పెళ్లి మళ్లీ మళ్లీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • 3 నెలల్లోనే మూడుసార్లు పెళ్లి
  • కల్యాణలక్ష్మి నిధులు స్వాహా
  • పెళ్లయిన వారి పేరిట చెక్కులు
  • 50 ఏళ్లు దాటిన వారి పేరిట కూడా
  • నకిలీ పత్రాలతో దరఖాస్తు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో అక్రమాలు
  • రూ.5 కోట్లకుపైగా నిధులు పక్కదారి
  • వాటాల పంపకాల్లో తేడా.. ఒకరి హత్య
  • పోలీసుల విచారణలో వెలుగు చూసిన స్కాం

ఆదిలాబాద్‌ : ఆమె పేరు భగ్నూర్‌ శకుంతల బాయి! ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామం. మాజీ జడ్పీటీసీ! వయసు 50 సంవత్సరాలపైనే! ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. అయినా, ఆమెకు మూడు నెలల్లోనే మూడుసార్లు పెళ్లి జరిగినట్లు పత్రాలు సృష్టించారు. వాటితో, కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేశారు. మంజూరైన చెక్కులను బ్యాంకు ఖాతాలు వేసుకుని డ్రా కూడా చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు చెక్కులు డ్రా చేసుకోవడం విశేషం. కల్యాణ లక్ష్మి పథకంలో జరుగుతున్న అక్రమాలు ఇవి! అదే గ్రామానికి చెందిన భగ్నుర్‌ సుమన్‌ బాయి పేరిట కూడా 3 నెలల్లో మూడుసార్లు కల్యాణలక్ష్మి చెక్కులు నొక్కేశారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. పెళ్లి అయినవారు.. వృద్ధుల పేరిట కూడా కల్యాణలక్ష్మి నిధులను జేబులో వేసుకున్నారు.

ఆడపిల్ల పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి నిధులను ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. పథకంలోని లొసుగులు, రెవెన్యూ అధికారుల కాసుల కక్కుర్తిని ఆసరాగా చేసుకొని నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. ఇటీవల సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు జ్ఞానేశ్వర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. విచారణలో కల్యాణలక్ష్మి చెక్కుల బాగోతం వెలుగు చూసింది. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.5 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

అక్రమాలు ఇలా…
సిరికొండ మండలంలో 2013 నుంచి మీ సేవ కేంద్రాన్ని నడుపుతున్న సిందే అచ్చుత్‌.. ఇటీవల దానిని ఇచ్చోడ మండలానికి మార్చాడు. తర్వాత స్నేహితుడు జాదవ్‌ శ్రీనివా్‌సకు అమ్మేశాడు. అయినా, ఆ కేంద్రంలోనే పని చేస్తున్నాడు. గతంలో సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో పని చేసిన కొందరు తహసీల్దార్ల సహకారంతో నకిలీ పత్రాలను సృష్టించి కల్యాణలక్ష్మి నిధులను పక్కదారి పట్టించాడు.

తమ తమ బంధువులతో ముందే ఒప్పందం చేసుకుని వారి పేరిట చెక్కులను మంజూరు చేయించారని అధికారులు తెలిపారు. అప్పటికే పెళ్లయినా సరే.. వారి పెళ్లి కార్డులను ముద్రించి దరఖాస్తు చేస్తూ మంజూరైన చెక్కులను వారి ఖాతాల్లో జమ చేస్తూ డ్రా చేసుకునేవారు. ఒప్పందం ప్రకారం కొంత సొమ్మును  ముట్టచెప్పేవారు. అనంతర కాలంలో వివిధ గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని మరీ దందా కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.

తహసీల్దార్లకు సంబంధాలు
జిల్లాలోని పలు మండలాల్లో కల్యాణలక్ష్మి పథకాన్ని పక్కదారి పట్టించారని అధికారులు గుర్తించారు. ప్రధానంగా సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో పనిచేసిన కొందరు తహసీల్దార్లతోపాటు నేరడిగొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, మావల మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ నదీం వీరికి సహకరించినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దాంతో, ఆయనకు మెమో జారీ చేసి మరో సెక్షన్‌కు బదిలీ చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైతే, తప్పనిసరిగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలి. వారి సమక్షంలోనే పంపిణీ చేయాలి. కానీ, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చెక్కులను జమ చేసినట్లు తెలుస్తోంది.

పంపకాల్లో తేడాలతోనే హత్య
కాంగ్రెస్‌ నాయకుడు జ్ఞానేశ్వర్‌కు కల్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్కాంలో భాగస్వాములైన సిందే అచ్యుత్‌, జాదవ్‌ శ్రీనివా్‌సతో విభేదాలు తలెత్తి ఘర్షణకు దారితీశాయి. దీంతో పథకం ప్రకారం జ్ఞానేశ్వర్‌ను అంతమొందించారు. దీనికి సహకరించిన జ్ఞానేశ్వర్‌ దగ్గరి బంధువులు సిందే కిషన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

తహసీల్దార్లను నివేదిక కోరాం
సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో కల్యాణలక్ష్మి చెక్కుల అక్రమాలపై సంబంధిత తహసీల్దార్లను నివేదిక కోరాం. ఆర్డీవో కార్యాలయంలో పని చేసే సీనియర్‌ అసిస్టెంట్‌ నదీంకు మెమో జారీ చేశాం. ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రాస్తూ నివేదిక ఇస్తున్నాం.
– జాడి రాజేశ్వర్‌, ఆర్డీవో, ఆదిలాబాద్‌

విచారణ చేపడుతున్నాం
ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో కల్యాణలక్ష్మి చెక్కుల మంజూరులో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. దానిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. మరో వారం రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
– ఉదయ్‌రెడ్డి, ఉట్నూర్‌ డీఎస్పీ, ఆదిలాబాద్

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates