250 డాలర్లతో అమెరికాలో అడుగు పెట్టా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఉచితాల ఊసులేదు, ప్యాకేజీల ప్రకటనలూ లేవు… ‘పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యసేవలు అందేలా చూస్తా… భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని, సహజ వనరుల్నీ కాపాడతా…’ అంటూ నిజాయతీగా చెప్పిన అంశాలే… తెలుగింటి ఆడపడుచు పద్మ కుప్పను అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టేలా చేశాయి. తాజా ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీచేసి గెలిచారామె. ఆమెకిది వరుసగా రెండో విజయం.  భారత్‌లో చదువు, అమెరికాలో ఉద్యోగం, రాజకీయ ప్రవేశం… ఆ వివరాలన్నీ పద్మ పంచుకున్నారిలా…

ఆరోజు నాకు ఇప్పటికీ గుర్తే… రెండు సూట్‌కేసులూ, 250 డాలర్లతో అమెరికాకు బయలుదేరా. అలా ఇక్కడకు వచ్చిన నేను… ఈరోజు అమెరికాలో ఓ రాష్ట్ర చట్టసభకు ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నాకు మొదట రాజకీయ లక్ష్యాలేవీ లేవు. అమెరికాలో స్థిరపడటమే నా కల. ఎందుకో తెలియాలంటే దాదాపు 30ఏళ్లు వెనక్కి వెళ్లాలి.

మా నాన్న శ్రీనివాస శాస్త్రిది తెనాలి. అమ్మ ఉషది రాజమండ్రి. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. తెలుగువాళ్లమే అయినా నాన్న ఉద్యోగరీత్యా కొన్నాళ్లు భిలాయిలో, తర్వాత మైసూరులో ఉన్నాం. నేను పుట్టింది భిలాయిలో. నాకు నాలుగేళ్లపుడు నాన్న అమెరికా వచ్చేశారు. ఆయన ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌. ఇక్కడైతే ఇంకా మంచి అవకాశాలు వస్తాయనే వచ్చారు. తర్వాత ఏడాదికి నేనూ, అమ్మా కూడా వచ్చేశాం. నేను పదో తరగతి వరకూ ఇక్కడే చదువుకున్నా. ఆ తరువాత మళ్లీ ‘చలో ఇండియా’ అనడంతో హైదరాబాద్‌ వెళ్లాం. నేను నాంపల్లిలోని ‘స్టాన్లీ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ’లో ఇంటర్మీడియెట్‌ చదువుకున్నా. అమెరికా వాతావరణం అలవాటు కావడంవల్లనేమో, ఎప్పుడూ అమెరికా వెళ్లిపోవాలనుకునేదాన్ని. ఇదే విషయాన్ని తరచూ ఇంట్లో చెప్పేదాన్ని. ఓరోజు అమ్మ ‘నువ్వు ఇంజినీరింగ్‌, లేదంటే మెడిసిన్‌ చదివితేనే అక్కడకి వెళ్లడం సులభం’ అంది. నాకు మొదట్నుంచీ లెక్కలంటే ఇష్టం. దాంతో ఇంజినీరింగ్‌ వైపు వెళ్లా. వరంగల్‌లోని ఎన్‌ఐటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. అలా చదువయ్యాక ఇంట్లో మళ్లీ అమెరికా ప్రస్తావన తెస్తే.. ‘పెళ్లి చేసుకుని వెళ్లు’ అన్నారు. నేను మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పి 1988లో అమెరికా వచ్చేశా.

ఆయన చదువు.. నేను ఉద్యోగం!
ఇక్కడకు వచ్చాక చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. మా వారు కూడా ఇంజినీరే. ఆయన ఇక్కడ చదువుకునేవారు. అమెరికా వచ్చిన కొంతకాలానికి మా ఇద్దరికీ పరిచయమైంది. ఇండియాలో పెద్దవాళ్లు మాట్లాడుకుని మా పెళ్లి ఖాయం చేశారు. పెళ్లయ్యాక ఆయన చదువుకుంటుంటే నేనేమో ఉద్యోగం చేసేదాన్ని. తక్కువ సమయంలోనే గ్రీన్‌కార్డ్‌ సంపాదించుకున్నాం. నేను ఫోర్డ్‌, క్రిస్లర్‌ కార్ప్‌.. వంటి సంస్థల్లో పనిచేశా. పిల్లలకోసం కొద్దికాలం ఇంటిపట్టునే ఉన్నాను. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నాకు తోచిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ముఖ్యంగా ఇక్కడ ఉన్న  ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన నిధులు సమకూర్చడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. భారతీయుల పిల్లలకు శ్లోకాలు నేర్పించడం, వాళ్లలో భారతీయ సంస్కృతీ సంప్రదాయలపైన అవగాహన కల్పించడం… వంటి కార్యక్రమాలెన్నో చేసేదాన్ని. క్రమంగా విద్యతోపాటు పర్యావరణంపైన అనేక అవగాహన కార్యక్రమాలూ చేపట్టా. ఇవన్నీ చూసిన కొందరు.. ‘నువ్వు ఎన్నికల్లో పోటీచేయొచ్చు కదా’ అంటుండేవారు. అధికారం ఉంటే మరికొన్ని కార్యక్రమాలు చేయొచ్చనిపించింది. ట్రాయ్‌, క్లాసన్‌… మిషిగన్‌ రాష్ట్రంలో 41వ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ప్రధాన పట్టణాలు. ట్రాయ్‌లోనే దాదాపు 22 ఏళ్లుగా మేం ఉంటున్నాం. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున 41వ డిస్ట్రిక్ట్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గుమ్మం తట్టి.. నా గురించి చెప్పి… నన్ను గెలిపించమని అడగడం నాకు ఇప్పటికీ గుర్తే. ఆ ఎన్నికల్లో గెలిచాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరికొన్ని కార్యక్రమాలు చేపట్టి.. తాజాగా మళ్లీ ఎన్నికల్లో పోటీచేశా. ఈసారి  రిపబ్లికన్‌ అభ్యర్థిపైన 5611 ఓట్ల మెజారిటీతో గెలిచా.

సేవే నా గెలుపు రహస్యం..
అప్పుడూ ఇప్పుడూ నేను చేపట్టిన కార్యక్రమాలనే నా ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పా. ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఇప్పటివరకూ నేను చేపట్టిన, చేపట్టబోయే చర్యల గురించి నిజాయతీగా వివరించా. మేం ఉండే మిషిగన్‌ సరస్సులకు ప్రసిద్ధి. ఇక్కడున్న సరస్సులను ‘గ్రేట్‌ లేక్స్‌’ అని అంటారు. కానీ కొన్ని చాక్లెట్‌ తయారీ కంపెనీలవల్ల ఈ సరస్సులు కలుషితం కావడంతో వాటిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేశా. ఇకమీదట కూడా పర్యావరణ పరిరక్షణతోపాటూ, పిల్లలకు నాణ్యమైన విద్య, మహిళలకు పురుషులతో సమానంగా వేతనం అందేందుకు నా వంతుగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా.

చీరకట్టు ఇష్టం…
మావారు సుధాకర్‌. మా పాప శ్రీకరి, బాబు శ్రేయాస్‌. పాప మెడిసన్‌, బాబు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. నా విజయం వెనుక వాళ్ల సహకారం ఎంతో ఉంది.
 తెలుగు పండగల గురించి తెలియజేయడం.. సంస్కృతీ సాంప్రదాయాల గురించి అవగాహన కల్పించడంలో ముందుంటా. పట్టుచీర కట్టుకోవడమంటే ఇష్టం.
 ఇక్కడ దీపావళి పండగను ఘనంగా నిర్వహిస్తాం. 2018లో మిషిగన్‌ రాష్ట్ర శాసనసభ దీపావళి పండగను అధికారికంగా జరపాలని నిర్ణయించడంలో నా పాత్ర కీలకం అయినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates