మెజారిటీ సభ్యులు ఉన్న పార్టీకి కాకుండా.. ఎక్స్‌-అఫిషియోల బలం ఉన్న పార్టీలకే అధికారం దక్కుతోంది. ఇది చట్టం ప్రకారం న్యాయంగానే కనిపిస్తున్నా.. ప్రజల తీర్పునకు పూర్తి భిన్నమని మేథావులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ : ఓటర్ల విశ్వాసానికి తూట్లు పొడవడం గడిచిన 15 ఏళ్లుగా.. మండల పరిషత్‌ ఎన్నికలు మొదలు.. జడ్పీ, పురపాలికలు, నగరపాలికల ఎన్నికల్లో కనిపిస్తూనే ఉంది. మండల పరిషత్‌ అధ్యక్షుడి(ఎంపీపీ)ని మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. మునిసిపల్‌ చైర్మన్లు వార్డు కౌన్సిలర్ల ద్వారా, కార్పొరేషన్ల మేయర్లు డివిజన్‌ కార్పొరేటర్ల ద్వారా ఎన్నికవుతారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఈ పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో వారు.. తమకు సంబంధం లేని, తమ నియోజకవర్గాల పరిధిలో లేని పురపాలికలు, నగరపాలికల్లో ఎక్స్‌-అఫిషియోలుగా నమోదు అవుతూ ఫలితాలను తారుమారు చేస్తున్నారు.

అక్కడ ఫలితాలు మారాయిలా..
జనవరిలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో నేరేడుచర్ల మునిసిపాలిటీలో ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. ప్రజాతీర్పు ప్రకారం.. పొందిన ఓట్ల లెక్కన చూస్తే.. ఆ పార్టీకే చైర్మన్‌ పీఠం దక్కాలి. కానీ, టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలు అక్కడ ఎక్స్‌అఫిషియోలుగా నమోదు చేయించుకున్నారు. ఫలితంగా.. మునిసిపల్‌ చైర్మన్‌ పదవి టీఆర్‌ఎ్‌సకు దక్కింది. తక్కుగూడ మునిసిపాలిటీలోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. సింహభాగం వార్డుల్లో బీజేపీ సభ్యులు విజయం సాధించారు. నైతికంగా చైర్మన్‌గిరీ వారికే దక్కాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేకే  తక్కుగూడ నుంచి ఎక్స్‌అఫిషియోగా నమోదు చేయించుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు.

నిజానికి ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని స్థానిక సంస్థల్లో ఒకచోట ఎక్స్‌అఫిషియోగా నమోదు చేసుకోవాలి. గవర్నర్‌ కోటా, శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్స్‌అఫిషియోగా నమోదు చేయించుకోవచ్చు. గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు వారి పరిధిలోనే ఎక్స్‌ అఫిషియో ఓటుహక్కును పొందాలి. అయితే.. పలువురు తమకు సంబంధం లేని ప్రాంతంలోని స్థానిక సంస్థల్లో పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో.. మేయర్‌ ఎవరనేది ఎక్స్‌-అఫిషియోలే నిర్ణయించే అవకాశాలున్నాయి. ఇక్కడ.. కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ), పురాణం సతీశ్‌ (ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం), భానుప్రసాద్‌ (కరీంనగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ), నారదాసు లక్ష్మణ్‌రావు (కరీంనగర్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ) ఎక్స్‌-అఫిషియోలుగా ఉన్నారు.

గ్రేటర్‌లో వారిదే హవా
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మేయర్‌ పీఠం కోసం మేజిక్‌ ఫిగర్‌పై ఎక్స్‌-అఫిషియోల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 150 డివిజన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. వీరి నుంచే ఒకరు మేయర్‌ అవుతారు. అంటే.. మేజిక్‌ ఫిగర్‌ను 76గా భావించవచ్చు. కానీ, జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌-అఫిషియోల సంఖ్య 49గా ఉంది. ఇటీవలే గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ముగ్గురు ఎమ్మెల్సీలు హైదరాబాద్‌నే ఎంచుకుంటే ఆ సంఖ్య 52కు చేరుతుంది.

ఇప్పటికే నమోదు చేసుకున్న 49 మందిలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఐదుగురు లోక్‌సభ సభ్యులు, 25 మంది ఎమ్మెల్యేలు(నామినేటెడ్‌తో కలిపి), 17 మంది ఎమ్మెల్సీలున్నారు. పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎ్‌సకు 35 మంది, మజ్లి్‌సకు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రె్‌సకు ఒకరు మాత్రమే ఉన్నారు. 49 మంది ఎక్స్‌-అఫిషియోలను కలుపుకొంటే మేయర్‌ ఎన్నికకు మేజిక్‌ ఫిగర్‌ 100 అవుతుంది. కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే నమోదైతే మేజిక్‌ ఫిగర్‌ 102గా మారుతుంది. అంటే,  ఏదేని ఒక పార్టీ స్వతంత్రంగా 76 డివిజన్‌లను గెలిచినా ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలతో మేయర్‌ పీఠం దక్కకపోవచ్చు. నేరేడుచర్ల, తుక్కుగూడలే ఇందుకు ఉదాహరణలు.

ఎంపీలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా?
ప్రజలు కార్పొరేటర్లను ఎన్నుకుంటారు. కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోవాలి. మధ్యలో ఎక్స్‌-అఫిషియో కింద ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమేయం ఉండకుడదు. అలా చేస్తే అది అప్రజాస్వామికం అవుతుంది. రాజ్యసభ సభ్యులు అసెంబ్లీలో కూర్చోని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నట్లు ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసం ఏ సవరణ చేసాయో.. దాన్ని మార్చాలి. ప్రజలు ఎన్నుకున్న స్థానిక సంస్థల సభ్యులే.. వారి అధ్యక్షులు/చైర్‌పర్సన్లు/మేయర్లను ఎన్నుకోవాలి.
– డాక్టర్‌ పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates