ఉన్నతిని ఓర్వలేకే కులహంకార దాడి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రొ.లక్ష్మీ నారాయణ m డా.బాలబోయిన సుదర్శన్‌ m డా. పసునూరి రవీందర్‌

దళితుల మీద కులోన్మాద దాడి అనగానే అది అగ్రవర్ణాలు చేసి ఉంటారు అనుకుంటాం. రామోజీపేటలో మాత్రం  లక్ష్మీపేటలో జరిగినట్టు, బీసీ సామాజిక వర్గానికి చెందినవారే దాడులకు పాల్పడ్డారు. ముదిరాజుల ఈ దాడిలో తొమ్మిదిమంది మాదిగలు గాయపడ్డారు. కనీసం గర్భిణి స్త్రీ అని కూడా చూడకుండా శిరీష అనే యువతిని పొలాల్లో పరుగెత్తించి కొట్టారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు కనీస రక్షణ కరువవుతున్నది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పడ్డ నూతన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకటి. దీనికి అత్యంత సమీపంలోని గ్రామమే రామోజీపేట. అధికార పార్టీకి చెందిన ఒక దళిత ఎమ్మెల్యే పరిధిలోని ఈ రామోజీపేట గ్రామంలో మాదిగలపైన దుర్మార్గమైన దాడి జరిగింది. ఈ దాడి 1991లో చుండూరులో జరిగిన దాడిని పోలి ఉంది. ప్రాణనష్టం జరుగలేదు కానీ ఆస్తినష్టం, అంతకుమించి ఆత్మగౌరవ భంగం జరిగింది. 2013లో పంచాయతీగా ఏర్పడిన ఈ గ్రామ జనాభా ఆరేడువందల కంటే దాటదు. ఈ కుగ్రామంలో మాదిగల మీద దసరాపండుగ సందర్భంగా పెద్దఎత్తున దాడి జరిగింది. అత్యంత పాశవికంగా అర్ధరాత్రి పూట మారణాయుధాలతో మాదిగల ఇండ్ల మీద పడి కొట్టారు. దొరికిన వారిని దొరికినట్టుగా చిత్రహింసల పాలు చేశారు. దొరకని వారి ఇండ్లను సైతం కూల్చే ప్రయత్నం చేశారు. చిమ్మచీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొలాల్లోకి పరుగులు తీసి మాదిగలు ప్రాణాలు కాపాడుకున్నారు.

వాయిస్‌ ఆఫ్‌ దళిత్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యంలో ప్రొ. లక్ష్మీనారాయణ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ ఆ గ్రామాన్ని సందర్శించింది. బాధితుల నుంచి, అధికారుల నుంచి వివరాలను సేకరించగా ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దళితుల మీద కులోన్మాద దాడి అనగానే అది అగ్రవర్ణాలు చేసి ఉంటారు అనుకుంటాం. రామోజీపేటలో మాత్రం, లక్ష్మీపేటలో జరిగినట్టు, బీసీ సామాజిక వర్గానికి చెందినవారే దాడులకు పాల్పడ్డారు. దళితులతో మమేకమై జీవించాల్సిన వెనకబడిన తరగతుల ప్రజానీకం, అగ్రవర్ణ దురంహకారాన్ని నరనరాన నింపుకున్నారు. ఈ గ్రామ జనాభాలో ముదిరాజులే అధికం. 90కి పైగా కుటుంబాలున్న ముదిరాజులు తమ అభ్యర్థిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ముదిరాజుల జనాభా తరువాత 34 కుటుంబాలున్న మాదిగలకు అలంకారప్రాయమైన ఉపసర్పంచి పదవి దక్కింది.

ఈ నేపథ్యంలో ఊరి నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఊరందరి నుంచి వచ్చింది. దీనికి మాదిగలు సంతోషించారు. అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు, బహుజన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాదిగలు అభిప్రాయం వెలిబుచ్చారు. దీనిపై గ్రామపంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి, ముందు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేద్దామని తీర్మానించారు. అంతలోనే ఈ వ్యవహారంలోకి ఛత్రపతి శివాజీ విగ్రహ డిమాండ్‌ను స్థానిక యువత కుట్రపూరితంగా చొప్పించింది. ఇది మనువాద మతసంస్థల నుంచి వచ్చిన డిమాండ్‌ అని రామోజీపేట మాదిగలు తెలియజేశారు. దీంతో విగ్రహాల రగడ చినికిచినికి గాలివానగా మారి విగ్రహ దిమ్మెలను కూల్చుకునే స్థాయికి వెళ్లింది. ఈ సందర్భంలో తమపై దాడి చేయ ప్రయత్నించిన ముదిరాజులపై మాదిగలు కేసు పెట్టారు. అదే ముదిరాజులకు కంటగింపుగా మారింది. తమ చెప్పుచేతల్లో ఉండాల్సినవాళ్లు తమపై తిరుగబడతారా అని లోలోపల రగిలిపోయారు. తమపై కేసులు పెట్టిన ఒక్కొక్కరిని టార్గెట్‌ చేశారు.

ప్రతిసారి ఉమ్మడిగా జరుపుకునే దసరా పండుగకు మాదిగలను దూరం పెట్టారు. ‘ఊరి బొడ్రాయి వద్దకు రావద్దు, మీరు మాతో పాటు పండుగ చేసుకోవద్దు, ప్రతీ యేడు కొట్టినట్టు డప్పులు కొట్టడానికి మిమ్మల్ని అనుమతించం, దసరా రోజు తెచ్చుకునే జమ్మి ఆకు మీరు ముట్టద్దు’ వంటి అప్రకటిత ఆంక్షలు వ్యక్తం చేశారు. మాదిగల తరఫున బెజ్జంకి శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఉపసర్పంచ్‌ హోదాలో ఊరి బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తే ముదిరాజులు అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగాడు. మాదిగలు పండుగను తమ వాడలోనే జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. మాదిగ కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం ముందు మాదిగలు పోగయ్యారు. బతుకమ్మ పాటలు పాడుకున్నారు. వారు సంతోషంగా ఉండడం, కొత్త బట్టలు కట్టుకోవడం, బతుకమ్మ పాటలు పాడుకోవడం, విందు భోజనాలు ఏర్పాటు చేసుకోవడం ముదిరాజులు ఓర్వలేకపోయారు. ఊరి పెద్దమనిషిగా చలామణిలో ఉన్న చొప్పరి భూమయ్య, సర్పంచ్‌ భర్త పెండెల మొండయ్య ఇరువురు ఎస్సీ కాలనీలో మహిళలు బతుకమ్మలు ఆడుతున్న చోటికి వచ్చారు. పాటలు ఆపాలని డిమాండ్‌ చేశారు. నిజానికి మాదిగలు పెట్టుకున్న రెండు చిన్న సౌండ్‌బాక్సుల పాటలు ఎస్సీ కాలనీలోని చాలా ఇళ్లకు వినొచ్చే అవకాశమే లేదు. కానీ, భూమయ్య, మొండయ్యలు తమకు ఆ పాటల చప్పుడు విఘాతం కలిగిస్తోందని సాకు చూపించారు. దానికి మాదిగలు ఆశ్చర్యపడ్డారు. అసలు శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇట్లా ప్రశ్నించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మాటామాటా పెంచి దాడులకు సిద్ధమయ్యారు. నిజానికి ఇది పథకం ప్రకారం పన్నిన కుట్ర. పండుగ మాటున దాడి చేస్తే పోలీసు కేసులు కూడా ఉండవనే దృఢనిశ్చయానికి వచ్చారని నిజనిర్ధారణ కమిటీతో మాదిగలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

మాదిగల మీద ఇట్లా అక్కసుతో దాడి చేయడం వెనుక బలమైన కారణాలు లేకపోలేదు. సామాజికంగా నిమ్నకులం వారైనప్పటికీ మాదిగలు రామోజీపేట గ్రామంలో దశాబ్దాలుగా ఆత్మగౌరవం కోసం పాటుపడుతున్నారు. తమకున్న వ్యవసాయ భూముల్లో పంటలు పండిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. అట్లా ఇప్పటివరకు ఈ గ్రామంలోని దళితుల్లో ఏడుగురు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. మరో నలుగురు బీటెక్‌, పదిమంది డిగ్రీ వరకు చదివారు. ఒకరిద్దరు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లుగా పని చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తూ, అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నారు. ఈ గ్రామంలో నిరక్షరాస్యులైన మహిళలు సైతం తమ పిల్లల ద్వారా అంబేడ్కర్‌ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలివిగా జీవించడానికి చదువు అవసరమని భావిస్తున్నారు. ఇట్లా ఉండడం తెలంగాణ గ్రామాల్లో అరుదు. ఇట్లా మాదిగలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం అనే విషయం ముదిరాజులకు ఇష్టం లేదు. అందుకే దాడి సమయంలో ‘ఒక్క మాదిగిల్లు ఈ ఊరిలో ఉండడానికి వీలు లేదు’ అంటూ మహిళలను బూతులు తిడుతూ దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిదిమంది మాదిగలు గాయపడ్డారు. కనీసం గర్భిణి స్త్రీ అని కూడా చూడకుండా శిరీష అనే యువతిని పొలాల్లో పరుగెత్తించి కొట్టారు.

దాడి అనంతరం బాధిత మాదిగలు నెత్తుటి గాయాలతో కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కూడా వారికి రక్షణ దొరలేదు. కనీసం దాడిలో పాల్గొన్నవారందరిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. దరఖాస్తే తీసుకోలేదు. దీన్ని బట్టి అగ్రవర్ణ టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల లాబీయింగ్‌ ఈ దాడి వెనుక ఎంత పెద్దఎత్తున ఉందో అర్థమవుతోంది. ఈ దాడులను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ కొన్ని డిమాండ్లు చేస్తోంది. అవి: 1) ఈ దాడికి పాల్పడిన వారందరిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలి. 2) ధ్వంసమైన తలపులు, కిటికీలు, బైకులు మొదలైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి. 3) బాధితుల ఫిర్యాదులను నిరాకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి 4) గ్రామపంచాయతీ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాలి. 5) పంచాయతీ తీర్మానం ప్రకారం రామోజీపేట గ్రామ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేయాలి. 6) రామోజీపేట దళితులకు పూర్తి రక్షణ, జీవితభధ్రతను కల్పించాలి.

వాయిస్‌ ఆఫ్‌ దళిత్‌ కలెక్టివ్‌ నిజనిర్ధారణ కమిటీ

RELATED ARTICLES

Latest Updates