కుల అహంకార హత్యలను ఆపలేమా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కోడెపాక కుమారస్వామి, సామాజిక విశ్లేషకుడు.

ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏండ్లు గడిచినా ఏదో ఒక చోట ఇప్పటికీ కుల అహంకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛతో జీవించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనందరికీ కల్పించగా.. ఆర్టికల్‌‌ 17 అంటరానితనాన్ని దూరం చేసింది. కులరహిత సమాజంగా దేశం మారాలని, పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగిపోవాలనేది రాజ్యాంగం అంతిమ లక్ష్యం. కానీ ఇప్పటికీ ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మనం ఆమడ దూరంలో ఉన్నాం .

ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త  సైమన్ వేయిల్ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి స్పందిస్తూ.. “Liberty, taking the word in its concrete sense consists in the ability to choose” అని చెప్పారు. మరో తత్వవేత్త జోసెఫ్. జె. ఎల్లిస్ వ్యక్తిగత గౌరవం / పరువు గురించి మాట్లాడుతూ.. “We don’t live in a world in which there exists a single definition of honour any more, and it’s a fool that hangs on to the traditional standards and hopes that the world will come around him” అని పేర్కొన్నారు.

నానాటికీ పెరుగుతున్న దాడులు
పురాతన ఆచార, సంప్రదాయాలు మానవాళి మనుగడను అభివృద్ధి పథంవైపు నడిపించేలా ఉండాలే కానీ సంప్రదాయాల చుట్టూ అవివేకంగా తిరిగేలా చేయకూడదు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు, చేసుకోవడానికి సిద్ధపడిన వారిపై, వారి కుటుంబ సభ్యులపై హత్యలు, దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా నయా క్షత్రియ కులాల (నేటి పాలక కులాలు), దళిత -బహుజన కులాల మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలోనే హత్యలు, దాడులు జరుగుతున్నాయి.

ప్రత్యేక చట్టం లేదు
కుల అహంకార హత్యల కట్టడికి ప్రత్యేక చట్టం లేని కారణంగా ఐపీసీలోని కొన్ని సెక్షన్ల ప్రకారం సాధారణ హత్యగానే కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడే హంతకులకు స్వేచ్ఛ లభించినట్లు అవుతోంది. దోషులు బెయిల్ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై నిర్భయ చట్టం ప్రకారం కేసును నమోదు చేస్తే.. దోషులు బెయిల్ పొందే అవకాశం ఉండదు. కాబట్టి నేరాలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని ఎప్పుడో చెప్పారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2018లో శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో కుల అహంకార హత్యల నివారణ, విచారణ చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

1) దేశంలో గత ఐదేండ్లలో జరిగిన హత్యలను జిల్లాల వారీగా లెక్కించి ఆయా జిల్లాల్లో ప్రత్యేక నిఘా, నివారణ చర్యలు చేపట్టాలి

2) ప్రతి జిల్లాలో 24 గంటల హెల్ప్​ లైన్​ సెంటర్లను ఏర్పాటు చేయాలి

3) కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వారిని గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి.

4) అధికారుల నిర్లక్ష్యం కారణంగా హత్యలు జరిగితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై దిశానిర్దేశం చేసింది. అయినప్పటికీ దేశంలో ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య కులం. కుల నిర్మూలనతో ఆ సమస్యను పరిష్కరించకుండా దేశం అభివృద్ధి చెందే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇండియాను కుల వ్యవస్థ, సామాజిక అసమానతలు కలిగిన దేశంగా ప్రపంచ దేశాలు శాశ్వతంగా గుర్తించే ప్రమాదం ఉంది. కేకే భాస్కరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, నందిని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్​గఢ్​ కేసుల్లో 2011లో ఇచ్చిన తీర్పులో రాజ్యాంగంలోని పలు అంశాలను సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది.

కుల వ్యవస్థను నిషేధించాలి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక భద్రత కల్పించడంలో భాగంగా 1989లో అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే కుల నిర్మూలన జరగాలన్నా, కుల అహంకార హత్యలను కట్టడి చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేయడం అత్యంత ఆవశ్యకం. ఆర్టికల్ 17–ఎ ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దీనిని ప్రధానాంశంగా తీసుకుని, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ముందుకు రావాలి. ప్రత్యేక చట్టం ద్వారా కులాంతర, మతాంతర వివాహాల పరిరక్షణకు నాన్ బెయిలబుల్ చట్టాన్ని అమలులోకి తేవాలి. లేకపోతే ఎన్నేండ్లు గడిచినా ఇండియా ప్రజలు కలలు కంటున్న కుల రహిత సమాజం కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇండియాలో అసమానతలు ప్రపంచంలో ఎక్కడా లేవు
మనదేశంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతో కూడిన సామాజిక అసమానతలు ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించవు. కుల నిర్మూలనే లక్ష్యంగా మన రాజ్యాంగ నిర్మాణం మొదలైంది. కానీ మనదేశంలో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు కులం, మతం, కుటుంబం ఆధారంగా చేసుకొని ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని కాపాడడం కంటే అధికారంలోకి రావడమే పరమావధిగా వీరి రాజకీయాలు సాగుతున్నాయి. కులాలు, మతాలు ఓట్లు కాసే చెట్లుగా సజీవంగా ఉండాలనేది వీరి లక్ష్యంలో భాగమైపోయింది. ఫలితంగా నేడు దేశ రాజకీయాలు గుప్పెడు కుటుంబాల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి.

ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. కేంద్ర ప్రభుత్వం 2013లో లా కమిషన్ 242వ నివేదిక ఆధారంగా ప్రేమ వివాహం చేసుకున్న వారిపై దాడులు, హత్యల నివారణకు ప్రత్యేక  చట్టాన్ని ప్రతిపాదించింది. ఆ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే పనిలో ఉంది. ఆ చట్టాన్ని అమలులోకి తేవడానికి ఎన్నేండ్లు పడుతుందో స్పష్టత లేదు.

Courtesy V6Velugu

RELATED ARTICLES

Latest Updates