ఉత్తరప్రదేశ్ విద్యుత్ కార్మికుల పోరాట విజయం – అనుభవాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ప్రేమ్‌నాథ్‌ రాయ్ & ప్రశాంత్‌నంది చౌదరి

ఉత్తర ప్రదేశ్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సుమారు 15లక్షల మంది కార్మికులు అక్టోబరు 5 నుంచి సమ్మెలో ఉన్నారు. పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీని ప్రయివేటీకరించేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రయత్నాలను విరమించుకోవాలన్నది కార్మికుల డిమాండ్‌. కాంట్రాక్టు కార్మికులు, శాశ్వత కార్మికులు, జూనియర్‌ ఇంజనీర్లు, సబ్‌ డివిజనల్‌ అధికారులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు మొదలు అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ కార్మికుల ఐక్య సంఘటన పేరుతో ఏకమయ్యారు. పోరాటబాట పట్టారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఐదు పాలనా మండళ్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీ పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ. విధుల బహిష్కరణ ఉద్యమం నేపథ్యంలో యోగిఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించటానికి ఎన్టీపీసీ, బీహెచ్‌ఇఎల్‌ వంటి వివిధ సంస్థల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో ఇంజనీర్లను నియమించింది. భారీఎత్తున పోలీసు బలగాలను మొహరించింది. అవసరమైతే రంగంలో దిగటానికి సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచింది. విద్యుత్‌ పంపిణీ ప్రధాన కేంద్రాలన్నిటా జిల్లా స్థాయి ఉన్నతాధికారులను ప్రత్యక్షంగా మొహరించింది. కార్మిక సంఘాల ఐక్యతను విచ్చిన్నం చేసేందుకు ఐక్యసంఘటన లోని కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చల తాయిలం చూపింది. ఈ ఐక్యసంఘటనలో ఆరెస్సెస్‌ అనుబంధ బిఎంఎస్‌ కూడా భాగస్వామిగా ఉంది. అయినా ఉద్యమం తీవ్రత రీత్యా ఏ సంఘమూ స్వతంత్రంగా చర్చలకు వెళ్లటానికి సిద్ధపడలేదు. చివరకు అక్టోబరు రెండు నుంచి ఐదు వరకు ఐక్యకార్యాచరణ సమితితో ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపింది. ఆఖరి నిముషంలో ముసాయిదా ఒప్పందంపై సంతకం చేయవద్దని విద్యుత్‌ శాఖ మంత్రి చర్చల్లో పాల్గొంటున్న అధికారులను ఆదేశించటంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో విధుల బహిష్కరణ కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, పంపిణీ కేంద్రాలన్నింటిలో పని స్తంభించిపోయింది. బయటి నుంచి తాత్కాలికంగా కాంట్రాక్టుకు వచ్చిన సిబ్బంది విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగిం చటంలో విఫలమయ్యారు. దాంతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మరో దఫా చర్చలు ప్రారంబించి అక్టోబరు ఆరో తేదీ సాయంత్రం మూడున్నరకు ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అదే రోజు సాయంత్రం విధులు బహిష్కరణ పిలుపును కార్మికసంఘాలు ఉపసంహరించుకున్నాయి.

చారిత్రక ఒప్పందం
ప్రభుత్వానికి, కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితికి మధ్య కుదిరిన ఒప్పందంలో ఉన్న విషయాలు ఇలా ఉన్నాయి. 1. పూర్వాంచల్‌ విద్యుత్‌ ప్రయివేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకొంటోంది. 2. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ఐదు డివిజన్లలో విద్యుత్‌ పంపిణీ చేసేందుకు పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ తప్ప మరో మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకోవటం లేదు. 3. ఇప్పుడున్న సంస్థ ద్వారానే ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని మరింతగా విశ్వాసంలోకి తీసుకుంటూ విద్యుత్‌ పంపిణీ సేవలు మెరుగ్గా అందించేందుకు ప్రయత్నిస్తాం. 4. ఉద్యోగులు, సిబ్బంది, ఇంజనీర్లను విశ్వాసంలోకి తీసుకోకుండా ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ సేవల ప్రయివేటీకరణ ప్రయత్నాలు చేయబోము. సమ్మెలో ఉన్న కార్మికులపై పెట్టిన అన్ని కేసులు ఉపసంహరించుకుంటున్నాం. వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోవటం లేదు.

పార్లమెంట్‌లో ఆమోదానికి సిద్ధంగా ఉన్న 2020 విద్యుత్‌ చట్టం, కోవిడ్‌ నేపథ్యంలో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రయివేటీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యుత్‌ కార్మికుల సమరశీల పోరాటాల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి, కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితికి మధ్య కుదిరిన ఈ ఒప్పందం చారిత్రాత్మకం.

మూలాలు
విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోడీ, ఆయన కేబినెట్‌లోని విద్యుత్‌ మంత్రి ఆర్కె సింగ్‌ విద్యుత్‌ రంగాన్ని సంపూర్ణంగా ప్రయివేటీక రించేందుకు పావులు కదుపు తున్నారు. విద్యుత్‌ బిల్లు 2020 ముసాయిదా చట్టాన్ని విడుదల చేసి మే 5లోగా తమ తమ అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్రం కోరింది. జూన్‌ 1న ఈ ముసాయిదా చట్టానికి వ్యతిరేకంగా విద్యుత్‌ కార్మికులు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ గడువు జూలై చివరి వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్‌ ఉద్యోగుల సంఘాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లు పట్ల అనేక అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ ముసాయిదా బిల్లును అలా ఉంచి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం విద్యుత్‌ ప్రయివేటీకరణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ సలహా మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీని ప్రయివేటీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ కార్మికులు ఆగస్టు 28న ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఛైర్మన్‌కు విజ్ఞాపన సమర్పించారు. ఈ చర్చల సందర్భంగా పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ 41శాతం నష్టాల్లో ఉందని, అందువల్ల దీన్ని మూడు ముక్కలు చేయకతప్పదని స్పష్టం చేశారు. ఈ మూడు ముక్కలను ప్రయివేటీకరించ నున్నామని కూడా స్పష్టం చేశారు.

ఆందోళన హెచ్చరికలు
ఆగస్టు 24న విద్యుత్‌ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి సమ్మె నోటీసు ఇచ్చింది. సెప్టెంబరు 1-18 మధ్య కాలంలో పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ అన్ని కార్యాలయాలు, కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ జన్మదినోత్సవం సందర్భంగా టార్చ్‌లైట్‌ ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసన ప్రదర్శనలను చెదరగొట్టటానికి బీజేపీ ప్రభుత్వం చేయని దాష్టీకం లేదు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ కార్మికులు జైల్‌ భరో ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన కార్మికులను ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 29న మూడు గంటల పాటు విధుల బహిష్కరణకు ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. అక్టోబరు ఐదు నుంచి నిరవధిక విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది.

తొలి ఒప్పందం
అక్టోబరు 6న కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రయివేటీకరణ ప్రయత్నాల నేపథ్యంలో రెండో ఒప్పందం. అంతకు ముందు 2017లో గోరఖ్‌పూర్‌, లక్నో, వారణాసి, మొరాదాబాద్‌, మీరట్‌ నగరాలతో పాటు మరో ఏడు జిల్లాల్లో సమీకృత విద్యుత్‌ సేవల సరఫరా పేరుతో విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరిస్తూ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐక్య కార్యాచరణ సమితి 2018 ఏప్రిల్‌ 5న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ ఉపసంహరించుకుంటూ ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో కూడా పైన చెప్పిన మూడు, నాలుగు పాయింట్లు యధాతధంగా రికార్డు చేయబడ్డాయి.

పాఠాలు
పూర్వాంచల్‌ విద్యుత్‌ పంపిణీ కంపెనీ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి రావటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపదెబ్బ. ఆత్మ నిర్భర భారత్‌ నినాదం వెనక ప్రయివేటీకరణను ముందుకు తీసుకెళ్లటమే మోడీ అసలు ఫథకం. ఈ పోరాటం ఆత్మనిర్భర భారత్‌ నినాదం ముసుగు తొలగించింది. ఈ పోరాటం కేవలం ఉత్తర ప్రదేశ్‌ విద్యుత్‌ కార్మికులకు విజయం మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం సాగించే ప్రయివేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాట పథంలో ఉన్న కార్మికోద్యమానికి ఈ విజయం ఓ సానుకూల వార్త. భరోసా ఇచ్చే పరిణామం. అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల మధ్య ఐక్యత సాధించగలగటమే ఈ విజయానికి పునాదిగా ఉంది. బొగ్గు గని కార్మికులు కూడా ఈ తరహా ఐక్యతను ప్రదర్శించారు. ఈ రెండు పోరాటాల్లో వ్యక్తమయ్యే వర్గ ఐక్యత ఒకే రీతిలో ఉంది.

విద్యుత్‌ కార్మికులు ఐకమత్యంతో యోగి మాజిక్‌ని తిప్పికొట్టారు. అదే తరహాలో మోడీ మాజిక్‌ను తిప్పికొట్టాల్సిన బాధ్యత దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఉన్న కార్మికవర్గంపై ఉంది. అక్టోబరు 2న జరిగిన జాతీయ కార్మిక సదస్సులో భాగస్వాములైన 15లక్షల మంది కార్మికులు మోడీ ప్రభుత్వానికి ఈ సవాలు విసిరారు. ఈ దిశగా నవంబరు 26న జాతీయ సమ్మెకు కార్మికవర్గం సిద్ధమవుతోంది.

ఈ ఉద్యమ అనుభవాల ఆధారంగా జాతీయ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల సమన్వయ సమితి కేంద్రం ప్రతిపాదించిన 2020 ముసాయిదా విద్యుత్‌ చట్టాన్ని రద్దు చేయటంతో పాటు ఓ స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ పత్రాన్ని కూడా రూపొందించాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిడి చేసే హక్కు కేంద్రానికి లేదు. ఈ విద్యుత్‌ ఉద్యమం విద్యుత్‌ రంగపు సామాజిక ఆర్థిక స్వభావాన్ని చర్చకు తెచ్చింది. జాతీయ స్థాయిలో స్థాండర్డ్‌ బిడ్డింగ్‌ పత్రం సాధించే దిశగా రానున్న కాలంలో విద్యుత్‌ రంగ కార్మికులు మరింత సమరశీల పోరాటాన్ని ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

Latest Updates