బీసీలకు వ్యక్తిగత రుణాలేవి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఏడేళ్లలో ఒక్కసారే ఇచ్చారు!.. వారు గుర్తుకొచ్చేది ఎన్నికలప్పుడే
  • 2018లో 40 వేల మందికి రుణాలు
  • తాజాగా హైదరాబాద్‌లో 1360 మందికి
  • ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఏటా రుణాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీసీలకు వ్యక్తిగత రుణాల విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్కసారి మాత్రమే రుణాలు మంజూరు చేసింది. తర్వాత మళ్లీ వాటి ఊసే ఎత్తడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు వ్యక్తిగత రుణాలు ప్రతి ఏటా మంజూరు చేసేవారు. రాష్ట్ర జనాభాలో 50ు పైగా ఉన్న బీసీల్లో చిరువ్యాపారులే ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసిందన్న విమర్శలున్నాయి.

గ్రేటర్‌ కోసం 3 జిల్లాల్లో సబ్సిడీ రుణాలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలోని బీసీ, ఎంబీసీ కులాల కార్పొరేషన్‌, ఫెడరేషన్ల ద్వారా ఆయా కులాలకు సర్కారు ఇటీవల రుణాలు మంజూరు చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1360 మంది బీసీలకు రూ.6.80 కోట్ల రుణాలిచ్చింది. ఈసారి కూడా బ్యాంకు లింకేజీ లేకుండా 100ు సబ్సిడీపై లబ్ధిదారులకు నేరుగా అందజేసింది. దీంతో ‘మళ్లీ ఎన్నికలొస్తేనే మాకు ఇస్తారా?’ అని ఇతర జిల్లాల బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీసీ కార్పొరేషన్‌ నిధులూ తీస్కోలే..
బీసీలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కార్పొరేషన్‌ నుంచి అన్ని రాష్ట్రాలకు సబ్సిడీపై రుణాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ సర్కారు జాతీయ బీసీ కార్పొరేషన్‌ నుంచి ఒక్క రూపాయి రుణం కూడా తీసుకోలేదు. కేంద్రం నుంచి తీసుకునే రుణాల్లో రాష్ట్రాలకు 25-30ు సబ్సిడీ కూడా లభిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం వాటి కోసం ప్రయత్నమే చేయలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అప్పులు బీసీలకు.. ఆస్తులు రాజకీయ నేతలకా?
కేసీఆర్‌ సర్కారు బీసీ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోంది. రాష్ట్రంలో 52ు మంది ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం ఏడేళ్లలో వివిధ సంస్థల నుంచి రూ.3 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. ఆ అప్పుల భారమంతా సగం జనాభా ఉన్న బీసీలపైనే పడుతోంది. అప్పులేమో బీసీలకు.. ఆస్తులేమో రాజకీయ నేతలకు దక్కుతున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచి పెడుతోంది. పెండింగ్‌ దరఖాస్తులకు రుణాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.
– ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates