చరిత్రను తిరగ రాసే ప్రయత్నమా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
జియా ఉస్‌ సలామ్‌

భారత దేశ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ…మేథావులు, రాజకీయ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎజెండాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అక్టోబర్‌ 14, 2014న ప్రధాని నరేంద్ర మోడీ వినాయకుడికి సంబంధించిన ప్లాస్టిక్‌ సర్జరీ గురించి అశాస్త్రీయమైన ప్రకటన చేశారు. ‘మనం మహాభారతంలో కర్ణుడి గురించి చదివే ఉన్నాము. మనం లోతుగా ఆలోచించినట్లయితే మహాభారతంలో కర్ణుడు, తన తల్లి గర్భం నుండి జన్మించలేదని గ్రహిస్తాం.

దీనర్థమేమంటే జన్యు శాస్త్రం ఆనాడే ఉన్నదని భావించాలి. అందువల్ల కర్ణుడు తన తల్లి గర్భం వెలుపల పుట్టి ఉంటాడు. అదేవిధంగా మనం గణేష్‌ ను పూజిస్తాము’. మోడీ ముంబాయిలో వైద్య బృందంతో మాట్లాడుతూ, ఆనాడే ఒక ప్లాస్టిక్‌ సర్జన్‌ ఉండి ఉంటాడని, మానవుని శరీరంపై ఏనుగు తలను అమర్చి ప్లాస్టిక్‌ సర్జరీని ఆనాడే చేసి వుండవచ్చని చెప్పుకొచ్చారు. ఆనాటి నుండి చరిత్రకు, పురాణాలకు మధ్య ఉన్న వ్యత్యాసం మసకబారి పోయింది. తరచుగా చరిత్రను తిరగ రాసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
చరిత్రకు, పురావస్తు శాస్త్రానికి మధ్య ఉన్న అస్పష్టతను తొలగించేందుకు, భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ప్రకటించారు.

పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇస్తూ, భారతీయ సంస్కృతి పుట్టుక, పరిణామం గురించి సమగ్రమైన అధ్యయనం చేసేందుకు 16 మందితో ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. ఆ కమిటీ 12000 సంవత్సరాల నుండి నేటి వరకు ప్రపంచం లోని ఇతర సంస్కృతులతో సమన్వయం చేసేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. నియమించిన కమిటీలో కె.ఎన్‌.దీక్షిత్‌ (భారత పురావస్తు సొసైటీ అధ్యక్షులు, న్యూ ఢిల్లీ), ఆర్‌.ఎస్‌.బిక్ష్త్‌ (ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌), బి.ఆర్‌.మణి (ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ జనరల్‌), ప్రొ|| సంతోష్‌ శుక్ల (జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ సంస్కృతి ప్రత్యేక అధ్యయన కేంద్రం), రమేష్‌ కుమార్‌ పాండే (లాల్‌ బహదూర్‌ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠం), ప్రొ|| పి.ఎన్‌.శాస్త్రి (రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్‌ వైస్‌ ఛాన్సలర్‌), ఎం.ఆర్‌.శర్మ (సంఫ్‌ు మార్గ్‌ వరల్డ్‌ బ్రాహ్మిణ్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌),…తదితరులు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

దక్షిణ భారతదేశం నుండి ఒక్క ప్రతినిధిని కూడా నియమించకపోవడం ద్రవిడ సంస్కృతి ప్రాముఖ్యతను విస్మరించినట్లే అవుతుంది. కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేరు. అల్ప సంఖ్యాక వర్గాలైన ముస్లిం, క్రిష్టియన్‌, సిక్కుల నుండి ఒక్క ప్రతినిధిని కూడా కమిటీలో భాగస్వాములను చేయలేదు. పాలకవర్గం వివక్షతో కూడిన ‘ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే మతం’ అనే విభజిత ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకు వెళ్తూ, భారత దేశ బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని విస్మరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త నీరా ఛందోక్‌ ”రీ రైటింగ్‌ ప్లూరలిజం” అనే తన రచనలో భారత దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని పంచుకున్న విధానాన్ని ఆకర్షణీయంగా చర్చించారు. ఆమె ఇంకా ఇలా చెప్పారు. ”ప్రభుత్వ విధానాన్ని బట్టి సంస్కృతి యొక్క అర్థం ఆధారపడి ఉంటుంది. అసలు కమిటీ ఏర్పడింది భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికా? లేక హిందూ సంస్కృతిని అధ్యయనం చేయడానికా? అనేది ప్రశ్న. ఇది సమస్యాత్మకమైన వ్యవహారం. ప్రధానంగా ఆధారాలతో చరిత్రను అధ్యయనం చేయని వ్యక్తుల వల్ల, బోర్డులో అనుభవం ఉన్న చరిత్రకారులు లేకుండా వాస్తవ చరిత్ర రచన సాధ్యపడదు. ‘ఒకే దేశం, ఒకే సంస్కృతి’ అనేది ఒక అహంకార పూరితమైన భావన. నష్టం కలిగేందుకు అవకాశమున్న, సాహసంతో కూడిన వ్యవహారమది. భిన్న సంస్కృతులు, భిన్న మతాల సమాహారం మన దేశం. మన ప్రజలను అదే విధంగా ఎందుకు ఉంచకూడదు? కమిటీలో ఒక్క మహిళ కూడా లేకపోవడం, దక్షిణ భారతదేశం నుండి మైనారిటీల నుండి ప్రతినిధులు లేకపోవడం అనేది చర్చించ వలసిన అంశం. లౌకికతత్వమనే భావన మరొకసారి వైఫల్యం చెందినట్లు అనిపిస్తుంది”.

ప్రొఫెసర్‌ రొమిల్లా థాపర్‌ మాట్లాడుతూ కమిటీ గురించి ప్రభుత్వం నుండి గాని లేదా అధికారిక సంస్థ నుండి గాని తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ప్రసిద్ధ చరిత్రకారుడు డి.ఎన్‌.ఝా కూడా ”నేను వార్తా పత్రికల ద్వారానే తెలుసుకున్నాను. గమనించిన దాన్ని బట్టి కమిటీలో నియమించబడిన వ్యక్తులు సమతుల్యతను పాటించే వారు కాకపోగా, మితవాద భావనలను, భారతదేశ సనాతన ధర్మాలను ప్రోత్సహించే వ్యక్తులుగా ఉన్నారు. వారు ఉనికిలో లేని ‘హిందూ’ ఇండియాను కీర్తించడం కోసమే ఉపకరిస్తారు”.

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు సయ్యద్‌ అలీ నదీమ్‌, కమిటీ కూర్పును ప్రశ్నించారు. ఆయన మాటల్లోనే క్లుప్తంగా, ”ప్రభుత్వం అధ్యయనం కోసం కమిటీ ముందుంచిన తేదీలు సమస్యాత్మకమైనవి. ఆనాడు మనం మనుగడలో ఉన్నామో లేదో కూడా ఎవరికీ తెలియదు. చరిత్రకారులకు కూడా స్పష్టత లేని కాలాన్ని గూర్చి వీరు అధ్యయనం చేస్తారట! అంతేకాక కమిటీలో కొన్ని అనుమానితుల పేర్లున్నాయి. దళిత, ముస్లింలను మినహాయించినా, అర్హత కలిగిన వారు గాని, వివాద రహితులు, నిపుణులు గానీ ఈ కమిటీలో లేరు. వారంతా వివాదాస్పదమైన వ్యక్తులే. వారంతా సమతుల్యత లేని ఏకపక్ష జ్ఞానం కల్గినవారే. బి.ఆర్‌.మణి కావొచ్చు. మరెవరైనా కావొచ్చు. వారంతా ప్రత్యేకమైన ఆలోచనా దృక్పథం కలవారే. అందువల్లనే వారు కమిటీలో ఉండగలిగారు. ఒక పక్షాన్ని సమర్థించే వారు తప్ప మరొకటి కాదు”.

ప్రొ|| మఖన్‌లాల్‌ ను కమిటీలో నియమించడానికి గల కారణాలను ప్రొఫెసర్‌ రజ్వీ స్పష్టం చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో, మురళీ మనోహర్‌ జోషి మానవ వనరుల శాఖామంత్రిగా ఉన్నప్పుడు, ప్రొ|| మఖన్‌ లాల్‌ చరిత్ర పాఠ్య పుస్తకాలను తిరగ రాసే బాధ్యతను స్వీకరించారు. మైనారిటీలు గానీ, దళితులు గాని కమిటీలో లేరు. ప్రధానంగా పురావస్తు శాస్త్రజ్ఞులు మాత్రమే ఉన్నారు. ఎవరు చరిత్రకారులు? వారికి ఉన్న అర్హత ఏమిటి? ప్రొ|| మఖన్‌ లాల్‌ విషయానికి వచ్చేసరికి, జోషి మంత్రిగా ఉన్న సమయంలో యన్‌.సి.ఇ.ఆర్‌.టి పాఠ్య పుస్తకాలను తిరిగి రాయడంలో పేర్కొన దగినవాడు. అంతకంటే అతనిని గురించి చెప్పుకోదగినదేమీ లేదు.

అనేక మంది విద్యావేత్తల అభిప్రాయంలో, తమ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడానికే, ఈ కమిటీని ఏర్పాటు చేశారనే భావన ఉంది. పార్టీ విభేదాలతో సంబంధం లేకుండా పార్లమెంటు సభ్యులు తమ అభ్యంతరాన్ని తెలియజేస్తూ, కమిటీని రద్దు చేయవలసినదిగా రాష్ట్రపతిని కోరారు. 16 మంది అధ్యయన బృందంలో భారతదేశ సామాజిక వైవిధ్యం ప్రతిబింబించడం లేదని వీరు తమ వినతి పత్రంలో రాష్ట్రపతికి తెలియజేశారు. దక్షిణ భారతీయులుగాని, ఈశాన్య భారతం దేశం నుండి, మైనారిటీలు, దళితులు, మహిళల నుండి ప్రాధినిధ్యం లేదని పేర్కొన్నారు. పైన పేర్కొన్న కమిటీలో ఉన్న మెజారిటీ సభ్యులు నిర్దిష్టమైన సామాజిక బృందాలకు చెందిన వారుగా ఉన్నారు. భారతీయ సమాజం లోని ఆధిపత్య కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించారని లేఖలో పేర్కొన్నారు. కమిటీలో దక్షిణ భారత దేశానికి చెందిన పరిశోధకులు లేరు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన, ఘన చరిత్ర గల ప్రాచీన తమిళ భాషకు సంబంధించిన పరిశోధకులకు కూడా కమిటీలో స్థానం లేదు. మహిళా సంఘాల నుండి గాని, మైనారిటీ సంస్థల నుండి గానీ ఎలాంటి స్పందన లేదు. అయితే దేశం యొక్క భిన్నత్వాన్ని కమిటీ ప్రతిబింబించలేదు కాబట్టి కమిటీని రద్దు చేయాలని ద్రవిడ ఫోరమ్‌ల ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది.

కమిటీ ఏర్పాటు తమకు అనుకూలమైన తమ వర్గాలను సంతోషపరచడానికి తప్ప మరొకటి కాదని జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు రిజ్వాన్‌ క్వైసర్‌ అన్నారు. ఇది పాత ఆటను కొనసాగించడమే అన్నారు. రఖిగర్హి (హర్యానా, హిస్సార్‌)లో వెలువడిన తాజా ఫలితాలకు, భిన్నమైన వివరణలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇదేకాక అనేక విషయాల్లో కూడా వివిధ రకాలైన వివరణలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు అక్బర్‌ గురించి, తాజ్‌ మహల్‌ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తున్నారు. ఇలాంటి చరిత్ర ప్రజల్లో ఎలాంటి నమ్మకాన్ని కల్గించదు. అలాంటి కమిటీ నివేదిక చరిత్రకారుల పరిశీలనకు నిలబడదు. చరిత్రకు సంబంధించి కూడా తాము ఎంతో తీవ్రంగా కృషి చేస్తున్నామని నమ్మించడానికి, ప్రభుత్వం తమ వారికి చెప్పడానికి చేసే ప్రజా సంబంధాల వ్యవహారం మాత్రమే. కమిటీకి ఎలాంటి నిజాయితీతో కూడిన భావాలు లేవని భావిస్తున్నానని చెప్పారు. వారు వాస్తవంగా ముఖ్యమైనదని భావిస్తే ఒక చరిత్రకారుని నియమించి ఉండేవారు. వారు వాస్తవ దృష్టితో ఆలోచిస్తే తమ జీవితాలను చరిత్ర పరిశోధన కోసం త్యాగం చేసిన వారిని కమిటీలో నియమించి ఉండి ఉండేవారు. కాని, ప్రభుత్వం ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.

”భవిష్యత్తులో నివేదిక వచ్చినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ ప్రభుత్వం కరోనా మహమ్మారిని గురించి, ప్రజల బాధల గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని భావిస్తారు. తమను తాము సంతృప్తి పరచుకోవడం తప్ప ఎవరినీ సంతృప్తి పర్చరు”.

 (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో)

RELATED ARTICLES

Latest Updates