కరోనా కాలంలో పైకి ఎగబాకిన కుబేరులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

సంపద పంపిణీకి సంబంధించిన గణాంకాలకు భాష్యం చెప్పడం బహు క్లిష్టమైన పని. షేర్‌ మార్కెట్‌ గనుక వేగంగా పుంజుకుంటే సంపన్నులు మరింత సంపన్నులు అవుతారు. అదే ఆ మార్కెట్‌ హఠాత్తుగా పడిపోతే అంత హఠాత్తుగానూ వారి సంపద విలువ పడిపోతుంది. సంపన్నుల సంపదలో కొంతభాగం స్థిరాస్థుల రూపంలో, విలువైన వస్తువుల రూపంలో ఉండడంతోబాటు షేర్ల రూపంలో కూడా ఉంటుంది. స్థిరాస్థుల విలువ గంటల్లోనో, నిముషాల్లోనో మారిపోయేది కాదు కాని ఈ షేర్ల విలువ మాత్రం నిముషాల్లోనే తల్లక్రిందులవుతూవుంటుంది.

ఐతే కొన్ని కొన్ని కాలాల్లో సమాజంలో సంపద పంపిణీ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పగలం. ప్రస్తుత కరోనా మహమ్మారి కాలం అటువంటిదే. ఈ మహమ్మారి విజృంభించిన గత కొద్దినెలల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది శ్రామిక ప్రజలు ఉపాధినీ, ఆదాయాన్నీ తీవ్రంగా నష్టపోయి నానా అగచాట్లూ పడుతున్నారు. ఇదే కాలంలో ప్రపంచంలోని శత కోటీశ్వరులు మాత్రం తమ సంప దను పెద్ద ఎత్తున పెంచుకున్నారు. అంటే ఈ కాలంలో ప్రపం చంలో సంపద పంపిణీలో అసమానతలు మరింత పెరిగాయి.
అక్టోబరు 7వ తేదీన గార్డియన్‌ పత్రిక యుబి ఎస్‌ అనే స్విస్‌ బ్యాంకు వెల్లడించిన నివేదికను ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుండి జూలై మధ్య మూడు నెలల కాలంలో (ఈ మూడు నెలలూ కోవిడ్‌-19 విజృంభణ తారాస్థాయిలో ఉన్న కాలం) ప్రపంచంలోని శత కోటీశ్వరుల సంపద 27.5 శాతం పెరిగింది. జూలై మాసాంతానికి ఈ శతకోటీశ్వరుల సంపద ఏకంగా 10.2 లక్షలకోట్ల డాలర్లకు, లేదా 7.8 లక్షల కోట్ల పౌండ్లకు చేరింది. ( ఇది సుమారు రు.800 లక్షల కోట్లకు సమానం) దీనికన్నా ముందు అత్యధిక స్థాయి 2017 డిసెంబరులో ఉండింది. అప్పుడు వీరి సంపద విలువ 8.9 లక్షల కోట్ల డాలర్లు. ( అంటే సుమారు రు.700 లక్షల కోట్లు) అప్పటినుండి ఇప్పటికి ప్రపంచంలో శతకోటీశ్వరుల సంఖ్య 2158 నుండి 2189 కి పెరిగింది. వారి సంఖ్యలో పెరుగుదల పెద్దగా లేదు కాని వారి వద్దనున్న సంపద మాత్రం గణనీయంగా పెరిగింది. 2017 డిసెంబరు చివరినుండి 2020 జూలై మాసాంతానికి మధ్య కాలంలో శతకోటీశ్వరుల తలసరి సంపద 13 శాతం పెరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఒకటుంది. 2017 నుండి ఏప్రిల్‌ 2020 వరకూ క్రమంగా తగ్గుతూ వచ్చిన వీరి సంపద ఆ తర్వాత మూడు నెలల కాలంలోనే అమాంతం 27.5 శాతం పెరిగిపోయింది.

ప్రజానీకంలో అత్యధిక శాతం వద్ద సంపద దాదాపు ఏమీ ఉండదు. ఏ కాస్త ఉన్నా దాని విలువలో పెద్దగా హెచ్చు తగ్గులు ఉండవు. కాని స్టాక్‌ మార్కెట్‌ విషయం అటువంటిది కాదు. అక్కడ షేర్ల ధరలు పెరిగితే సంపదలో అసమానతలు పెరిగిపోతాయి. అలాగే, షేర్ల ధరలు పడిపోతే సంపదలో అసమానతలు తగ్గుతాయి. అందుచేత సంపద లోని అసమానతలు ఎంత మార్పుచెందాయనేది నిర్ధారించడం కష్టమైపోతుంది.

ఐతే, ఏప్రిల్‌ తర్వాత వచ్చిన మార్పు అలాంటిది కాదు. స్విస్‌బ్యాంక్‌ ప్రతినిధి చెప్పిన ప్రకారం, ఏప్రిల్‌ 2020 కి ముందు స్టాక్‌మార్కెట్‌ సూచీ పడిపోతూంటే ఈ శతకోటీశ్వరులు ఎటువంటి భయాందోళనలకూ లోనుకాలేదు. వారి వాటాలను ఆ కాలంలో అమ్ముకోలేదు. పైగా చిన్న చిన్న షేర్‌హోల్డర్లు బెదిరిపోయి తమ వాటాలను అమ్ముకొం టూవుంటే ఆ వాటాలనన్నింటినీ తక్కువ ధరలకు కొనేశారు. ఏప్రిల్‌ తర్వాత షేర్ల ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. దాంతో ఈ శత కోటీశ్వరుల వద్ద సంపద విలువ బ్రహ్మాండంగా పెరిగింది. చిన్న షేర్‌ హోల్డర్లు తమవద్ద షేర్లను అట్టిపెట్టుకునే సత్తా లేకపోవడంతో ఈ శతకోటీశ్వరులు ఈ విధంగా ప్రయోజనం పొందగలిగారు. అంటే ఈ మహమ్మారి కాలంలో శతకోటీశ్వ రులకు కడుపేదలకు మధ్య సంపద వ్యత్యాసం పెరగడమే కాదు, శతకోటీశ్వరులకు, చిన్న మదుపుదారులకు మధ్య సంపద అసమానతలు సైతం బాగా పెరిగాయి. ఇది ఏదో యాదృచ్ఛికంగా స్టాక్‌మార్కెట్‌లో షేర్ల ధరలలో వచ్చే మార్పుల వలన సంభవించినది కాదు. ఇది మార్క్స్‌ చెప్పిన పెట్టుబడి కేంద్రీకరణ క్రమం పర్యవసానం.

పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే ప్రతీ సంక్షోభమూ- అది ఆర్ధిక సంక్షోభం కాని, రాజకీయ సంక్షోభం కాని, పెట్టుబడి కేంద్రీకరణకు ఒక అవకాశంగా మారుతుందని లెనిన్‌ తన ”సామ్రాజ్యవాదం” గ్రంధంలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలకి తోడు వైద్యరంగ సంక్షోభాన్ని కూడా చేర్చాలి. ఇంకా చెప్పాలంటే అది ఏ తరహా కి చెందిన సంక్షోభమైనా కానీయండి, పెట్టుబడి కేంద్రీకరణకు అవకాశంగా మారుతుంది.

సంక్షోభ కాలంలో చిన్న పెట్టుబడిదారులు కుదేలవుతారు. తద్వారా పెట్టుబడి కేంద్రీకరణకు మార్గం ఏర్పడుతుంది. (చేతివృత్తిదారులవంటి తరగతులను కూడా సంక్షోభం దెబ్బతీస్తుంది కాని వారి వినాశనానికి మార్గం పెట్టుబడిదారీ ఆదిమ (ఆటవిక స్వభావం కల) సంచయం ద్వారాప్రధానంగా జరుగుతుంది తప్ప పెట్టుబడి కేంద్రీకరణ ద్వారా కాదు) చిన్న పెట్టుబడిదారులు దెబ్బతిన్నాక వారికి రుణాలిచ్చిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు దెబ్బ తింటాయి. వీటన్నింటినీ పెద్ద కంపెనీలు స్వాధీనమైనా చేసుకుంటాయి. లేకపోతే ఈ చిన్న సంస్థలు పూర్తిగా మూత పడడం వలన పెద్ద కంపెనీలకు మార్కెట్‌లో అదనపు అవకాశాలైనా ఏర్పడతాయి.

ఈ పద్ధతికి తోడు చిన్న చిన్న పెట్టుబడులను ఒక దగ్గర చేర్చి పెద్ద మోతాదులో కేంద్రీకరించడం జరుగుతుంది. బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్‌లు చేసేది ఇదే. పెట్టుబడి కేంద్రీకరణకు ఇదొక శక్తివంతమైన మార్గం.

ఈ కరోనా కాలంలో మనం ఇంకొక మార్గంలో పెట్టుబడి కేంద్రీకరణ జరగడాన్ని చూస్తున్నాం. ఈ సంక్షోభం తాకిడికి స్టాక్‌మార్కెట్‌లో వచ్చే ఒడిదుడుకులను తట్టుకునే శక్తి శతకోటీశ్వరులకు ఉన్నట్టు చిన్న చిన్న మదుపుదార్లకు ఉండదు. శత కోటీశ్వరులు మాత్రమే తట్టుకోగలుగుతారంటే అందుకు వారి ”ధైర్యం”, లేక ”తెగింపు”, లేదా వారి ”నిర్వహణా సామ ర్ధ్యం” వంటివి ఏవీ కారణాలు కావు. ఇటువంటి లక్షణాలు వారికున్నట్టు పెట్టుబడిదారీ పురాణాన్ని ప్రవచించే పండితులు ప్రచారం చేస్తూంటారు. కాని వారు తట్టుకోగల గడానికి కారణం వారి పెట్టుబడి సైజు చాలా పెద్దదిగా ఉండడమే.

వారి దగ్గర ఎక్కువ సైజులో పెట్టుబడి ఉంది గనుక స్టాక్‌ మార్కెట్‌లో ఏర్పడే ఒడిదుడుకులను ఎక్కువకాలం తట్టుకోగలు గుతారు. అంతగా చిన్న మదుపుదార్లు తట్టుకుని నిలబడలేరు. ఆ క్రమంలో వారి వద్దనుండి ఈ శతకోటీశ్వరులు వాటాలను చౌకగా చేజిక్కించుకుంటారు కూడా. ఈ శతకోటీశ్వరులు లాభపడేది వారు రిస్క్‌ తీసుకోడానికి సిద్ధపడినందువలన కాదు. దానికి విరుద్ధంగా ఎటువంటి రిస్క్‌నూ తీసుకోడానికి సిద్ధంగా లేనందువల్లనే వారు లాభపడతారు. ఇదే విచిత్రం.

వారు బాగా సంపన్నులు అయినందువల్ల ఆ సంపదే వారిని ఏ రిస్క్‌నూ తీసుకోనవసరంలేని స్థితిలో ఉంచుతుంది. అందువల్లనే వారు తమ సంపదను వైవిధ్యంకల వివిధ రూపాలలో పెట్టుబడులు పెడతారు. తద్వారా వారు తీసుకోవలసిన రిస్క్‌ ఏదైనా ఉంటే అది కనీస స్థాయిలో మాత్రమే ఉంటుంది. వారు పెట్టే పెట్టుబడులలో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు కేవలం ఒక తరహా పెట్టుబడి మాత్రమే. అందువలన ఆ స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు వారు ఏమీ గాభరా పడరు. చిన్న మదుపుదార్లు అలా కాదు. ఆ ఒడిదుడుకులకు వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు. ఈ చిన్న మదుపుదార్ల సంకట పరిస్థితిని పెద్ద పెట్టుబడిదారులు అవకాశంగా ఉపయోగించుకుంటారు. గత్యంతరం లేక చిన్న మదుపుదార్లు తమ స్టాక్‌లను అమ్ముకుం టారు. వాటిని చౌకగా కొని పెద్దవారు లాభపడతారు.

ఒక వంద రూపాయలు మదుపు చేయగల వ్యక్తి ఆ వంద నుండి అత్యధికంగా లాభం పొందాలని చూస్తాడు. తాను ఎక్కువ ప్రతిఫలం పొందడానికి ఆ సొమ్మును రిస్క్‌ ఉన్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌లో పెడతాడు. రిస్క్‌ తీసుకోవడం అతనికి ఇష్టమైనందువలన కాదు. అతనికి తన ఆదాయాన్ని పెంచుకోవడం అవసరం గనుక అలా సిద్ధపడతాడు. అదే ఒక కోటీశ్వరుడు తన సంపదలో సగం బ్యాంకుల్లో దాస్తాడు. తక్కిన సగం స్టాక్‌లలో పెడతాడు. సంపదను పెంచుకోవడం అతనికి అంత అత్యవసరమేమీ కాదు. అందువలన ఉన్న సంపదను కాచుకోడానికి ప్రాధాన్యతనిస్తాడు. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో 10 శాతం పతనం సంభవించిందనుకోండి. దానివలన రు. 100 స్టాక్‌లలో పెట్టినవాడు తన సంపదలో 10 శాతం నష్టపోతాడు. అదే కోటీశ్వరుడు తన మొత్తం సంపదలో సగం బ్యాంకుల్లో ఉంచాడు గనుక 5 శాతమే నష్టపోతాడు. ఆ 5 శాతం నష్టాన్నీ కోటీశ్వరుడు తట్టుకోగలుగుతాడు కాని రు.100 మదుపు పెట్టినవాడు అలా తట్టుకోలేకపోతాడు. మరింత నష్టపోకూడదని తన స్టాక్‌ను గత్యంతరంలేని పరిస్థితుల్లో అమ్ముకుంటాడు. దానిని కోటీశ్వరుడు చౌకగా కొని స్టాక్‌మార్కెట్‌ సానుకూలంగా మారేదాకా ఉంచుకుంటాడు.

పెట్టుబడిదారీ సమాజంలో స్టాక్‌మార్కెట్‌లలో ఎగుడుదిగుడులు మామూలే. ఐతే సంక్షోభకాలాల్లో మార్కెట్‌ పతనాలు మరీ తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలోనే పెద్ద మదుపుదార్లు కాచుకుని వుండి చిన్న మదుపుదార్ల స్టాక్‌లను చేజిక్కించుకుంటారు. పెట్టుబడి కేంద్రీకరణ అసాధారణమైన వేగంతో జరుగుతుంది.

పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభదశలో చిన్న ఉత్పత్తిదార్ల నిస్సహాయతను అవకాశంగా తీసుకుని పెట్టుబడి దారులే విధంగా బలపడ్డారో అదేవిధంగా ఇప్పుడు చిన్న మదుపు దారుల నిస్సహాయతను శతకోటీశ్వరులు అవకాశంగా తీసు కుంటున్నారు. రు. 100 విలువ గల షేర్‌ ను రు.100 కే న్యాయమైన ధరకు కొంటే శతకోటీశ్వరుడివద్ద అదనంగా సంప ద ఏమీ చేరదు. అలాగాక, స్టాక్‌ మార్కెట్‌ పతనమ వుతున్న సమయంలో రు. 100 విలువ గల షేర్‌ను రు.50 కే కొని అట్టిపెట్టుకుంటే తర్వాత ఆ షేర్‌ విలువ తిరిగి మామూలు స్థాయికి, అంటే రు.100 కి చేరినప్పుడు అతని వద్ద సంపద రు.50 అదనంగా పెరుగుతుంది. అదే సమ యంలో చిన్న మదుపుదారుడి వద్ద రు.50 మేరకు సంపద తగ్గిపోతుంది.

స్విస్‌బ్యాంకు ప్రతినిధి ఈ విధంగా మహమ్మారి కాలంలో సంపద కేంద్రీకరించబడడం అనేది పెట్టుబడిదారీ విధానానికి విరుద్ధం అన్నాడు. అంతకన్నా పొరపాటు అవగాహన ఇంకొ కటి ఉండదు. ఈ విధంగా సంపద కేంద్రీకరణ జరగడం అనేది పక్కాగా పెట్టుబడిదారీ సూత్రాలకు అనుగుణంగానే జరుగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతీ మానవ విషాదాన్నీ తన సంపదపెరుగుదలకు అనుగుణంగా ఉపయోగించు కుంటుంది.

ఈ సంపద కేంద్రీకరణ వరసగా ప్రతీ దేశంలోనూ, భారత దేశంతో సహా, జరుగుతోంది. మన దేశంలోని శతకోటీశ్వరులవద్ద సంపద ఇదే కాలంలో ఏకంగా 35 శాతం పెరిగింది. ఇప్పుడు వారివద్ద 423 బిలియన్ల డాలర్లు ఉన్నాయి.అంటే రు.33 లక్షల కోట్లు. ఇదే కాలంలో ఉత్పత్తి 25 శాతం తగ్గిపోయింది. నిరుద్యోగం కూడా అదే శాతం మేరకు పెరిగింది. అక్కడ సంపద పెరగడం, ఇక్కడ తరగడం- ఇదే పెట్టుబడిదారీవిధానం నడిచేతీరు.

CourtesyPrajashakti

RELATED ARTICLES

Latest Updates