ఇంటి పనివారల ఉపాధికి ముప్పు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ : కరోనాతో పాటు లాక్‌డౌన్‌తో ఇంటి పనివారల ఉపాధికి ముప్పు ఏర్పడినట్లు ఒక సర్వేలో వెల్లడైంది. వీరంతా అసంఘటిత రంగానికి చెందిన వారు కావడంతో వారి హక్కుల కోసం పోరాటం చేసేందుకు అవకాశం లేదని తెలిపింది. ఇంటి పనివారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇంటి పనివారల సంఘం (డిడబ్ల్యుఆర్‌యు), బృహత్‌ బెంగళూరు ఇంటి పనివారల సంఘం (బిబిజిఎస్‌), మంగెలసా కార్మికరలు సంయుక్తంగా ఒక సర్వేను చేపట్టాయి. లాక్‌డౌన్‌ అనంతరం మే మొదటి రెండు వారాల్లో పనికి రావద్దని చెప్పారని, తిరిగి యజమానులు పిలిచే అవకాశం కూడా లేదని 87 శాతం ఇంటి పనివారు తెలిపారు. 91 శాతం మందికి ఏప్రిల్‌లో జీతాలు చెల్లించలేదని, అలాగే 50 ఏళ్లు పైబడిన వారిలో సుమారు 50 శాతం మంది పని కోల్పోయినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే న్యూఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌ ట్రస్ట్‌ ఏప్రిల్‌ 23, 28 మధ్య టెలిఫోన్‌ ద్వారా సర్వే చేపట్టింది. సుమారు 83 శాతం మంది మహిళలు యజమానులు తమను పని నుండి తొలగించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

అదే సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో.. తమ పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారిందని వాపోయారు. భర్తలు కూడా పని కోల్పోవడంతో.. తామే కుటుంబాన్ని పోషించాల్సి వచ్చిందని 51 శాతం మంది పేర్కొన్నారు. ఇంటి పనులతో పాటు నిత్యావసరాలను తీసుకువచ్చే బాధ్యత కూడా తమపైనే పడిందని అన్నారు. 51 శాతం మంది మహిళలు.. ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాలు, కూరగాయలు కొనలేకపోయామని అన్నారు. మరికొంతమంది రేషన్‌ కూడా అందలేదని వాపోయారు. 57శాతం మంది ఇంటి పనివారు అద్దె చెల్లించడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మరో 36 శాతం మంది ఒంటరి మహిళలని, వీరిలో విడాకులు తీసుకున్నవారు, వితంతువులు ఉన్నట్లు తెలిపారు. స్థూల అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా 47 లక్షలకు పైగా ఇంటి పనివారలు ఉన్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదిక పేర్కొంది. విమెన్‌ ఇన్‌ అన్‌ఫార్మల్‌ ఎంప్లాయిమెంట్‌ (డబ్ల్యుఐఇజిఇఒ) ప్రకారం ఈ సంఖ్య 50 లక్షలకు పైగా ఉండవచ్చని పేర్కొంది.

ఇంటి పనివారికి సరైన వేతనాల చెల్లింపులు లేకపోవడం, పనినుండి తొలగించడం, మరో వైపు యజమానుల వేధింపుల వంటి వాటిపై దృష్టిసారించాల్సి వుందని రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ (ఆర్‌డబ్ల్యుఎ) పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అనంతరం వారి హక్కుల పరిరక్షణకై పోరాడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. దీంతో యజమానులు, ఇంటి పనివారి పేర్ల నమోదుతో పాటు వారి కోసం జాతీయ సమగ్ర చట్టాన్ని తీసుకురావాలంటూ ఆర్‌డబ్ల్యుఎ ఒక మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో పనిచేసే సుమారు 17 సంస్థలు, యూనియన్ల చేతుల మీదుగా ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఇంటి పనివారి శ్రేయస్సుకోసమని స్పష్టం చేశాయి.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates