కార్మిక సంఘాల అస్తిత్వానికి దెబ్బ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కె. వేణుగోపాల్

కార్మిక చట్టాల సవరణ చాలాకాలంగా కార్పొరేట్ల డిమాండ్‌. కార్మిక చట్టాలు మరింత సరళంగా, సులభంగా ఉండాలనీ, వాటి సంఖ్య కూడా తగ్గించాలని కార్పొరేట్ల కోరిక. దీంతో, మొత్తం 29 చట్టాలను నాలుగుకోడ్‌లుగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. సులభతర వాణిజ్యం పేరిట తెస్తున్న మార్పులు ఇవి. కొన్ని ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఈ నాలుగు కోడ్‌లు పూర్తిగా బలహీనం చేయనున్నాయి.

సెప్టెంబర్ చివరి వారంలో పార్లమెంటు ఉభయ సభలు మూడు కార్మిక బిల్లులను ఆమోదించాయి. పారిశ్రామిక సంబంధాల బిల్లు, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్‌, సోషల్ సెక్యూరిటీ కోడ్ అనే మూడు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది.

భవిష్యత్ పని అవసరాలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా మారిన పరిస్థితుల దృష్ట్యా కార్మిక చట్టాలలో మార్పులు అనివార్యమని కేంద్రమంత్రి బిల్లులను స్వాగతిస్తూ వ్యాఖ్యానించారు. భారత కార్పొరేట్ వర్గాలు ఈ మార్పులను స్వాగతించాయి. సులభతర వాణిజ్య ప్రక్రియలో భారతదేశం ర్యాంకు ఇటీవలి కాలంలో మెరుగై 63కు చేరుకున్నది. కార్మిక చట్టాల మార్పువల్ల ఈ ర్యాంకు మరింతగా మెరుగుపడుతుందని కార్పొరేట్ వర్గాల అభిప్రాయం.

చట్టాల్లో మార్పులను కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసించాయి. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాచిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కొవిడ్ సృష్టించిన ఆహార, ఆర్థిక సంక్షోభాలు, నిరుద్యోగం, ఉద్యోగాలూ వేతనాలలో అనిశ్చితి నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితులలో కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా వారి హక్కులను హరించడాన్ని నిరసిస్తున్నారు. వ్యవసాయబిల్లులను ఆమోదించినందుకు నిరసనగా ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన సమయంలో ప్రభుత్వం ఈ లేబర్‌కోడ్‌లను ఆమోదింపచేసుకుంది.

కార్మిక చట్టాల సవరణ చాలాకాలంగా కార్పొరేట్ల డిమాండ్‌. కార్మిక చట్టాలు మరింత సరళంగా, సులభంగా ఉండాలనీ, వాటి సంఖ్య కూడా తగ్గించాలనీ కార్పోరేట్ల కోరిక. మొత్తం 29 చట్టాలను నాలుగుకోడ్‌లుగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది. ఇందులో మొదటగా వేజ్ కోడ్ బిల్లు జులై 2019లో పార్లమెంట్ ఆమోదాన్ని పొందింది. సులభ తర వాణిజ్యం పేరిట తెస్తున్న మార్పులు ఇవి. కొన్ని ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఈ నాలుగు కోడ్‌లు పూర్తిగా బలహీనం చేయనున్నాయి.

వేజ్ కోడ్ క్రింద పని గంటలు రోజుకు తొమ్మిది అవుతాయి. విరామ సమయం గంట కన్నా ఎక్కువ ఉండకూడదు. యాజమాని అవసరమనుకుంటే పని గంటలను విరామసమయంతో కలిపి రోజుకు పన్నెండు గంటల వరకు పెంచుకోవచ్చు. ఓవర్ టైమ్ పైనా, ఒక వారంలో చేయాల్సిన పని గంటల పైనా ఉన్న పరిమితిని ఎత్తివేశారు. కనీస వేతనాలను నిర్ధారించే విధానాన్ని కూడా యాజమాన్యాలకు అనుకూలంగా మార్చి వేసారు.

ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ క్రింద కార్మికులు సంఘాలు ఏర్పర్చుకోవడం చాలా కష్టమైపోతుంది. అవి పని చేయడంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కార్మికుని సమ్మె హక్కును ఈ కోడ్ నిర్వీర్యం చేస్తుంది. సమ్మెకు 14 రోజుల నోటీస్ ఇచ్చి, నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లో సమ్మె చేయాల్సి ఉంటుంది. కాన్సిలేటరీ ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఈ ప్రొసీడింగ్స్ ముగిసిన ఏడు రోజుల వరకు సమ్మె చేయకూడదు. ఎన్ఐటి లేదా ఇతర ట్రిబ్యునల్స్ ముందు కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు, అలాగే ట్రిబ్యునల్‌లో కేసు ముగిసిన 60 రోజుల వరకు, ఆర్బిట్రేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఆర్బిట్రేషన్ కేసులు ముగిసిన 60 రోజుల వరకు కార్మికులు సమ్మె చేయకూడదు. అంటే చట్టబద్ధంగా సమ్మె చేయడానికి కూడా వీలులేని పరిస్థితులు వస్తాయి. అలాగే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మొత్తం కార్మికులలో కనీసం 10% లేదా కనీసం 100 మంది కార్మికులు (ఏది తక్కువైతే అది) సంఘ ఏర్పాటుకు సమ్మతి తెలపాల్సి ఉంటుంది. కార్మిక సంఘాల రిజిస్ట్రార్‌కు సంఘం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం ఉంటుంది. ఈ హక్కును ఆయన ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. కార్మిక సంఘాల గుర్తింపునకు ప్రస్తుతం అమలులో ఉన్న రహస్య బ్యాలట్‌ను రద్దు చేస్తారు కనుక ఈ గుర్తింపు ఎన్నికలలో యాజమాన్యాలు జోక్యం చేసుకొని తమకు కావలసిన సంఘానికి గుర్తింపు ఇప్పించుకొనే అవకాశాలు పెరుగుతాయి. కార్మిక సంఘాల అస్తిత్వాన్ని ఇది దెబ్బ తీస్తుంది. ఐఆర్ కోడ్ ప్రకారం సూపర్‌వైజరీ క్యాడర్‌లో పనిచేస్తూ 18,000 రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించే వారిని వర్కర్‌గా గుర్తించరు. ఐఆర్ కోడ్ ప్రకారం మొత్తం కార్మికులలో 51% మద్దతు ఉన్న కార్మిక సంఘం మాత్రమే కార్మికుల

తరఫున యాజమాన్యంతో సంప్రదింపులు జరపవచ్చు. దీని పట్ల కార్మిక సంఘాలు అభ్యంతరం తెల్పుతున్నాయి. ఈ నియమం వల్ల ఒకే ఒక సంఘం ప్రాబల్యం పెరుగుతుందనీ, ఇది అంతర్జాతీయ కార్మిక సంఘం కన్వెన్షన్‌కు విరుద్ధమనీ సంఘాలు చెబుతున్నాయి. జిల్లా లేబర్ కోర్టులను రద్దు చేసి ప్రతి రాష్ట్రానికి పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఐఆర్ కోడ్ అనుమతి ఇచ్చింది. ఇవ్వని కార్మికులకు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అమలులో ఉన్న ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్‌ అనే పద్ధతికి ఐఆర్ కోడ్ ఆమోదాన్ని తెల్పింది. దీని క్రింద యాజమాని తనకు నచ్చిన కాలం వరకు ఒక కార్మికుడిని ఉద్యోగంలో ఉంచుకోవచ్చు. ఈ నిర్ణీత సమయం తర్వాత అవసరమని అనుకుంటే కార్మికుడిని ఉద్యోగంలో కొనసాగించవచ్చు లేదా తీసివేయవచ్చు. ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్ వర్కర్‌కి ఇస్తున్న వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల రాబోయే కాలంలో శాశ్వత ఉద్యోగాలు అనేవి మాయమైపోయే అవకాశాలు పెరుగుతాయి.

పారిశ్రామిక సంబంధాల చట్టం క్రింద 100 మంది కన్నా ఎక్కువ కార్మికులు పనిచేసే సంస్థలో ఏ కార్మికుడినైనా ఉద్యోగం నుంచి తీసి వేయాలనుకుంటే దానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం. దీనిని ఇప్పుడు 300మందికి పెంచారు. దీని వల్ల సుమారు 70% పారిశ్రామిక యూనిట్లు, అలాగే 74% మంది కార్మికులకు రిట్రెంచ్‌మెంట్‌ విషయంలో ఉన్న చట్టపరమైన రక్షణ పోతుంది.

సోషల్ సెక్యురిటీ కోడ్ ద్వారా కార్మికులకు కొత్తగా వచ్చే సాంఘిక భద్రతా ప్రయోజనాలేమీ లేవు. తొమ్మిది చట్టాలను సరళీకరించి కార్మికులకు మరింత ప్రయోజనం చేకూర్చామన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు. వాస్తవానికి, ఇదివరకు ఉన్న ప్రయోజనాలను కొత్త కోడ్ తగ్గించి వేసింది. ఇపీఎఫ్‌కు యాజమాన్య వాటాను 12% నుంచి 10% తగ్గించారు. ఇఎస్ఐ, ఇతర సాంఘిక భద్రత పథకాలను సోషల్ సెక్యురిటీ కోడ్ నిర్వీర్యం చేసింది. అసంఘటిత రంగ కార్మికులకు సాంఘిక భద్రత కల్పించడానికి ఈ కోడ్ ఏమీ చర్యలు తీసుకోలేదు.

ఆక్యుపేషనల్‌ సెక్యూరిటీ, హెల్త్ అండ్‌ వర్కింగ్ కండిషన్స్ కోడ్‌లో భద్రతా ప్రమాణాలను పాటించనపుడు తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టత లేదు. ఒక అంచనా ప్రకారం 40,000 మంది కార్మికులు తాము పని చేసే ప్రదేశంలో ప్రతీ సంవత్సరం చనిపోతున్నారు. మహిళలకు అన్ని రంగాలలో ఉపాధికి అనుమతి ఇవ్వాలని కోడ్ చెప్తుంది. మహిళల సమ్మతితో వారిని ఉదయం 6 గంటల కన్న ముందు మరియు రాత్రి ఏడు గంటల తర్వాత పనిచేయడానికి కోడ్ అనుమతిస్తుంది. అయితే మహిళల రక్షణ కొరకు తీసుకోవాల్సిన భద్రత గురించి కోడ్ ఏమి మాట్లాడదు. భద్రతా చర్యలు లోపించినపుడు యాజమాన్యాలకు విధించాల్సిన జరిమానాల గురించి కోడ్ ఏమీ చెప్పదు.

కార్మిక చట్టాలను బలహీనం చేయడమే కాకుండా, ఉన్న చట్టాల అమలు ప్రక్రియలను, తత్సంబంధిత యంత్రాంగాలను ఈ కోడ్‌లు బలహీనపరుస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాల అమలుకు కార్మిక సంఘాలు అడ్డంకిగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని కార్మికులు ఈ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలు చేస్తున్నారు. ఈ కారణంగా కార్పొరేట్ వర్గాలు ఆశిస్తున్న రీతిలో ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలను వేగవంతంగా అమలు చేయలేకపోతున్నాయి. కార్మిక సంఘాల అస్తిత్వాన్ని దెబ్బ తీస్తే తప్ప తమకు నచ్చిన రీతిలో యథేచ్ఛగా ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం సాధ్యం కాదు. ఆ విస్తృత కుట్రలో భాగంగానే 29 కార్మిక చట్టాలను సాధ్యమైనంతగా నిర్వీర్యం చేసి, ఈ నాలుగు లేబర్ కోడ్‌లనూ వండివార్చారు.

RELATED ARTICLES

Latest Updates