దేశ సంపదను లూటీ చేస్తున్న మోడీ విధానాలపై సమ్మె సైరన్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
న‌ర‌సింగ‌రావు
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)

సహజ సంపదకు భారతదేశం నిలయం. సరళీకరణ విధానాల పేరుతో భూములు, గనులు, సముద్ర తీర ప్రాంతాలు, భారీ పరిశ్రమలను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. కరోనా కాలాన్ని అడ్డం పెట్టుకొని బిజెపి స్వతంత్రంగా మెజార్టీ సాధించడంతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను సంపూర్ణంగా అమలు చేస్తున్నది. స్వాతంత్య్ర కాలం నుంచి అభివృద్ధి చేసిన స్టీల్‌, కోల్‌, విద్యుత్‌, ఇంధనం, రైల్వే, రక్షణ, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ తదితర రంగాలన్నింటిని కార్పొరేట్ల లూటీకి అనుకూలంగా బిజెపి విధానాలు రూపొందించింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభించి రూ.17 లక్షల కోట్ల సంపదను ఇన్సూరెన్స్‌ రంగం విస్తరించింది. ఈ రంగాన్ని నేడు విదేశీ పెట్టుబడులకు ఎందుకు అనుమతించినట్లు?

బిఎస్‌ఎన్‌ఎల్‌ భారతదేశం లోనే అత్యంత ప్రధానమైన కమ్యూనికేషన్‌ రంగంలో నేటికీ 4-జి టెక్నాలజీని అనుమతించలేదు. బిఎస్‌ఎన్‌ఎల్‌ కాళ్లు, చేతులు కట్టివేసి ఈ రంగంలో రిలయన్స్‌ పరిగెత్తటానికి మోడీ విధానాలు అవకాశం కల్పించాయి. ఒకవైపు దేశభక్తి, ఆత్మ నిర్భర్‌ భారత్‌ (స్వయం సమృద్ధి) పేరుతో మోడీ ఉపన్యాసాలిస్తూ భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగించే విధానాలను బిజెపి చేపట్టింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను జాయింట్‌ వెంచర్‌ పేరుతో దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’తో ఒప్పందం చేసింది. మోడీ గోబెల్స్‌ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ రంగమే ఉదాహరణ. 2000 సంవత్సరం లోనే…బిజెపి మొదట అధికారంలో వున్న కాలంలో రూ.5 వేల కోట్ల విలువ కలిగిన బాల్కో పరిశ్రమను రూ. 500 కోట్లకే వేదాంత (స్టెరిలైట్‌ ఇండిస్టీస్‌)కి కట్టబెట్టింది. అదే విధంగా హిందుస్తాన్‌ జింక్‌ను వేదాంతకు అప్పగించింది.

స్వాతంత్య్రం వచ్చిన కొద్ది కాలానికే భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలను నిర్మించి మన దేశం అన్ని రంగాలలోనూ స్వయంసమృద్ధిని సాధించింది. ఈ భారీ పరిశ్రమలను ఆధునిక దేవాలయాలని నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కొనియాడారు. రష్యా సహాయంతో ఔషధ కంపెనీ ఐడిపిఎల్‌ ను నిర్మించుకున్నాం. ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ఐడిపిఎల్‌ ను పూర్తిగా మూసివేయడం జరిగింది. ఔషధ రంగంలో ప్రైవేట్‌ రంగానికి పోటీ లేకపోవడంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు విచ్చలవిడిగా లాభాలు పెంచుకున్నాయి. భారతదేశం లోని మొదట 10 మంది ధనవంతులలో ఈ ఔషధ కంపెనీల వారే అగ్ర భాగాన వున్నారు. 1990లో ఔషధ రంగంలో వార్షిక ఉత్పత్తి రూ.5 వేల కోట్లు వుండగా నేడు ఔషధ రంగంలో ఉత్పత్తి రూ. 2.23 లక్షల కోట్లకు పెరిగింది. ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారు. కరోనా కాలంలో మందుల ధరలు విపరీతంగా పెంచారు. అన్ని రంగాలలోనూ ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రజలపై తీవ్రంగా భారాలు పెరిగాయి. కరోనా సమయంలో మొదటి త్రైమాసికంలో బిలియనీర్లు తమ లాభాలను 23.7 శాతం పెంచుకున్నారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులపై దాడిని తీవ్రతరం చేసింది. కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని కార్మికుల సర్వీస్‌ కాలాన్ని 30 సంవత్సరాలకు కుదించింది. ప్రతి ఉద్యోగి 55 సంవత్సరాల వయస్సు లేదా 30 సంవత్సరాల సర్వీసుకు రిటైర్‌ కావాలని, కంపల్సరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ను ఉద్యోగులపై బలవంతంగా రుద్దింది. అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని స్వయంగా మోడీ ప్రకటించారు. ప్రభుత్వ రంగాలను మూసివేయడమంటే ఎస్‌సి, ఎస్‌టి లకు రిజర్వేషన్‌ లేకుండా సామాజిక న్యాయాన్ని మంటగలపడమే. 32 కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేయాలని ప్రకటించారు. వీటిలో దుర్గాపూర్‌, సేలం, భద్రావతి, నీలాచల్‌, నగర్నార్‌ లాంటి 5 స్టీల్‌ పరిశ్రమలున్నాయి. కొత్త లేబర్‌ కోడ్‌ల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో రిక్రూట్‌మెంట్‌ ఉండదు.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ పేరుతో తాత్కాలిక ఉపాధి మాత్రమే వుంటుంది. నిరుద్యోగం ఇప్పటికే 9 శాతం వున్న మన దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతుంది. చాలీచాలని జీతాలతో కార్మికులు జీవితాలు గడపవలసి వస్తుంది. కార్మికులకు జీతాలు పెంచడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికుల కొనుగోలు శక్తి పెంచడమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం. కాని కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఉత్పత్తి పెంచుతామని మోడీ ప్రకటించారు. ఇప్పటికీ కార్పొరేట్లకు రూ.18 లక్షల కోట్ల రాయితీలిచ్చారు. కార్పొరేట్‌ పన్ను 30 శాతం నుంచి 23 శాతం తగ్గించారు. బ్యాంకు రుణాల మాఫీ, వడ్డీ మాఫీ వగైరా అనేక రాయితీలు ఇచ్చారు. మరోవైపున కరోనా సమయంలో కోట్లాది మంది వలస కార్మికులకు కనీసం ఆహారం, రైళ్లు కూడా సమకూర్చలేదు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమని రుజువు చేసుకుంది. వారికి అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చి పరిశ్రమల విస్తరణకు సహాయపడేది.

ఈ కాలంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల నుంచి రిజర్వు నిధులను ప్రభుత్వ ఖజనా లోకి జమ చేసింది. ఒక భారీ పరిశ్రమను మరో భారీ పరిశ్రమకు అమ్మి ఆ నిధులను కేంద్ర బడ్జెట్‌ నిధులకు జమ చేసింది. హిందుస్తాన్‌ పెట్రోలియం కంపెనీని రూ. 60 వేల కోట్లకు ఓఎన్‌జిసి కి అమ్మి కేంద్ర బడ్జెట్‌కు జమ చేసుకుంది. అత్యంత బలోపేతమైన ఓఎన్‌జిసి ని అప్పులపాలు చేసింది. ‘పి.ఎం.కేర్స్‌’ ఫండ్‌ పేరుతో 38 నవరత్న కంపెనీల నుంచి రూ.2,105 కోట్లు వసూలు చేసింది. ఈ నిధులపై ‘కాగ్‌’ అజమాయిషీ లేదు. బిజెపి ఎజెండాకు అనుకూలంగా నిధులు దారి మళ్లించారు.

కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమలతో పాటు భారతదేశంలోని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించాలని మూడు వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. బిజెపి కి రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటింగ్‌ జరపకుండా మూజువాణి ఆమోదం పొందడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. వంద కోట్ల మంది భారత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం దేశద్రోహం. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ఎజెండాలో భాగంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. పొరుగు దేశాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నది. యు.పి లోని హత్రాస్‌ ఘటన ఎస్‌సి, ఎస్‌టి లు, మహిళలపై దాడికి పరాకాష్ట. హత్రాస్‌ ఘటనలో హత్యాచారానికి గురైన బాలిక మృతదేహాన్ని కనీసం తల్లిదండ్రులకు కూడా చూపకుండా దహన సంస్కారాలు చేయడం యు.పి పోలీస్‌ కిరాతక చర్యలకు అద్దం పడుతున్నది.

మోడీ ప్రభుత్వం మార్చి 24న 4 గంటల వ్యవధిలో దేశమంతా మిలటరీ కర్ఫ్యూ విధించింది. నేటికీ కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. కాని కార్పొరేట్‌ అనుకూల విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నారు. 29 కార్మిక చట్టాలను 4 కోడ్‌ లుగా మార్చారు. బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఏ కార్మిక చట్టాలు 2 సంవత్సరాల వరకు అమలు చేయమని ఆర్డినెన్స్‌ తెచ్చారు. గుజరాత్‌ ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రతి కార్మికచట్టం పోరాడి సాధించుకున్నదే. ఏ ప్రభుత్వాలు కార్మికులపై దయాదాక్షిణ్యాలతో చట్టాలు చేయలేదు. పోరాటాల ఫలితంగా చట్టాలు సాధించుకున్నారు. బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలు లేని సమయంలో లేబర్‌ కోడ్‌లు ఆమోదించుకోవడం సిగ్గుచేటు. కార్మిక చట్టాల లోని సారాన్ని పిండి పిప్పి మాత్రమే మిగిల్చారు. యూనియన్ల ఏర్పాటుకు ఆంక్షలు విధించారు. సమ్మెలు చేయకుండా పూర్తి ఆటంకాలు కల్పించారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కార్మికుల పోరాటాలతో బిజెపి ప్రయత్నాలను తిప్పికొడదాం. బిజెపి నియంతృత్వ పోకడలను అడుగడుగునా కార్మికవర్గం అడ్డుకోవాలి. బ్రిటీష్‌ కాలంలో భగత్‌సింగ్‌, అల్లూరి లాంటి త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. బ్రిటీష్‌ వారిని తరిమికొట్టారు. కార్మికులు, రైతాంగం హక్కులు కాపాడుకోవడం మరో స్వాతంత్య్ర పోరాటం. ఈ పోరాటంలో పాల్గొనేవారే చరిత్రలో నిజమైన హీరోలుగా మిగిలిపోతారు.

(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)

RELATED ARTICLES

Latest Updates