కరోనా కాలంలో కోల్పోయిన పనిగంటలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

అంతర్జాతీయ కార్మికసంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌: ఐఎల్‌ఓ) కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే ప్రమాద హెచ్చరికలను, ముఖ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన దుష్ఫలితాల వలన కోల్పోయిన పని గంటల గురించి తెలిపే నివేదికను కొన్ని నెలలుగా తయారు చేస్తూవుంది. ఈ నివేదిక ఇచ్చిన గణాంకాలు, వివిధ దేశాలు అధికారికంగా అందజేసిన లెక్కల సంకలనం కాదు. ఈ గణాంకాలు ఆయా దేశాల వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ఆధారంగా తయారు చేశారు. అవి ఎంత ఖచ్చితమైన లెక్కలు అనేది ఏ ఒక్కరూ చెప్పలేరు. కానీ మన వద్ద ఉన్న సంఖ్యలు అవి మాత్రమే. వాటిని చాలా కూలంకషంగా అంచనా వేశారు. మన వద్ద ఉన్న డాటాకు ఇంచుమించు అనుకూలత ఆధారంగా మనం ఒక నిర్ధారణకు రావచ్చు. కోల్పోయిన పని గంటలను 2019 నాల్గవ త్రైమాసికంలో కాలానుగుణంగా సర్దుబాటు చేసే ఒక నిర్థిష్టమైన ఆధారరేఖ నుంచి లెక్కించాలి. ఈ ఆధార రేఖతో పోల్చినప్పుడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, 2020 మొదటి మూడు త్రైమాసికాలలో మొత్తంగా 5.6శాతం, 17.3శాతం, 12.1శాతం పని గంటల నష్టాన్ని గమనించింది. మొత్తం మూడు త్రైమాసికాలు కలిసిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పని గంటల నష్టాన్ని తీసుకుంటే 11.7శాతంగా ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో 2020 మొదటి మూడు త్రైమాసికాలలో శ్రమ గంటల నష్టం వరుసగా 3.1, 27.3, 18.2శాతాలుగా ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అన్ని ప్రాంతాల కన్నా ఘోరంగా దెబ్బతిన్న ”లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాల” తరువాత బాగా దెబ్బతిన్నది దక్షిణాసియా ప్రాంతమే.

ఈ వాస్తవాన్ని ఇతర సంఖ్యలు కూడా తెలియజేస్తాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ, కోల్పోయిన పని గంటలను కార్మికులు నష్టపోయిన ఆదాయంగా వివరిస్తుంది. మూడు త్రైమాసికాలను కలిపి తీసుకుంటే లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాలు కోల్పోయిన శ్రమ ఆదాయం 19.3శాతంగా ఉంటే, దక్షిణాసియా ప్రాంతం 16.2శాతంగా ఉంది. ఈ సంఖ్యలు ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతం కన్నా ఎక్కువ. వాస్తవానికి, ప్రపంచంలో మొత్తంగా కోల్పోయిన శ్రమ ఆదాయం 10.7శాతం కన్నా ఎక్కువ లేదు. భారతదేశం చాలా పెద్ద దేశంగా ఉన్న కారణంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆదిపత్యం చెలాయించడం, మనందరికీ తెలిసినట్టు పాకిస్థాన్‌తో పాటు మన పొరుగు దేశాల్లో కరోనా మహమ్మారి చాలా తక్కువ ప్రభావాన్ని చూపడం, దానిని ఎదుర్కొనేందుకు చాలా తక్కువ కఠిన చర్యలనే తీసుకోవడం వల్ల దక్షిణాసియా ప్రాంతంలో అసాధారణంగా భారీగా ఆదాయ నష్టం భారతదేశం వల్లే పెరిగింది. ప్రపంచంలో ఘోరంగా ఆదాయ నష్టాలు జరిగిన వాటిలో, భారతదేశంలోని కార్మికులకు జరిగిన ఆదాయ నష్టం కూడా ఒకటి. ఆ తరువాత లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాలు ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాలు, ప్రపంచంలో కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో వైఫల్యం చెందిన అసమర్థ ప్రభుత్వాలలో మోడీ ప్రభుత్వం ఒకటి అని కొంత కాలంగా అనేకమంది పేర్కొనడాన్ని నిర్ధారిస్తాయి.

అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించిన ఆదాయ నష్టం గణాంకాలు, ఆయా దేశాలు ప్రకటించిన ఆర్థిక సహాయ చర్యలు తీసుకోవడానికి ముందు లెక్కించారు. వాస్తవానికి, కరోనా మహమ్మారి కారణంగా కార్మికులను దెబ్బ తీసిన ఆదాయ నష్టాన్ని నిలువరించేందుకు వివిధ ప్రభుత్వాలు సమకూర్చిన ఆర్థిక ఉద్దీపనలను ఐఎల్‌ఓ లెక్కించింది. ఆర్థిక ఉద్దీపన అంటే ప్రభుత్వ అదనపు వ్యయం, ఆదాయ బదిలీలతో కూడుకొని ఉంటుంది అని ఐఎల్‌ఓ నిర్వచించింది. ఐఎల్‌ఓ అధ్యయనంలో కనుగొన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువ ఆర్థిక ఉద్దీపనలే జీడీపీ శాతంగా ఉన్న దేశాలు తక్కువ శ్రమ గంటల నష్టశాతాన్ని కలిగి ఉన్నాయి. ఐఎల్‌ఓ ఈ విలోమ సంబంధానికి ఏ విధమైన వివరణ ఇవ్వలేదు, కానీ అది కనుగొనలేనంత కష్టం కాదు.

ఒకవేళ లాక్‌డౌన్‌ కారణంగానే మొత్తం శ్రమ గంటల నష్టం జరిగితే, అంటే ఇది ప్రభుత్వ ఆదేశానుసారం ”సప్లై-వైపు” నుంచే ఉత్పన్నమైతే, అప్పుడు అటువంటి నష్టానికి, ఆర్థిక ఉద్దీపన పరిమాణానికి మధ్య ఎందుకు విలోమ పరస్పర సంబంధం ఉంది అనడానికి ఏ విధమైన కారణం ఉండదు. అప్పుడు నష్టం యొక్క తీవ్రత మొత్తం లాక్‌డౌన్‌ యొక్క కఠినత్వంపై ఆధారపడి ఉంటుంది కానీ ఆర్థిక ఉద్దీపన పరిమాణంపై కాదు. కానీ లాక్‌డౌన్‌ కూడా డిమాండ్‌ వైపు నుంచి ”అనేక” ప్రభావాలను కలిగి ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఒకవేళ ఆదాయ నష్టం ఉంటే, అప్పుడు ప్రజలు కొన్ని సేవల డిమాండ్‌ను తగ్గించుకుంటారు. లాక్‌డౌన్‌ కాలంలో అనుమతించబడే క్షవరశాలలు, తినుబండారాల దుకాణాలు, రిపైర్‌ చేసే షెడ్ల లాంటి సేవలను వినియోగించుకోరు. ఒకవేళ ఈ సేవలను అందించే వారు తమ దుకాణాలను మూసివేస్తే, దానికి కారణం లాక్‌డౌన్‌ కఠినతరమైన నిబంధనలు కాదు, కానీ లాక్‌డౌన్‌ యొక్క కఠినతరమైన నిబంధనల వలన (పరోక్షంగా) తగ్గిన డిమాండే కారణం. ”సప్లై-వైపు” (లాక్‌డౌన్‌ ఆంక్షలు) నుంచి విధించబడిన ఆదాయ నష్టం, తరువాత డిమాండ్‌ వైపు నుంచి విధించే ఆదాయ నష్టం చేత పరిపూర్తి చేయబడుతుంది.

ఇక్కడే ఆర్థిక ఉద్దీపన వస్తుంది. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు కోల్పోయిన ప్రజల చేతిలో కొంత కొనుగోలు శక్తిని ఇస్తుంది. ఆ విధంగా లాక్‌డౌన్‌ వలన పెరిగిన అనేక ప్రభావాలను డిమాండ్‌ వైపు నుంచి తగ్గిస్తుంది. జీడీపీకి సంబంధించి ఆర్థిక ఉద్దీపన పరిమాణం పెద్దదిగా ఉన్నప్పుడు, లాక్‌డౌన్‌ వల్ల కలిగే అనేక ప్రభావాలు తక్కువగా ఉంటాయి. అందుకే దానికి తగినట్లుగానే పని గంటల నష్టం ఉంటుందని ఐఎల్‌ఓ అధ్యయనం కనుగొంది.

ఐఎల్‌ఓ అధ్యయనం ఆర్థిక ఉద్దీపన పరిమాణం పని గంటల నష్టానికి గల సంబంధాన్ని అంచనా వేస్తుంది. ఇది కోల్పోయిన పని గంటలను, పూర్తి కాలపు ఉద్యోగానికి సమానమైనదిగా మార్పు చేస్తుంది. అదేవిధంగా ఇది ఆర్థిక కార్యకలాపాల విస్తరణను అంచనా వేయడం ద్వారా, ఆర్థిక ఉద్దీపనను పూర్తి కాలపు ఉద్యోగానికి సమానమైనదిగా మార్పు చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న నిష్పత్తి, కోల్పోయిన పని గంటల పరిమాణానికి సాపేక్షంగా ఆర్థిక ఉద్దీపన యొక్క పరిమాణాన్ని ఇస్తుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ”లాటిన్‌ అమెరికా, కరీబియన్‌”, ”సబ్‌- సహారన్‌ ఆఫ్రికా”లను ఒకే ప్రాంతంగా తీసుకుంటే, పని గంటల నష్టానికి సాపేక్షంగా ఆర్థిక ఉద్దీపన పరిమాణం దక్షిణాసియా ప్రాంతం చాలా తక్కువగా కలిగి ఉంది. ఈ విషయంలో దక్షిణాసియా ప్రాంతంలో ఇంత తక్కువగా ఆర్థిక ఉద్దీపనకు సంబంధించిన రికార్డు ఉండడానికి ప్రధాన కారణం భారతదేశం యొక్క ఆర్థిక లోభితనమే.

ఈ నిర్ధారణలో రెండు స్పష్టమైన చిక్కులున్నాయి. మొదటిది, భారతదేశంలో ఉపయోగంలేని ఆర్థిక ఉద్దీపన, లాక్‌డౌన్‌ ప్రత్యక్ష ప్రభావాల వల్ల ప్రాథమికంగా జరిగిన నష్టాలను పెంచడం ద్వారా పనిగంటల నష్టాన్ని మరింత అధ్వాన్నంగా మార్చేసింది. ఇది భారతదేశంలో చాలా తీవ్రంగా ఉంది. రెండవది, ఆర్థిక ఉద్దీపన, పని గంటల నష్టంపై ప్రభావం చూపడంతో పాటు కార్మికులకు ఆదాయాన్ని సమకూర్చుతుంది. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభంలో కార్మికుల అవసరాలను తీర్చే ఒక సాధనంగా ఇది ఉంటుంది. అందువలన భారత ప్రభుత్వం యొక్క కాఠిన్యత గర్హనీయమైనది. ఈ ప్రభుత్వం శ్రామిక ప్రజలను రెండు విధాలుగా గాయపరిచింది. అప్పటికే ఉన్న పాశవికమైన లాక్‌డౌన్‌ను మరింత తీవ్రం చేయడం ద్వారా, అవసర సమయంలో తగిన తోడ్పాటును అందించకుండా ఉండడం ద్వారా శ్రామిక ప్రజలను గాయపరిచింది. ఇది భారత ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వమే కాక, కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచంలో ప్రజలను అంతగా పట్టించుకోని ప్రభుత్వాలలో ఒకటిగా ఉందని రుజువు చేస్తున్నది.
వరుస కేంద్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ వస్తున్న విధంగా భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని అనుకుంటున్నాం. ఉపయోగంలేని ఆర్థిక ఉద్దీపనను, ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తూ ఏ విధమైన సహాయం చేయని ప్రభుత్వ తీరుకు ఆపాదించవచ్చు. కానీ ఇతర అనేక మూడవ ప్రపంచ దేశాలకు సంబంధించి ఈ విషయంలో వాటికి చాలా కొద్ది అవకాశమే ఉన్నది. ఐఎల్‌ఓ నివేదిక, ఆర్థిక ఉద్దీపన యొక్క సాపేక్ష పరిమాణం మూడో ప్రపంచంలో చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. నయా ఉదారవాద యుగంలో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు, తగినంత ఆర్థిక ఉద్దీపన కోసం అదనంగా బయట అప్పు చేసే స్థితికి దిగజారి పోయాయి. ఆ అప్పు కూడా అందుబాటులో ఉండదు.

అందువలన కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌, దాని ఫలితంగా నెలకొన్న పని గంటల నష్టానికి వివిధ దేశాలు ప్రకటించిన ఆర్థిక సహాయం చాలా వైవిధ్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు, ముఖ్యంగా కార్మికులకు చాలా ఉదారంగా ఆర్థిక మద్దతు ప్రకటిస్తూ ఉండగా, మూడో ప్రపంచ దేశాలు చాలా లోభితనంగా ఉంటున్నాయి. ఈ వాస్తవ కారణంగా, మూడో ప్రపంచ దేశాల్లోని కార్మికులపై (అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే) కరోనా మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మూడో ప్రపంచ దేశాల విపత్తులు, అంతే తీవ్రతతో అభివృద్ధి చెందిన దేశాలను సందర్శించలేదు.
ప్రతిచోటా కార్మికులు చాలా బాధపడినారు. కార్మికులలోనే మూడో ప్రపంచ దేశాలకు చెందిన కార్మికుల ఇబ్బందులు మరింత తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచీకరణ యుగంలో మూడో ప్రపంచ దేశాల యొక్క స్వయంప్రతిపత్తిని కోల్పోయిన ఫలితమే ఈ తీవ్రత.

RELATED ARTICLES

Latest Updates