కార్మికులపై మరో పిడుగు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– నిర్మాణరంగంలో సంస్థలకు అనుకూలంగా రూల్స్‌ సిద్ధం
– వెల్ఫేర్‌ సెస్‌.. ఎంతన్నది.. ఇకపై వారిష్టం..
– యాజమాన్యాలకు అనుకూలంగా ‘కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ’

న్యూఢిల్లీ : నిర్మాణరంగంలో బడా కంపెనీలకు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా మోడీ సర్కార్‌ మరో అడుగు వేసింది. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమంపై ఇప్పటివరకూ ఉన్న చట్టపరమైన నిబంధనల్ని నిర్వీర్యం చేసే విధంగా కొత్త ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందించింది. అత్యంత కీలకమైన ‘వేల్ఫేర్‌ సెస్‌’ నిబంధనల్ని యాజమాన్యాలకు అనుకూలంగా మార్చుతూ రూల్స్‌ తయారుచేసింది. ఈ రూల్స్‌పై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ వెబ్‌సైట్‌లో తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనేపథ్యంలో ఈ బిల్లులోని పలు అంశాలపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా నిర్మాణరంగ ప్రాజెక్ట్‌కు సంబంధించి దాని విలువలో ఒక్కశాతం అందులో పనిచేసే కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం ఖర్చు చేయాలని, అయితే స్వీయ మదింపుతోనే దాని విలువను యాజమాన్యాలు ప్రకటించుకోవచ్చునని ముసాయిదా రూల్స్‌లో పేర్కొనటం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కార్మికరంగంలో మోడీ సర్కార్‌ విధానాలు, లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగుతున్నవేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని పది కార్మిక సంఘాలు, అనేక స్వతంత్ర ఫెడరేషన్లు ఈనెల 26 దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ సెస్‌ రూల్స్‌, 1998 ప్రకారం, ప్రస్తుతం..వెల్ఫేర్‌ సెస్‌ ఎంత కట్టాలన్నది ప్రభుత్వ అధికారి నిర్ణయిస్తాడు. దీనికంటే ముందుగా నిర్మాణరంగ సంస్థ ఇచ్చే సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి సెస్‌ ఎంత అన్నది లెక్కతేల్చుతాడు. 1996 వెల్ఫేర్‌ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం, 1998 నిబంధనల్ని రూపొందించారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ కార్మిక సంస్కరణలో భాగంగా ఈ చట్టాల్ని, నిబంధనల్ని నిర్వీర్యం చేస్తూ ‘కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ బిల్లు, 2020’ తెరమీదకు తీసుకొచ్చింది.

వాటి ఇష్టారాజ్యం : కార్మిక సంఘాలు
ప్రయివేటు నిర్మాణరంగ సంస్థలు అనేకం ఇప్పటికే వేల్ఫేర్‌ బోర్డ్‌లో రిజిష్టర్‌ చేసు కోవటం లేదు. దాంతో వారి నుంచి వెల్ఫేర్‌ సెస్‌ అనేదే వసూలు కావటం లేదు. రిజి ష్టర్‌ అయిన కొద్ది సంస్థలు వెల్ఫేర్‌ సెస్‌ను నిజాయితీగా చెల్లించటం లేదు. ఇక ఇప్పుడు తీసుకొస్తున్న ఈ రూల్స్‌తో ‘వెల్ఫేర్‌ సెస్‌’ పూర్తిగా తుడుచుపెట్టుకుపోతుంది. స్వీయ మదింపుతో వారిష్ట మున్నంత వెల్ఫేర్‌ సెస్‌ కట్టేసి.. చేతులు దులుపు కుంటాయి.

  • ప్రతి రాష్ట్రంలో వెల్ఫేర్‌ బోర్డ్‌ అనేది ఉంటుంది. ప్రభుత్వానికి సమకూరిన వెల్ఫేర్‌ సెస్‌ అంతా కూడా ఎలా వ్యయం చేయాలన్నది ఈ బోర్డ్‌ నిర్ణయిస్తుంది.
  • బోర్డ్‌ పరిధిలోని రిజిష్టర్డ్‌ కార్మికుల కోసం ఈ నిధిని ఖర్చు చేస్తారు. వారికి పెన్షన్‌ చెల్లింపులు, ప్రమాద బీమా, వైద్యసాయం, వారి పిల్లల చదువులకు స్కాలర్‌షిప్స్‌…వంటి వాటి కోసం ఈ వెల్ఫేర్‌ సెస్‌ ఉపయోగిస్తారు.
  • మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన ఈరూల్స్‌ వల్ల కార్మికుల సంక్షేమమంతా కూడా పక్కకుపోతుంది. యాజమాన్యాల స్వీయ మదింపుతో సెస్‌ పెద్దగా వసూలు కాదు.
  • దాంతో..కార్మికుల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలన్నీ నిర్వీర్యమవుతాయి.
  • చెల్లించడంలో జరిగే ఆలస్యానికి ఇప్పటివరకు ఉన్న 2 శాతం వడ్డీని 1 శాతానికి తగ్గించారు.
  • 1996 చట్టంలో 64 క్లాజులుంటే వాటిని ఇప్పుడు 9కి సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌లో తగ్గించారు. 1998 నాటి రూల్స్‌ 15 కాగా నేడవి 7కి తగ్గాయి.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates