భావితరాలకు స్ఫూర్తి వారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సలీమా

చిన్న విషయానికే ఏడుస్తూ కూర్చుంటే ఏం సాధించలేం… ప్రశ్నించాలి.. పోరాడాలి… అందులోనూ సాధించాలనుకుంటున్నది మహిళైతే…. మరింత కష్టపడాలి. పనితోనే ఎవ్వరి కైనా సమాధానం చెప్పాలి. దీన్ని అక్షరాల పాటిస్తున్నారు షేక్‌.హసీన… ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి మీడియారంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ఇరవై ఏండ్ల కిందట ఓ స్ట్రింగర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఓ ఛానల్‌కు న్యూస్‌ ఎడిటర్‌ స్థాయికి ఎదిగారు. అంతేనా… పని చేస్తున్న రంగంలో అధ్యయనం చేసిన విషయాలను భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో మరుగున పడిన మహిళా నాయకుల జీవితాలను వెలుగులోకి తెస్తున్నారు. దీనిపై మరెంతో పరిశోధన చేస్తానంటూ ఆమె మానవితో పంచుకున్న విశేషాలు… నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. చదువు మొత్తం అక్కడే సాగింది. అమ్మ షేక్‌ మల్లికా సాహేబా, గృహిణి. నాన్న షేక్‌.మస్తాన్‌, బిజినెస్‌ చేసేవారు. డిగ్రీలో బి.కాం తర్వాత పీజీ ఎంసీజేలో చేరాను. పీజీ చేసేటప్పుడే ఓ పత్రికలో పని చేశా. తర్వాత చిత్తూరు జిల్లాకు సిటీ కేబుల్‌ న్యూస్‌ ఇన్చార్జ్‌గా చేశాను. జర్నలిజంలోనే పీహెచ్‌డి కూడా చేశాను. నా చదువు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే సాగింది. 2004లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చాను.

స్ట్రింగర్‌ టు న్యూస్‌ ఎడిటర్‌
హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేశా. ‘మనస్ఫూర్తిగా’ అనే ఓ ప్రోగ్రామ్‌ చేశా. ఈ ప్రోగ్రామ్‌ కోసం ప్రముఖుల ఇంటర్వ్యూలు తీసుకునేదాన్ని. తర్వాత ఓ న్యూస్‌ ఛానల్‌లో చేశారు. అక్కడ ‘నారీ భేరి’ ప్రోగ్రామ్‌ చూశాను. అలాగే ప్రతిధ్వనికి కో-ఆర్డినేటర్‌గా పని చేశాను. తెలుగు మీడియాలో కో-ఆర్డినేటర్‌గా పని చేసిన మొదటి మహిళను నేనే అనుకోవచ్చు. ఏలూరి రఘుగారు ఈ అవకాశం నాకు కల్పించారు. ఆయన కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి. ఎంతో ప్రోత్సహించారు. అలాగే సఖి ప్రోగ్రాంకి ఇన్చార్జ్‌గా కొంత కాలం చేశాను. ఆ తర్వాత మరో న్యూస్‌ ఛానల్లో న్యూస్‌ కో-ఆర్డినేటర్‌గా చేరాను. అక్కడే రాజకీయాలను అధ్యయనం చేయగలిగాను. తర్వాత ఓ మహిళా ఛానల్‌కి కొన్ని స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌ చేశా. అవి కూడా రాజకీయాలకు సంబంధించినవే. ఆ తర్వాత మరో ఛానల్‌కు న్యూస్‌ ఇన్చార్జ్‌గా చేశాను. ఇలా ఈ ఇరవై ఏండ్ల కాలంలో స్ట్రింగర్‌గా నా కెరీర్‌ ప్రారంభించి ఓ న్యూస్‌ ఛానల్‌కు న్యూస్‌ ఎడిటర్‌ స్థాయికి ఎదగగలిగాను.

గ్రామీణ విద్యార్థులకు అవగాహన…
మీడియాలో పని చేస్తూనే యూనివర్సిటీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా వెళ్ళేదాన్ని. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉండే పీజీ కాలేజీలకు జర్నలిజం క్లాసులు చెప్పేదాన్ని. మెదక్‌, నర్సాపూర్‌ వెళ్ళి అక్కడి విద్యార్థులకు క్లాసులు తీసుకునేదాన్ని. ఇలా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఏమిటంటే… గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన పిల్లలు జర్నలిజంలోకి రావాలంటే కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి అవసరమైన మెళ కువలు, నా అనుభవాలు వారితో పంచుకోవాలనే ఉద్దేశంతో క్లాసులు తీసుకునేదాన్ని.

భావితరాలకు స్ఫూర్తి
మీడియాలో పని చేయడంతో రాజకీయాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై అవగాహన వచ్చింది. నాకు తెలిసిన విషయాలు సమాజానికి కూడా తెలియజేయాలని 2012లో ‘రాజకీయాలలో మహిళలు’ అనే పుస్తకం ప్రచురించాను. ఇక అప్పటి నుండి సంవత్సరానికి ఒక పుస్తకం తీసుకువస్తున్నాను. రాజకీయాల్లో ఉన్న మహిళలు అన్ని రకాల సేవలు చేస్తారు. కానీ చివరకు నాయకత్వం దగ్గరకు వచ్చే సరికి మగవాళ్ళే ఉంటారు. మహిళలు కేవలం జెండాలు మోసేవాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఒకవేళ వచ్చినా వారసత్వం ఉన్న వాళ్ళకే అవకాశాలు. లేదంటే తాము చేసిన పోరాటాల ద్వారా నిలబడగలుగుతున్నారు. ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మ, సదాలక్ష్మీ, ఈశ్వరీ బాయి, మల్లు స్వరాజ్యం వీరందరూ ఇలాంటి వారే. వీరం దరి గురించి ఈ ప్రపంచానికి తెలియాలి. లేదంటే మరుగున పడిపోతారు. భావితరాలకు వీరెంతో స్ఫూర్తి. సమాజంలో సగ భాగం ఉన్న మహిళలు రాజ్యాంగం కల్పించిన హక్కులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే ఈ పుస్తకం రాశాను.

మహిళల స్థితిగతులపై
మీడియాలో మహిళలు ఎంత కష్టపడి పని చేసినా గుర్తింపు లేదు. ఈ విషయాలు తెలియజేస్తూ ‘మహిళలు మీడియా’ అనే పుస్తకం రాశాను. అలాగే ‘తెలం గాణ రాజకీ యాలలో మహిళలు’, ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలలో మహిళలు’ అనే రెండు పుస్తకాలు రాశాను. ఇందులో 1952 నుండి 2016 వరకు రాజకీయాలలో మహిళలు పోషించిన పాత్ర ఉంటుంది. తర్వాత ‘భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు’, ‘భారతదేశం మహిళా గవర్నర్లు’ అనే పుస్తకాలు కూడా ప్రచురించాను. ఈ పుస్తకాలన్నీ అతి కష్టం మీద నా సొంత ఖర్చులతో వేశాను. తెలంగాణ ప్రభుత్వం ఒకసారి, ఆంధ్రబ్యాంక్‌ వాళ్ళు ఒకసారి మాత్రం సహకరించారు. ‘తెలంగాణ రాజకీయాల్లో మహిళలు’ పుస్తకం రెండు సార్లు ముద్రించాను. ఇప్పటి వరకు రెండు వేల పుస్తకాలు అమ్ముడు పోయాయి.

పనితోనే సమాధానం
ఈ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ వాళ్ళందరకీ నా పని ద్వారానే సమాధానం చెప్పాను. మగవాళ్ళ కంటే ఎక్కువ గంటలు పని చేసేదాన్ని. అలాగే ఉన్నత చదు వులు చదువులు చదువుకోవడం, నా కుటుంబ నేపథ్యం కూడా నన్ను కాపాడిందని చెప్పాలి. ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి ఈ రంగంలో ఇంత కాలం నిలదొక్కుకోవడం అనేది ఆడపిల్లలకు చాలా కష్టం. ఆడపిల్ల ఇంటర్‌ లేదా డిగ్రీ చదివితే అదే గొప్ప. మా అమ్మ కూడా ఇంటర్‌ చాలు అనేది. మా అన్న ప్రోత్సాహంతో చదువుకోగలిగాను. అన్నయ్య ఫ్రెండ్స్‌ చెల్లెళ్ళు చాలామంది ఫెయిలయితే నేను మాత్రం పాసయ్యేది. దాంతో ‘మా చెల్లి పాసయ్యింది తనని బాగా చదివించాలి’ అనుకునేవాడు. అమ్మానాన్నలకు మేము నలుగురు ఆడపిల్లలం, ఇద్దరు అబ్బాయిలు. అందరిలో ఎక్కువ చదువుకుంది నేనొక్కదాన్నే. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో కూడా పాల్గొన్నా. రెడ్‌క్రాస్‌, ఎన్‌.సి.సిలో పని చేయడం వల్ల సామాజిక సేవపై అవగాహన వచ్చింది.

మహిళల శ్రమను గుర్తించాలి
స్త్రీని దేవతలా పూజించాలని గొప్పగా ప్రచారాలు చేస్తుంటారు. అయితే దేవతగా చూడాల్సిన అవసరంలేదు. ఒక మనిషిగా గుర్తిస్తే చాలు. మహిళల సమస్యలు సగం పరిష్కారం అవుతాయి. అలాగే ప్రపంచీకరణ ప్రభావం మన దేశ మహిళలపై తీవ్రంగా ఉంది. మహిళల శ్రమకు గుర్తింపు లేకుండా పోయింది. దాంతో ఆర్థికంగా చితికి అన్యాయానికి గురౌతున్నారు. శ్రమ దోపిడికి గురౌతున్నారు. దీనిలో మార్పు రావాలి. మహిళల శ్రమను గుర్తించాలి. గ్రామాల్లో మరుగుదొడ్డి లేకపోయినా సెల్‌ఫోన్‌ మాత్రం ఉంటుంది. ముందు స్త్రీకి రక్షణ కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, జీవించే హక్కు కావాలి. వీటన్నింటిని మర్చిపోయి మన పాలకులు ప్రపంచీకరణ అంటూ పరుగులు పెడుతున్నారు.

ఆర్థిక స్వతంత్రం అవసరం
ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అని మా నాన్న నాకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించారు. నేను బ్లాక్‌ బెల్ట్‌ తీసుకుంటే చూడాలని ఆయనకు కోరిక ఉండేది. కానీ నేను అది పూర్తి చేయక ముందే నాన్న చనిపోయారు. తర్వాత నా మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ ఆగిపోయింది. మా అమ్మ బట్టలు, నగలు లాంటివి ఎన్ని అడిగిన కొనిపెట్టేది. కానీ ఒక పుస్తకం కొనుక్కుంటానంటే మాత్రం డబ్బులు ఇచ్చేది కాదు. నాకేమో పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడకూడదు, ప్రతి ఆడపిల్లకూ ఆర్థిక స్వాతంత్రం ఉండాలనేది అప్పుడే గుర్తించాను. అందుకే నా పాకెట్‌ మనీ కోసం డిగ్రీ చేస్తున్నప్పుడే పార్ట్‌టైం ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. ఆ వచ్చిన డబ్బుతో నాకు కావల్సిన పుస్తకాలు కొనుక్కునేదాన్ని. అలాగే సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేదాన్ని. బంధువుల్లో కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుకునేవారు. నా పనితనం చూసి మౌనంగా ఉండిపోయేవారు. చిన్నకష్టానికే ఏడ్చి కూర్చుంటే ఏమీ చేయలేం అనే దాన్ని బలంగా నమ్ముతా. మనకు ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటే ఎక్కడైనా నెట్టుకురాగలం. మాది మతాంతర వివాహం. మాకు ఓ బాబు, పేరు భానూ ప్రకాష్‌.. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

పరిశోధన జరగాలి
ప్రస్తుతం ఓ న్యూస్‌ ఛానల్‌కు న్యూస్‌ ఎడిటర్‌గా చేస్తూనే కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌కు ఇన్చార్జ్‌గా పని చేస్తున్నాను. క్రైం రిపోర్టింగ్‌, పొలిటికల్‌ న్యూస్‌ చూసే అవకాశం మహిళలకు రావడం చాలా కష్టం. అలాంటిది ఈ రంగంలోకి వచ్చిన కొంత కాలానికే నేను చూడగలిగాను. పని చేస్తున్న రంగం వల్లనే మహిళల సమస్యలేంటి, అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేవి అధ్యయనం చేయగలిగాను. మహిళల గురించి ఇంకా ఎన్నో పుస్తకాలు తీసుకురావల్సి వస్తుంది. వీటిపైన పరిశోధన జరగాలి. వారి స్ఫూర్తి దాయక జీవితాలను ప్రపంచానికి తెలియజేయాలి.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates