భూమి పాయే.. బతుకు పాయే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కుంటల పక్కనే కొండపోచమ్మ నిర్వాసితులు
తిండికీ తిప్పలే.. రోగాలు, రొచ్చులతో అవస్థలు
భూమికి భూమి ఇమ్మంటే…కక్ష కట్టిన సర్కారు
మామిడ్యాల ప్రజల దుర్భర జీవితాలు

వాళ్లు మణులు..మాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు అడగలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు రాజభోగాలు అనుభవిస్తున్న ఫామ్‌హౌజ్‌లనూ కోరలేదు. అడిగిందల్లా జీవనాధారమైన భూమికి భూమే. అంతే సర్కారుకు కోపమొచ్చింది. కక్షగట్టింది. ఓ చెక్‌డ్యామ్‌, కెనాల్‌ కాల్వ పక్కనే తాత్కాలిక ఇండ్లు కట్టించి మీ చావు మీరు చావండిఅన్నట్టుగా వదిలేసింది. వర్షం పడితే ఆ ఇండ్లల్లో జాగారం కాయాల్సిందే. రాత్రంతా కురిసే మంచు, చలితో వణికిపోవాల్సిందే. ఎండకు రేకుల అగడికి తంటాలు పడాల్సిందే. డ్రయినేజీ కంపు మధ్యనే వండుకు తింటూ అనారోగ్యాల పాలు కావాల్సిందే. ఇవీ కొండపోచమ్మ నిర్వాసితుల బతుకులు. పెద్దపెద్ద మాటలొద్దు వారంరోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మాకిచ్చిన ఇండ్లలో ఉండండి అప్పుడు తెలుస్తది పేదోడి బాధేంటోఅంటున్న మామిడ్యాల నిర్వాసిత బాధితులపై నవతెలంగాణ ప్రత్యేక కథనం…

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కొండపోచమ్మ నిర్వాసిత గ్రామమైన మామి డ్యాల గ్రామప్రజలకు ఇండ్లు కట్టించారు. వాటికోసం ఏడు న్నర లక్షల రూపాయల పరి హారం ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.12 లక్షల చొప్పున నష్టపరిహారం కట్టించి ఇచ్చింది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.80 లక్షల నుంచి కోటీ 20 లక్షల రూపాయల వరకు భూమి విలువ పలుకుతున్నది. అధికారులు సామదానదండో పాయాలను ప్రయోగించి 4650 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరించారు. అయితే, ఆ గ్రామంలోని 22 కుటుంబాలకు చెందిన 32 మంది రైతులు కోర్టులో కేసులేశారు. తమకు భూమికి భూమి ఇప్పించాలని కోరారు. ఆ కేసు నడుస్తూనే ఉంది. భూములు ఇచ్చేయాలని కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు ఎంత ఒత్తిడి చేసినా న్యాయం దక్కే వరకూ తమ భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ప్రాజెక్టు ప్రారంభించడానికి అడ్డంగా ఉన్నారని ప్రభుత్వం కోర్టుకె క్కింది. అయితే, వారికి ఇతర చోట్ల వసతి ఏర్పాటు చేసి తర లించాలని కోర్టు సూచించింది. ఆ కుటుంబాలను క్షీరాసాగర్‌ లో కట్టించిన ఇండ్లలోకి తరలించాలని స్థానిక అధికారులు భావించారు.

ఏమైందో ఏమోగానీ వారికి ఆ ఇండ్లను కేటాయించలేదు. కొత్తగా కట్టిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చివర్లో ఉన్న రెండు కుంటలు అలుగుబోసే ప్రాంతానికి దగ్గరలో రేకుల ఇండ్లను కట్టించారు. పక్కనే కెనాల్‌ కాల్వ కూడా ఉంది. ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో మూలకు కట్టించిన ఇండ్లలో 70 శాతం ఎస్సీ సామాజిక తరగతి, 30 శాతం కుటుంబాలు బీసీ సామాజిక తరగతుల కుటుంబాలు ఉంటున్నాయి. ఆ రేకుల ఇండ్లలో ఒక్క కనీస సౌకర్యం కూడా లేదు. పదిఅడుగుల్లోనే ఒక చిన్న కిచెన్‌, రూము కట్టించారు. ప్రతి కుటుంబంలో నలుగురు నుంచి ఏడుగురు వరకు ఉంటున్న పరిస్థితి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరుగుదొడ్డి పైపులైను, మురుగు నీటి పైపులైన్‌ ఒకటే కావటంతో కంపు వాసన కొడుతున్నది. డ్రెయినేజీ నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయి. వంటగదిలో సింక్‌ వద్ద వాసనకు నిలబడలేని దైన్యస్థితి. ముక్కులకు గుడ్డలు కట్టుకుని ఏదోలా అంట్లు తోముకుంటు న్నామని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. మొన్న కురిసిన వర్షాలకు కుంటలు అలుగుబోసి నేరుగా ఇండ్లలోకే నీళ్లు వచ్చిచేరాయి. దీంతో ఇండ్లలోని బియ్యం, వడ్ల బస్తాలు, నిత్యావసరాలు తడిసిపోయాయి. బస్తాల్లోని బియ్యం ముద్దగట్టి నల్లగా మారాయి. అవీ ముక్కవాసనబట్టాయి. బాధితులంతా గగ్గోలు పెడితే అధికారులు ఏదో రెండు జేసీబీలను పంపించి కాల్వకు గండి కొట్టి నీళ్లకు పక్కకు మళ్లించారు. కానీ, అప్పటికే నష్టం జరిగింది. ప్రస్తుతం ఆ ఇండ్లలో చలితో వణికిపోతున్నారు. రాత్రంతా దట్టంగా కురిసే మంచు రేకులపై పేరుకుపోయి రేకుల సందులు, గోడల నుంచి చుక్కలుచుక్కలుగా నీటిబొట్లు పడుతున్నాయి. దీంతో ఆ ఒక్కరూమ్‌ చల్లటి దవ నెలకొనడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాల పాలవుతున్నారు.

గత్తెర వాసనొస్తాంది..మస్తు కష్టముంది బిడ్డా : పచ్చిమడ్ల అండాలు
‘బాతూరూమ్‌లల్ల గత్తెర వాసన లేస్తుందయ్య. సింకుల గిన్నెల కడుగ వశమైతలేదు. కడిగిన నీళ్లు బయట్కిపోతలేవు. ఏమ్జేయాలే బిడ్డ వాసనకు తిన్నతిండి పెయికిపడ్తలేదు ఇంట్ల. తెల్లందాక నిద్రలుంటలేవు. పిల్లలకైతే మస్తు ఇబ్బంది అయితాంది. సందులపొంటి సల్లగ గాలొస్తాంది. చలికేనేమోగానీ జ్వరాలొస్తున్నయి. నేనొక్కదాన్నే గాదు. అందరి పరిస్థితి గింతే. అస్సలు సేతనైతలేదు. బస్తాలల్ల బియ్యమన్ని వల్కబోసినం బిడ్డ. ఆర్డీఓకి జూపించిన. జేయింట్‌ కలెక్టర్కి జూపించిన. మస్తుగ తిట్టిన. ఏదో రాస్కోని పోయిరుగాని ఒక్కడుగిట్ట పట్టించుకోలే. మస్తు కష్టముంది బిడ్డా.. మేం మంచిమంచి బిల్డింగ్‌లల్ల ఉండేటోళ్లం. మా ఇరవై ఎకరాలను ప్రాజెక్టుల కలుపుకునే. మమ్ముల్ని దీసుకొచ్చి గీడపడేసే. మాగోస వాళ్లకు కచ్చితంగా తాకుతది బిడ్డ’ అంటూ సర్పంచ్‌ నాగవాణి అత్త పచ్చిమడ్ల అండాలు ఒలఒల ఏడుస్తూ తన కడుపులోని బాధనంతా ఎల్లగక్కింది.

వచ్చిన తెల్లారే బాత్రూమ్‌ల బడ్డ : ఎడ్ల మత్తడమ్మ, వార్డుమెంబర్‌
మాతోడు నలుగురు అన్నదమ్ములం. మనిషికి 12 ఎకరాలకు పైనుండే. ఇల్లు రెండు కంచెలంత ఉండె. ఏమ్జేయాలే. గింత కర్మఅయింది నాది. వచ్చిన తెల్లారే పడ్డ. బాత్‌రూమ్రులు పాడుబడ. ఇంతెత్తు ఇంతెత్తు ఉన్నయి. బాత్‌రూమ్రలకి బోయి అడుగుబెట్టి జారిపడ్డ. తొంట్ల ఇరిగింది. ఆరేడు నెలలైతాంది. ఇంకా నడువొస్తలేదు. గీడ అడివిలెక్కనే ఉంది బిడ్డ. మధ్యరాత్రి నుంచి రేకుల నుంచి పట్టపట్ట మంచునీళ్లు పడ్తున్నరు. తెల్లాసరికే ఇల్లంత సల్లగ అయితాంది. ఎప్పుడు కడిగినట్టే ఉంటాంది. పిల్లలు సల్లగ శీతాలం అయితాండ్రు. ఒణుకుడు పుడుతాంది. మంచిగ బతికినోళ్లం. ఇదేం గోస బిడ్డ.

కూలి దొరుకతలేదు.. ముక్కబట్టిన బియ్యం తింటున్నం.. : ఎడ్ల కనకవ్వ
మాకు పదెకరాలుండే. బంగారమసోంటి భూమి. కూరగాయలు, వడ్లు మస్తుగ పండేవి. మేమే మస్తుమందికి పనిచూపేటోళ్లం. రూ.300 నుంచి రూ.500 దాకా ఇచ్చేటోళ్లం. మా బతుకులంత ఆగమై రోడ్డునబడ్డం. గీడ పత్తేరబోతే రూ.200 గిట్ట ఇస్తలేరు. అదీ దొర్కిననాడు దొరుకుతాంది లేకుంటే అంతే. మా ఊరున్నప్పుడు కూరగాయలు గొన్నది లేదు. గీడ ఉప్పు,పప్పు కానుంచెల్లి ప్రతిదీ కొనుక్కునుడే. ఈ ఇండ్లు పాగుగాల…. గీడెవడన్న ఉంటడా? వానొస్తే చాలు ఇండ్లళ్లకెళ్లే వరదబోతాంది. మొన్నటి వానలకు బియ్యమన్ని కర్రెగ అయినయి. ముక్కబట్టినయి. పైసళ్లేక గివ్వే బియ్యం కడుక్కుని తింటున్నం. గివ్వి మా బాయికాడ పండినవే. గివ్వి అయిపోతే ఎట్ల బతుకుడోఏమో? ఊరు యాదికొస్తే దు:ఖమొస్తాంది. మమ్ముల్ని గిన్ని బాధలు పెట్టినోళ్లేం బాగుపడరు.

భూములకు భూములివ్వాలి : శ్రీనివాస్‌ గౌడ్‌, సర్పంచ్‌ భర్త
అభివృద్ధి పేరుతో…ప్రజావసరాల కోసం భూములను తీసుకోవడానికి మేం వ్యతిరేకం కాదు. వద్దంటున్నా బంగారం అసోంటి భూములను లాక్కున్నారు. తరతరాల నుంచి భూమినే నమ్ముకుని బతుకుతున్నం. మీ పైసలొద్దు..పరిహారాలొద్దు..తీసుకున్నంత భూమిని చూపిం చండి. ఆడికిపోయి బతుకుతం. స్వామిజీలకు యాక్టర్లకు, అడిగోనళ్లకు, అడగోనళ్లకు భూములు, కోట్ల రూపాయలి స్తున్నరు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములివ్వడం మేం చేసిన పాపమా? నష్టపోయినోళ్లం, బాధపడుతున్నోల్లం మాకు భూమి ఇస్తే ఏమైతాంది? మాకు న్యాయం చేయాల్సిన కలెక్టరే కటువుగా ఉండటం సరిగాదు. భూమికి భూమిచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తాం. అన్నీ కోల్పోయాం. ఏదాంకనైనా పోతాం భూమి దక్కించుకుంటాం.

ఒక్కరూమ్‌లోనే వృద్ధురాలు, మరో ఐదుగురు
పక్కన ఉన్నది బొల్లం బాలనర్సయ్య ఇల్లు. ఒక ఈ ఒక్క రూమ్‌లోనే ఆరుగురుంటు న్నారు. ఆయన అత్త, వృద్ధురాలైన మన్నెపోశమ్మ భూమి పోయి గుండెపగిలి మంచం పట్టింది. పోశమ్మ పడుకునే దివానుకుపోనూ మిగిలింది కొంత స్థలమే. అక్కడే బాల నర్సయ్య దంపతులు, ఆయన ఇద్దరు కుమార్తెలు, మనువ రాలు ఇరుక్కుని ఇరుక్కుని పడుకుంటున్నారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates