కాంగ్రెస్‌ X కాంగ్రెస్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • తారస్థాయికి అంతఃకలహాలు
  • రాహుల్‌-అనుకూల, వ్యతిరేక శిబిరాలు
  • సంస్థాగత ఎన్నికలకు రంగం సిద్ధం!

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో కీచులాటలు తారస్థాయికి చేరుతున్నాయి. పార్టీ రెండు శిబిరాలుగా చీలిపోతోంది. ఒక వర్గం రాహుల్‌ తిరిగి పగ్గాలు చేపట్టాలని  భావిస్తుంటే మరో వర్గం మరో నేతను ఎన్నుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. గతంలోనే పార్టీ నాయకత్వంపై చిన్నపాటి తిరుగుబాటు ప్రకటించిన నేతలు బిహార్‌ ఎన్నికలు ముగిసినందున- అమీతుమీకి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో వర్కింగ్‌ కమిటీతో పాటు సంస్థాగత మార్పులను చేపట్టి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించక తప్పదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. గత ఆగస్టులో 23 మంది సీనియర్‌ నేతలు లేఖాస్త్రాన్ని సంధించిన తర్వాత సెప్టెంబర్‌లో వర్కింగ్‌ కమిటీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. బిహార్‌ ఎన్నికల తర్వాత ఏఐసీసీ సదస్సును నిర్వహించి మరిన్ని సంస్థాగత మార్పులు  తేవాలని అధిష్టానం నిర్ణయించిందని, ఇపుడు సమయం ఆసన్నమైందని పార్టీ నేతలు చెబుతున్నారు.

మాటల తూటాలు
’’బిహార్‌లో మేం మరిన్ని ఎక్కువ సీట్లకు పోటీచేసి ఉండాల్సింది. అయితే నా ఆందోళనంతా బిహార్‌కంటే ఎక్కువగా ఎంపీ, యూపీ, గుజరాత్‌, కర్ణాటకల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల గురించే. వాటిని పరిశీలిస్తే సంస్థాగతంగా కాంగ్రెస్‌ ఉనికి  ఏమాత్రం కనిపించడంలేదు. బిహార్లో మా కన్నా చిన్నపార్టీలైన  సీపీఎం, ఎంఐఎం మంచి పనితీరు కనబర్చాయంటే అవి సంస్థాగతంగా బలంగా ఉన్నాయన్నమాట’’ అని దైనిక్‌ భాస్కర్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం అన్నారు. మరో నేత వివేక్‌ టంకా- రెండ్రోజుల కిందట అధిష్టానం తీరుపై విమర్శలు చేసిన కపిల్‌ సిబ్బల్‌కు సంఘీభావం ప్రకటించారు. ‘పార్టీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించాల్సిన టైమొచ్చింది’’ అని రాజ్యసభ సభ్యుడైన వివేక్‌ టంకా ట్వీట్‌ చేశారు. అయితే సిబ్బల్‌ మాటలపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి మండిపడ్డారు. ‘‘ఏసీ రూముల్లో కూర్చుని స్టేట్‌మెంట్లు ఇవ్వడం కాదు. పార్టీ పట్ల అంత ఆందోళనే ఉంటే బిహార్‌ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదు?’’ అని అధీర్‌ ఘాటుగా అన్నారు. అధీర్‌తో పాటు సల్మాన్‌ ఖుర్షీద్‌, అశోక్‌ గెహ్లాట్‌ లాంటి నాయకులు ఇప్పటికే రాహుల్‌-సోనియాకు మద్దతుగా నిలిచారు. కాగా గతంలో అధిష్టానాన్ని విమర్శిస్తూ అసంతృప్తివాదులు సంధించిన లేఖపై చిదంబరం సంతకం చేయనప్పటికీ  తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన ఎటువైపు ఉంటారన్న విషయంపై చర్చకు దారితీసింది.గతంలో పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్‌ అన్నాడిఎంకెతో పొత్తు కుదుర్చుకున్నపుడు చిదంబరం వ్యతిరేకించి మూపనార్‌ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో  చిదంబరం తదువరి ఎత్తుగడ ఏమిటా అన్న విషయంపై ఆసక్తి రేగింది. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా సిబ్బల్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ పార్టీలో ఆత్మ విమర్శ జరగాలని కోరారు.

ఎవరెటువైపు..?
నాయకత్వంపై గతంలో అసంతృప్తి లేఖను సంధించిన నేతలే ఈసారి వ్యూహాత్మకంగా కపిల్‌ సిబాల్‌ను ప్రయోగించారని తెలుస్తోంది. ఆ లేఖపై సంతకం చేసిన వారిలో గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, మనీష్‌ తివారీ, శశిథరూర్‌, వీరప్ప మొయిలీ తదితరులు ఉన్నారు. ఇటు రాహుల్‌ను సమర్థించే నేతల్లో దిగ్విజయ్‌, వేణుగోపాల్‌, రణదీప్‌ సుర్జేవాలా, సల్మాన్‌ ఖుర్షీద్‌, మల్లిఖార్జున ఖర్గే, జయరాంరమేశ్‌తో పాటు ఆయన నియమించిన యువనేతలు పలువురు ఉన్నారని, రాహుల్‌ పార్టీ అధ్యక్షుడిగా పోటీచేస్తే అత్యధికులు ఆయనకే మద్దతునిస్తారని సమాచారం.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates