అమెరికా జోష్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అగ్రరాజ్యం అధినేతగా జో బైడెన్‌
అమెరికాకు బైడెన్‌ 46వ అధ్యక్షుడు
పెన్సిల్వేనియా, నెవాడాల్లో విజయంతో ఖాయమైన అధ్యక్ష పీఠం
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ కమలా హారిస్‌
చరిత్ర సృష్టించిన భారత సంతతి వనిత

మాటిస్తున్నా..
మన గొప్ప దేశాన్ని ముందుండి నడిపించే స్థానానికి నన్ను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. మన ముందున్న సవాళ్లు చాలా కఠినమైనవి. కానీ, నేను మీకు మాటిస్తున్నా. అమెరికా పౌరులందరి అధ్యక్షుడిగా ఉంటా – మీరు నాకు ఓటేసి ఉన్నా.. వేయకపోయినా సరే. నాపై మీరు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా. ఎన్నికల్లో విజయం అనంతరం అమెరికన్లను ఉద్దేశించి బైడెన్‌ ట్వీట్‌

బైడెన్‌కు అమెరికా జేజేలు పలికింది. అగ్రరాజ్యంలో భారత ‘కమల’ం కాంతులీనింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. దోబూచులాడిన విజయం డెమొక్రాట్లను వరించింది. గెలుపుపై బీరాలు పోయిన డొనాల్డ్‌ ‘ట్రంపరితనం’ విజయానికి ఆమడ దూరంలో చతికిలపడింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా 77 ఏళ్ల జో బైడెన్‌ గద్దెనెక్కబోతున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌(56) అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి మహిళ, మొట్టమొదటి శ్వేతజాతీయేతరురాలు. అమెరికా చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు, అరుదైన ఘనత.

ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతుండటంతో.. త‘రాజు’ ఎటు మొగ్గుతుందోనని ప్రపంచం నాలుగు రోజులుగా ఊపిరి బిగబట్టి ఎదురుచూసింది. ప్రత్యర్థి బృందాలు కోర్టు దావాలతో సర్వత్రా అనిశ్చితి రాజ్యమేలింది. తానే గెలిచానంటూ రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ చేసిన ప్రకటనలు ఈ గందరగోళానికి ఆజ్యం పోశాయి. ప్రత్యర్థి శిబిరాల అనుకూల, వ్యతిరేక నిరసనలతో అగ్రరాజ్యం అట్టుడికింది. వీటన్నింటినీ చిరునవ్వుతోనే చిత్తుచేశారు బైడెన్‌. చివరికి శనివారం పెన్సిల్వేనియా, నెవాడాల్లోనూ విజయదుందుభి మోగించారు. అగ్రరాజ్యానికి కాబోయే అధినేతగా అవతరించారు. జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు

పని మొదలుపెడదాం
ఈ ఎన్నికలు కేవలం జో బైడెన్‌కు సంబంధించినవో లేదంటే నాకు సంబంధించినవో కావు. అమెరికా అంతరాత్మకు సంబంధించినవి. దాని కోసం పోరాడాలన్న మన సంకల్ప బలానికి సంబంధించినవి. మన ముందు చాలాపని ఉంది. ఇక మొదలుపెడదాం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన అనంతరం కమలా హారిస్‌ ట్వీట్‌

ఓటమిని అంగీకరించను
నేను ఓటమిని అంగీకరించను. నిజాయతీగా ఓట్లను లెక్కపెట్టే వరకూ విశ్రమించను. అమెరికా అధ్యక్షుడు ఎవరన్నది లీగల్‌ ఓట్లు నిర్ణయించాలి. మీడియా కాదు. డొనాల్డ్‌ ట్రంప్‌

ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం ఓట్లు – 538
అధ్యక్ష పీఠమెక్కేందుకు కావాల్సిన సంఖ్య – 270

ప్రస్తుతం ఎవరికెన్ని..
బైడెన్‌ 290
ట్రంప్‌ 214

వాషింగ్టన్‌: అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో డెమొక్రాట్ల అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ చరిత్రాత్మక విజయం సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో జాప్యం చోటుచేసుకుంటుండటంతో మూడు రోజులుగా ఊరిస్తున్న గెలుపు శనివారం ఎట్టకేలకు ఆయన్ను వరించింది. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించడంతో అధ్యక్ష పీఠం ఆయన వశమైంది. మరో నాలుగేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాలన్న ట్రంప్‌ కలలు కల్లలయ్యాయి! నెవాడా కూడా బైడెన్‌ ఖాతాలోకి వెళ్లింది.

శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే సమయానికి బైడెన్‌ ఖాతాలో 264 ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి. అధ్యక్ష పీఠం దక్కాలంటే మరో 6 ఓట్లు అవసరం. అప్పటికి పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలో ఏ ఒక్క రాష్ట్రం దక్కినా గెలుపు ఆయనదే. నెవాడాలో పోలింగ్‌ ముగిసిన రెండు రోజులకే ఫలితాలను ప్రకటించే సంప్రదాయం ఉండటంతో ఆ రాష్ట్ర ఫలితం ఖరారవుతుందని.. బైడెన్‌ గెలుపు స్పష్టమవుతుందని అంతా భావించారు. అయితే- నెవాడాలో ఈ దఫా పోస్టల్‌ బ్యాలెట్లు భారీగా వచ్చాయి. అక్కడ ఫలితం ఆలస్యమైంది. ఆ లోపు పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై బైడెన్‌ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. పోలైన ఓట్లన్నీ లెక్కించినా ఇక ట్రంప్‌ ఆయన్ను దాటలేరని నిర్ధారణ అయింది. డెమొక్రాటిక్‌ అభ్యర్థి ఖాతాలో 20 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చి చేరాయి. దాంతో మ్యాజిక్‌ ఫిగర్‌ ‘270’ని ఆయన దాటేశారు. అనంతరం నెవాడా కూడా దక్కడంతో మరో 6 ఓట్లు జత కలిశాయి. ఫలితంగా జార్జియా, అలస్కా, నార్త్‌ కరోలినాల్లో వెలువడనున్న ఫలితాలు ఇక కేవలం నామమాత్రంగా మిగిలిపోయాయి.

 తొలుత వెనుకంజ
తన విజయం ఖరారవ్వడానికి వేదికగా నిలిచిన పెన్సిల్వేనియాలో వాస్తవానికి బైడెన్‌ తొలుత వెనుకంజలో ఉన్నారు. గురువారం వరకూ అక్కడ ట్రంప్‌కు 2.3 శాతం ఓట్ల ఆధిక్యం ఉంది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సాగే కొద్దీ డెమొక్రాటిక్‌ నేత ముందుకు దూసుకొచ్చారు. శుక్రవారం నాటికి తన ప్రత్యర్థిపై 0.1% ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆ ఆధిపత్యాన్ని శనివారం మరింత పదిలం చేసుకున్నారు. రాష్ట్రంలో బైడెన్‌కు ట్రంప్‌ కంటే దాదాపు 34 వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

 ఆ రాష్ట్రాలే అండగా..
కాలిఫోర్నియా (55), న్యూయార్క్‌ (29), ఇలినాయీ (20) వంటి పెద్ద రాష్ట్రాల్లో జయభేరి మోగించడంతో ఎన్నికల్లో బైడెన్‌ విజయానికి బాటలు పడ్డాయి. అయితే- గత ఎన్నికల్లో రిపబ్లికన్లు గెల్చుకున్న పెన్సిల్వేనియా (20), మిషిగన్‌ (16), అరిజోనా (11), విస్కాన్సిన్‌ (10)లనూ ఆయన తన వైపునకు తిప్పుకొన్నారు. దాంతోపాటు డెమొక్రాట్లకు పట్టున్న రాష్ట్రాలన్నింటినీ నిలుపుకొన్నారు. ముఖ్యంగా రిపబ్లికన్లకు పెట్టని కోటగా పేరున్న అరిజోనాను బైడెన్‌ దక్కించుకోవడం ఈ ఎన్నికల్లో కీలక పరిణామం.

సర్వేలు ముందే చెప్పినా..
వాస్తవానికి తాజా ఎన్నికల్లో బైడెన్‌ విజయం ఖాయమని దాదాపుగా అన్ని సర్వేలు ముందే జోస్యం చెప్పాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలన్నీ తలకిందులవడంతో ఈ దఫా వాటిని ఎవరూ పెద్దగా విశ్వసించలేదు. అందుకు తగ్గట్లే పోలింగ్‌ ముగిశాక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు ట్రంప్‌, బైడెన్‌ల మధ్య పోరు హోరాహోరీగా కనిపించింది. పలు రాష్ట్రాల్లో ఆధిక్యం దోబూచులాడింది. అయితే- పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సాగే కొద్దీ ట్రంప్‌ను వెనక్కి నెట్టి బైడెన్‌ ముందంజ వేశారు. కొవిడ్‌ మహమ్మారిపై పోరులో ట్రంప్‌ ప్రభుత్వ వైఫల్యం, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం వంటి అంశాలు తాజా ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది.

కమలా హారిస్‌ రికార్డులు
అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హారిస్‌ (56) ఎన్నికయ్యారు. ఆ పదవిని చేపట్టబోతున్న తొలి మహిళ ఆమే. ఉపాధ్యక్ష పీఠమెక్కనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి ఆఫ్రికన్‌-అమెరికన్‌గా కూడా ఆమె రికార్డు సృష్టించారు. వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్‌తోపాటే ఆమె ప్రమాణ స్వీకారం ఉంటుంది.

ఆ పోస్టల్‌ బ్యాలెట్లను వేరు చేయండి: సుప్రీం
అంతకుముందు, పెన్సిల్వేనియాలో పోలింగ్‌ రోజు రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వేరు చేసి ఉంచాలని ఎన్నికల అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది. వాటిని లెక్కించాల్సి వస్తే.. విడిగానే లెక్కించాలని సూచించింది. రిపబ్లికన్‌ పార్టీ బృందం దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ శామ్యూల్‌ ఎ అలిటో జూనియర్‌ తాజా తీర్పును వెలువరించారు. పెన్సిల్వేనియాలో పోలింగ్‌ రోజు రాత్రి 8 గంటల డెడ్‌లైన్‌ను దాటిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్లు గణనీయంగా వచ్చాయన్నది ట్రంప్‌ వర్గీయుల ఆరోపణ. వాటిని లెక్కించవద్దని వారు డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు వచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ పెన్సిల్వేనియాలో ఓ కోర్టు స్పష్టం చేసింది. దాన్ని సుప్రీం కోర్టులో ట్రంప్‌ బృందం సవాలు చేసింది.

* 1992లో జార్జ్‌ హెచ్‌.డబ్ల్యూ.బుష్‌ అధ్యక్ష పదవిలో ఉండగా రెండోసారి ఆ పదవికి పోటీ చేసి క్లింటన్‌ చేతిలో పరాజయం చవిచూశారు. ఆ తర్వాత పదవిలో కొనసాగుతూ ఓడిపోయిన అధ్యక్షుడు ట్రంపే.
* ఇప్పటివరకూ 10 మంది అమెరికా అధ్యక్షులు రెండో ప్రయత్నంలో విఫలం కాగా… తాజాగా ట్రంప్‌ 11వ వ్యక్తిగా వారి సరసన చేరారు.

మీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..
‘‘అద్భుత విజయం సాధించిన బైడెన్‌కు అభినందనలు. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు. మీతో మరోసారి కలిసి పనిచేసి, రెండు దేశాల మధ్య సంబంధాలను సమోన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌ విజయం.. భారత అమెరికన్లందరికీ గర్వకారణం. మీ తోడ్పాటుతో రెండు దేశాల సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నా.’’ నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అమెరికా నోరు విప్పింది
‘‘అమెరికా నోరు విప్పింది. ప్రజాస్వామ్యం గెలిచింది. ఇప్పుడు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైనవారు మనందరికీ సేవలు అందిస్తారు. మనల్ని ఏకతాటిపై నిలుపుతారు. ’’ బిల్‌ క్లింటన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు

వేడిని చల్లార్చాల్సిన బాధ్యత మనందరిదీ
‘‘అధ్యక్ష బాధ్యతలు ఎలా ఉంటాయో బైడెన్‌కు తెలుసు. జనవరిలో వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టాక ఆయన.. భారీగా సవాళ్లను ఎదుర్కోనున్నారు. దేశ ప్రజల్లో తీవ్ర చీలిక వచ్చిందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ వేడిని చల్లార్చి, దేశం ఉమ్మడిగా ముందడుగు వేసేలా చూడాల్సిన బాధ్యత బైడెన్‌, కమలాపైనే కాక మనందరిపైనా ఉంది.’’బరాక్‌ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికాకు దారి చూపెడతారని..
‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌కు శుభాకాంక్షలు. ఆయన అమెరికాను ఏకం చేస్తారని, బలమైన మార్గనిర్దేశం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కూ అభినందనలు.’’ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates