గ్రీన్‌ సిగ్నల్‌ 2 గంటలే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కానీ.. హరిత టపాసులు మాత్రమే కాల్చాలి
  • అదీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకే!
  • బాణసంచా నిషేధంపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ : పటాకులు కాల్చకుండానే ఈసారి దీపావళి జరుపుకోవాలా అని వాపోతున్న ప్రజలకు, నష్టభయంతో ఆందోళన చెందుతున్న బాణసంచా విక్రేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. తెలంగాణలో బాణసంచా విక్రయాలు, వినియోగంపై హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయు నాణ్యతను బట్టి బాణసంచా వినియోగంపై నిర్ణయాలు తీసుకోవాలంటూ ఈ నెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం పాటించాలని సూచించింది. తమ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతాయని స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా బాణసంచాపై నిషేధం విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ హైకోర్టులో పిల్‌ వేయగా.. కోర్టు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ ఫైర్‌ క్రాకర్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన వెకేషన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసినప్పుడు ప్రతివాదులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల పిటిషనర్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ప్రతివాదుల వాదనలు వినకుండానే ఉపశమనం కలిగించాలా అని ప్రశ్నించింది. అయితే, కేసు అర్జెన్సీ రీత్యా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తామని తెలిపింది. దానికి పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ అంగీకరించారు. హైకోర్టు తమ వాదన వినకుండానే నిర్ణయం తీసుకుందని తెలిపారు. దాంతో ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న చోట బాణసంచాను కాల్చకూడదని స్పష్టం చేసింది. ప్రతివాదుల వాదనలు వినడానికి వీలుగా.. తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి, హైకోర్టులో పిటిషన్‌దారు అయిన ఇంద్రప్రకాశ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

రెండు గంటల పాటు..
బాణసంచా విక్రయాలు, వినియోగంపై ఈ నెల 9న రాష్ట్రాలకు ఎన్జీటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో అదే రోజు నుంచి ఈ నెల 30 వరకు బాణసంచా వినియోగం, విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది. అలాగే, అన్ని రాష్ట్రాల్లోని పట్టణాల్లో వాయు నాణ్యతను బట్టి బాణసంచా పేల్చడానికి సమయాలను నిర్దేశించింది. వాయు నాణ్యత సాధారణంగా ఉన్న అన్ని పట్టణాలు, టౌన్లలో కేవలం గ్రీన్‌ క్రాకర్లు మాత్రమే వినియోగించాలని పేర్కొంది. ఈ పట్టణాల్లో పండగల రోజు బాణసంచా పేల్చడానికి కేవలం 2 గంటలు మాత్రమే అనుమతించాలని.. సమయాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాలని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం సమయాన్ని ఖరారు చేయకపోతే దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు, క్రిస్మస్‌ రోజు, డిసెంబరు 31 అర్థరాత్రి 11.55 గంటల నుంచి 12.30 గంటల వరకు పేల్చవచ్చు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates