పరిహారమేదీ..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– లాక్‌డౌన్‌ లో ఆర్థికంగా చితికిన కార్మికులు
– రూ.7500 ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ చేస్తున్న ట్రేడ్‌ యూనియన్లు
– స్పందించని మోడీ సర్కారు.. శ్రామికులజీవితంతో చెలగాటం

కేంద్రం విధానాలు దేశంలోని సామాన్యప్రజలతో పాటు ప్రతివర్గానికి ఆగ్రహం కలిగిస్తున్నాయి. దేశంలో కోవిడ్‌ విజృంభణ, లాక్‌డౌన్‌ ప్రభావం, తదనంతర తీవ్ర పరిణామాలు అనేక ఇబ్బందులను కలిగించిన విషయానికి దేశప్రజలే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ముఖ్యంగా, మోడీ సర్కారు చెప్పే లెక్కల్లో ఉన్న మాధుర్యం చేతల్లో మాత్రం ఉండటం లేదు. పేదలు, వలసకార్మికులకు గరీబ్‌కళ్యాణ్‌ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అసలు లబ్దిదారులెవరో కచ్చితమైన లెక్కలు లేకుండానే 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అప్పట్లో ప్రకటనలు చేయడం.. లబ్దిదారుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉన్నదని సర్వేల్లో తేలిన విషయం విదితమే. ముఖ్యంగా కేంద్రం తీసుకున్న అనాలోచిత లాక్‌డౌన్‌ నిర్ణయంతో దేశంలోని కార్మికులందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కూలీకి వెళ్తేకానీ పూట గడవని ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కానీ, మోడీ సర్కారు మాత్రం వారికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలన్న ఆలోచనే చేయడంలేదు. కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లకూ కేంద్రం స్పందించడంలేదు.

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ ఉన్న నెలల్లో ఆర్థికంగా నష్టపోయిన కార్మికులందరికీ రూ.7500 ఎక్స్‌గ్రేషియా అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, మోడీ సర్కారు విధానాలకు తోడు కోవిడ్‌-19 దెబ్బతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్రంగా కుంగిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కార్పొరేట్లు, వ్యాపారవేత్తలకు ఆపన్నహస్తం చాస్తున్న మోడీ సర్కారు కార్మిక సంఘాల డిమాండును పెడచెవిన పెడుతోందని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ట్రేడ్‌ యూనియన్ల డిమాండ్‌ ప్రకారం వెళ్తే ఈ నగదు బదిలీ కోసం కనీసం మూడు నెలలకు (లాక్‌డౌన్‌లో ఆదాయం కోల్పోయిన నెలలు) గానూ అయ్యే ఆర్థిక వ్యయం సుమారు రూ.10 లక్షల కోట్లు. 2019-20 జీడీపీలో దాదాపు ఐదుశాతానికి దగ్గరగా ఉంటుంది. 2018-19 నాటి పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) డేటా.. మన శ్రామిక శక్తిలో సగానికి పైగా (52శాతం) స్వయం ఉపాధి పొందుతున్నట్టు వెల్లడించింది.

ఇక ఉద్యోగం చేస్తున్నవారు, సాధారణ ఉద్యోగులు, వేతన ఉద్యోగులు 24శాతం, సాధారణ కార్మికులు 24శాతంగా ఉన్నారు. ఈ మూడు విభాగాలలోని గ్రామీణ, పట్టణ, మగ, మహిళా కార్మికుల సగటు నెలవారీ ఆదాయం 2019 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వరుసగా రూ.10,648, రూ.16,196, రూ.7,566 గా ఉన్నాయి. కాబట్టి, ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కార్మికులు లాక్‌డౌన్‌ ద్వారా తాము కోల్పోయిన ఆదాయానకి నష్టపరిహారం పొందే హక్కు ఉన్నదని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు అన్నారు. గతేడాది రేట్ల ప్రకారం చూసుకున్నప్పటికీ ఈ మూడు నెలలకు గానూ నెలకు రూ.7500 చొప్పున ప్రతికార్మికుడికి నగదును బదిలీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత రంగాలలో ఉన్నవారు ఆరునెలలకు పైగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యాలయం గతనెల 12న కనీస వేతన నిబంధనలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం.. నైపుణ్యం లేని కార్మికులకు గ్రామీణప్రాంతాల్లో కనీసం రూ.368 (వ్యవసాయ రంగానికి) ఉండాలి. పారిశ్రామిక కార్మికులకు పట్టణప్రాంతాల్లో రోజుకు రూ.427గా నిర్ణయించబడింది. అయితే కార్మికులు నెలలో 25 రోజులు పనిచేసినా.. వారు నెలకు పొందే వేతనం వరుసగా రూ.9200, రూ.10,675గా ఉంటుంది.

కాబట్టి ప్రభుత్వం తన సొంత కనీస వేతన నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలనుకున్నా.. ప్రతీ కార్మికుడికి నెలకు రూ. 10వేల చొప్పున చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇతర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రూ.8500, పట్టణాల్లో రూ.9800గా కార్మికులకు రావాల్సి ఉంటుందనీ, అయితే తాము మాత్రం రూ.7500 అందించాలని కోరుతున్నట్టు వివరించారు. కాబట్టి తమ డిమాండ్‌ను మోడీ సర్కారు ఆచరించాల్సిన అవసరం ఉన్నదనీ, లేకపోతే శ్రామిక వర్గం ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates