వికసించిన కృష్ణకమలం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

శ్వేత తటాకంలో ‘కృష్ణ కమలం’ వికసించింది. ఆ నల్లపువ్వు తల్లివేరు ఇండియాలో ఉంది. అనుబంధం వెస్ట్‌ ఇండీస్‌తో ముడిపడి ఉంది. అమెరికా చరిత్రలో కొత్త పుటను ఆరంభించింది. అగ్రరాజ్యం ఉన్నత స్థానాల్లో మహిళలు లేరన్న అపవాదును తీర్చింది. నల్లజాతీయుల్లో గుండె ధైర్యాన్ని నింపింది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉండే ఆ పుష్పమే కమలా హారిస్‌. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయిన తొలి మహిళ, మొదటి నల్లజాతీయురాలు కూడా.

తల్లి పెంపకంలో పెరిగిన కమల మహిళలకు ఆదర్శం. చదువు, పట్టుదల ఉంటే ఎంతటి స్థానాలకైనా ఎదగవచ్చన్నదానికి ఆమే ఉదాహరణ. ఒక్కసారి ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ముందుగా తల్లి శ్యామలా గోపాలన్‌ గురించి చెప్పుకోవాలి. ఆమె తమిళనాడుకు చెందిన వారు. 19 ఏళ్ల వయసులోనే 1958లో చదువుల నిమిత్తం అమెరికా వచ్చారు. చేతిలో కాసిన్ని డాలర్లు, సూట్‌కేసులో కొన్ని దుస్తులు తప్ప ఇంకేమీ లేవు. గుండె నిండా ఆత్మవిశ్వాసం మాత్రం ఉంది. బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరారు. 1964లో పీహెచ్‌డీ పట్టా తీసుకున్నారు. క్యాన్సర్‌ పరిశోధకురాలిగా ఉగ్యోగంలో స్థిరపడ్డారు. అక్కడే వెస్టిండీస్‌లో భాగమైన జమైకాకు చెందిన డొనాల్డ్‌ జె హారిస్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయన స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా ఎదిగారు. ఆ దంపతులకు కమల, మాయ జన్మించారు. కమల ఏడో ఏట ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. శ్యామల ఒంటిరిగానే కుమార్తెలు ఇద్దర్నీ పెంచి పెద్దచేశారు. వారు సెలవుల్లో తండ్రివద్దకు వెళ్లినప్పుడు ఇరుగుపొరుగువారు నల్లజాతీయులుగానే చూశారు. తెల్లజాతి పిల్లలు ఆడుకోవడానికి రానీయ లేదు. దాంతో ‘‘మేము ఉంటున్న దేశం (అమెరికా) నన్ను, చెల్లెలు మాయాను నల్లజాతి బాలికలులాగానే చూస్తుందన్న విషయం మా అమ్మకు అర్థమయింది. అందుకే ఆత్మవిశ్వాసంతో గర్వించే నల్లజాతి మహిళలుగా మమ్మల్ని తీర్చిదిద్దాలని ఆమె నిర్ణయించుకొంది’’ అని తన ఆత్మకథ ‘ద ట్రూత్‌ వియ్‌ హోల్డ్‌’లో కమల రాసుకున్నారు. చిన్నతనంలో అక్కచెల్లెల్లు ఇద్దరూ నల్లజాతీయుల చర్చిలకు వెళ్లి పాటలు పాడేవారు. తల్లి శ్యామల హిందూ పురాణ కథలను చెప్పేది. మద్రాసు (ఇప్పటి చెన్నై)లోని తండ్రి పి.వి.గోపాలన్‌ ఇంటికి తీసుకెళ్లి తన మూలాలనూ కుటుంబ వరసలనూ గుర్తు చేసింది. చదువుల్లో రాణించిన కమల వాషింగ్టన్‌లోని హొవార్డ్‌ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ సంతతి విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుతుంటారు. కాలిఫోర్నియోలోని హేస్టింగ్స్‌ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ బ్లాక్‌ లా స్ట్టూడెంట్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1990లో కాలిఫోర్నియాలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని వృత్తిని చేపట్టారు.

‘‘నేను నేనే. నా నేపథ్యంతో సంతోషంగా ఉన్నా. మీరు దాన్ని గుర్తు చేయవచ్చు. కానీ నాకు అది ఎంతో బాగుంది’’

పిల్లలు వెళ్లకపోతే.. తల్లిదండ్రులకు శిక్ష
2002లో శాన్‌ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికవడం కమల జీవితాన్ని మలుపుతిప్పింది. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి ఆమే కావడం విశేషం. ఇక్కడ తన ప్రతిభను చూపారు. కాలుష్యాల నివారణకు 2005లో ప్రత్యేకంగా ‘పర్యావరణ నేరాల విభాగా’న్ని ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల నేరాలపై కఠినంగా వ్యవహరించారు. ట్రాన్స్‌జెండర్లు వేధింపులకు గురవుతుండడంతో వారికి రక్షణ కల్పించేందుకు ‘హేట్‌ క్రైం’ విభాగాన్ని కూడా నెలకొల్పారు. ఉరిశిక్షలు బదులు జీవితాంతం జైలులో ఉండేలా శిక్షలు విధిస్తే మంచిదన్నది ఆమె అభిమతం. ఈ విషయంలో ఒత్తిడి వచ్చినా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ఆమె హయాంలోనే చోటు చేసుకుంది. సరయిన కారణం లేకుండా 50 రోజుల పాటు గైర్హాజరయినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్ష పడింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇలాంటి శిక్షలు పడడం అదే తొలిసారి. జైలుకు పంపించడంలాంటివి చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షలు వేశారు. 2011లో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళ, మొదటి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కూడా ఆమెనే. 2014లో మరోసారి ఈ పదవిని నిర్వహించారు. 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున సెనేట్‌కు ఎన్నికయి జాతీయ రాజకీయల్లోకి వచ్చారు.

తొలుత అధ్యక్ష స్థానంపైనే గురి
కమల తొలుత అధ్యక్ష పదవిపైనే దృష్టిపెట్టారు. డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తానంటూ గత ఏడాది కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో 20వేల మంది సమక్షంలో జరిగిన సభలో ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా తననే ఎంచుకోవాలంటూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జో బైడెన్‌పైనే విమర్శలు చేశారు. చివరకు కొన్ని విషయాల్లో బైడెన్‌తో సమానంగా సమాధానాలు ఇవ్వలేక పార్టీ మద్దతు పొందలేకపోయారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెను ఉపాధ్యక్ష పదవికి స్వయంగా బైడెనే ఎంపిక చేయడం గమనార్హం.

మేనమామ ఆనందం
కమలా హారిస్‌ విజయంపై దిల్లీలో ఉన్న ఆమె మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. గెలుస్తావని నిన్ననే చెప్పేశా’’ అని అన్నారు.

సవతి పిల్లలే తన పిల్లలుగా..
కమలా హారిస్‌కు భర్త డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ అండదండగా ఉంటున్నారు. ఆయన కూడా న్యాయవాదే. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. సవతి పిల్లలనే కమల తన సంతానంగా భావిస్తున్నారు. బహుళత్వం మెండుగా ఉండే అమెరికా సమాజంలో ఆమె అణగారిన వర్గాల ప్రతినిధి అనడంలో సందేహం లేదు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates