ఊరికో వీఆర్‌ఏ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండాల్సిందే
  • జనాభా లేదా భూముల ప్రాతిపదికన నియామకం
  • వీఆర్‌ఏలకు స్కేల్‌ ఇచ్చి రెవెన్యూలోనే సర్దుబాటు
  • పోలీసు శాఖ మారింది.. రెవెన్యూ కూడా మారాలి
  • జరిగిందంతా మరిచిపోండి.. ఇకనైనా మారండి
  • నెలలో రెవెన్యూలో అన్ని స్థాయిల వారికీ పదోన్నతులు
  • కంప్యూటర్‌ ఆపరేటర్లను క్రమబద్ధీకరిస్తాం
  • త్వరలోనే సీసీఎల్‌ఏ నియామకం: సీఎం కేసీఆర్‌
  • రెవెన్యూ సంఘాలతో సమావేశమైన ముఖ్యమంత్రి

 హైదరాబాద్‌ : ‘‘ఏ విపత్తు వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థ అవసరం. ఇందుకు ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఒకరు ఉండాల్సిందే. జనాభా లేక భూముల విస్తీర్ణం.. ఏదో ఒక ప్రాతిపదిక తీసుకొని వీఆర్‌ఏలను గ్రామంలోనే పెడతాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అనంతరం కార్యాలయాల్లో ఖాళీలు ఏర్పడ్డాయని, అర్హులైన వీఆర్‌ఏలకు పే స్కేలు ఇచ్చి.. ఆయా కార్యాలయాల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు.

గ్రామంలో ఎంతమంది వీఆర్‌ఏలు ఉండాలనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ట్రెసా అధ్యక్షుడు వి.రవీందర్‌ రెడ్డిలకు సీఎం సూచించారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

ప్రజలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు శాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా, చిత్తశుద్ధితో కృషి చేయాలని నిర్దేశించారు. ఇకనుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. ‘‘పేద వర్గాలు, దిక్కు లేని అభాగ్యులే తహసీల్దార్‌ కార్యాలయాలకు వస్తుంటారు. అలాంటి వారి పట్ల కొందరు తహసీల్దార్లు అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. వారి సమస్యలను సానుకూలంగా విని.. పరిష్కరించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలను కడుపులో పెట్టుకున్నట్లుగా పనిచేయాలి’’ అని సీఎం సూచించారు.

ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, అదే ఉద్దేశంతో నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. ‘‘ప్రజల్లో చైతన్యం పెరిగింది. దానికి అనుగుణంగా పోలీసు శాఖలో మార్పు వచ్చింది. అదే తరహాలో రెవెన్యూ శాఖలో కూడా మార్పు రావాలి. ఇప్పటిదాకా జరిగిందంతా మరిచిపోండి. ఈరోజు నుంచి కొత్తగా ప్రారంభించాలి. మీ పనితీరులో స్పష్టమైన మార్పు కానరావాలి’’ అని నిర్దేశించారు.

దేవుళ్లుగా భావించే సంస్కృతి రావాలి
గతంలో గ్రామాల్లో, మండలాల్లో బాగా పని చేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించే వారని, మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. తమతో అధికారులు ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ యంత్రాంగం వారి సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని నిర్దేశించారు.

అన్ని స్థాయుల్లో పదోన్నతులు
స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకూ అన్ని స్థాయుల్లో పదోన్నతుల ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పైనుంచి కిందికి రావాలన్నారు. స్పెషల్‌ గ్రేడ్‌లకు అవసరమైతే కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ కోసం జాబితాను పంపించాలని, ఖాళీగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సౌకర్యాలకు 60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రొటోకాల్‌ డ్యూటీలు డీటీలకు..
రిజిస్ట్రేషన్ల పేరుతో కార్యాలయాల్లో తహసీల్దార్లు బిజీగా ఉంటే ప్రొటోకాల్‌ విధులు డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. అవసర మైతేనే తహసీల్దార్లు ప్రొటోకాల్‌ డ్యూటీలకు వెళ్లాలని నిర్దేశించారు. ప్రొటోకాల్‌ సహా కార్యాలయాల నిర్వహణకు నిధుల కొరత లేకుండా ప్రతి కార్యాలయానికి రూ.లక్ష కేటాయించాలన్నారు.

చాలా ఏళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లు పని చేస్తున్నారని, వారంతా కలిపి 700 మంది దాకా ఉంటారని సంఘాలు గుర్తు చేయగా.. వారిని క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకోవాలని సీఎ్‌సను ఆదేశించారు.

ఇతర శాఖల్లోకి వీఆర్వోలు
ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు వీఆర్వోలకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఖాళీలను వీఆర్వోల్లో అర్హులతో భర్తీ చేయాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి రెవెన్యూ శాఖలోనే వారిని సర్దుబాటు చేస్తామన్నారు.

అలాగే, వీఆర్‌ఏలలో బీటెక్‌, ఎంటెక్‌ చేసిన వారు ఎవరైనా ఉంటే నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేస్తామని సీఎం ప్రకటించారు. వీఆర్‌ఏలకు స్కేల్‌ ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతోందని, అయినా, మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్‌, సెక్రటరీ స్మితా సభర్వాల్‌కు నిర్దేశించారు.

కొత్త చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌ కుమార్‌, వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు రమేశ్‌ బహద్దూర్‌, రాజయ్య తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

చట్టం అమల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు.  ప్రజలకు మేలైన సేవలందించి, ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు.

సీఎస్‌ అనేక శాఖల విధులు నిర్వర్తిస్తూ బిజీగా ఉంటున్నారని, ఆయన్ను కలవలేని పరిస్థితి ఉందని ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎల్‌ఏ పోస్టును భర్తీ చేయాలని కోరారు. దాంతో, సీసీఎల్‌ఏను పెట్టాలనే అనుకున్నామని, కానీ, కొంత కాలం ఉంటానని సోమేశ్‌కుమార్‌ చెప్పడం వల్లే భర్తీ చేయలేకపోయామని, త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Courtesy Andhrajtyothi

RELATED ARTICLES

Latest Updates