ఇక ‘చెత్త’ భారం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వి. వెంకటేశ్వర్లు

గ్రామీణ ప్రాంతాలలో ‘మనం – మన పరిశుభ్రత’ పేరుతో ప్రతి కుటుంబం నుండి రోజుకు రూ. 2 చొప్పున చెత్త సేకరణ పన్నును వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం పేదల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెబుతూ మరో పక్క ప్రజలపై పన్నుల భారం మొదలు పెట్టింది. గోరు చుట్టుపై రోకలి పోటు లాగా కరోనా కష్టకాలం అని చూడకుండా పల్లె ప్రజలపై భారాలు మోపడం అత్యంత దారుణం. ఇక నుండి గ్రామాలలో చెత్త ఊరికే తీసుకెళ్లరు. తొలిదశలో రాష్ట్ర వ్యాపితంగా మండలానికి రెండు గ్రామాలు ఎంపిక చేసి ప్రతి కుటుంబం నుండి రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు. తదనంతరం రాష్ట్ర వ్యాపితంగా పన్నును విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. చెత్త సేకరణ పన్ను అనేది ప్రపంచ బ్యాంక్‌ నుండి వచ్చింది. పౌర సేవలు ఉచితంగా ఇవ్వకూడదు. ఖర్చులకు సమానంగా చార్జీలు పెంచాలన్నది సంస్కరణలలో భాగం. ఈ ప్రయత్నం ఉమ్మడి రాష్ట్రం నుండి జరుగుతున్నదే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘పచ్చదనం- పరిశుభ్రత’ పేరు చెప్పినా, బిజెపి ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్‌’ అన్నా, నేటి వైసిపి ప్రభుత్వం ‘మన ఊరుామన శుభ్రత’ అన్నా పేరులో మార్పే తప్ప విధానం ఒక్కటే.

గ్రామ పంచాయతీలలో పారిశుధ్య, ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యకలాపాలను ప్రజల ‘భాగస్వామ్యం’తో సాధిద్దామంటూ ‘మనం-మన పరిశుభ్రత’ను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు కరోనాతో అల్లాడిపోతున్న సమయాన్ని అదనుగా చూసుకొని మే నెల 5న రాష్ట్ర పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొదటి దశలో మండలానికి రెండు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి గ్రామంలో ప్రతి కుటుంబం నుండి రోజుకు రూ.2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. వసూలు చేసిన డబ్బును గ్రామ వాలంటీరు, గ్రామ పంచాయితీ నిర్ణయించిన ఒక గ్రామ పెద్ద పేరుతో జాయింట్‌ అకౌంట్‌ ఏర్పాటు చేస్తారు. ప్రతి వారం లేదా ప్రతి నెలకొకసారి ప్రజలు ఈ పన్ను చెల్లించాలి. వాలంటీర్ల ప్రధాన పని ఇదే. ఒక వేళ ఎవరైనా ఇవ్వకపోతే నెల నెలా పేదలకు వచ్చే సంక్షేమ డబ్బుల నుండి కట్‌ చేసుకుంటారు. లేదా క్షేత్ర స్థాయి సిబ్బంది జీతంలో కట్‌ చేసుకుంటారు. ఇప్పటి వరకు గ్రామీణ గ్రీన్‌ అంబాసిడర్ల జీతభత్యాలు, వాహన ఖర్చులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుండి చెల్లిస్తున్నారు. ఇక మీదట ప్రజల నుండి వసూలు చేసిన డబ్బుతోనే గ్రామంలో పని చేస్తున్న ఇద్దరు గ్రీన్‌ అంబాసిడర్ల జీతాలు, ఒక గ్రీన్‌ గార్డ్‌ జీతం మొత్తం ముగ్గురి జీతాలు రూ.18,000 ఇవ్వాలని…వీరి రక్షణ పరికరాలు, రవాణా వాహనాల నిర్వహణ, ఎస్‌డబ్య్లూపిసి నిర్వహణ, పారిశుధ్య సామాగ్రి కొనుగోలు మొదలగు వాటికి కూడా ప్రజల నుండి వసూలు చేసిన డబ్బునే వినియోగించాలని…స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకొని ప్రజలపై భారాలు వేయడం అత్యంత దుర్మార్గం.

వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ గురించి పదే పదే చెబుతుంది. పంచాయితీ రాజ్‌ 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించి బలోపేతం చేసి తద్వారా సంపూర్ణ గ్రామాభివృద్ధి చేయాల్సి వుంది. అయితే నేటికీ అది అమలు కాకపోవడంతో…ప్రజలపై భారాలు వేయసాగింది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా కొద్దిపాటిగా ఉన్న రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించి వేస్తోంది. పోగా ‘స్వచ్ఛ భారత్‌’ పేరుతో కేంద్రం ఇస్తామన్న నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. కాబట్టే పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. స్థానిక సంస్థలకు సంపూర్ణంగా అధికారాలు, నిధులు ఇవ్వడం వల్లే కేరళ రాష్ట్రం దేశంలోనే అన్నింటా ముందు పీఠిన నిలిచింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ పేరుతో వేసే పన్ను భవిష్యత్‌లో రూ.2 తోనే ఆగదు. ఈ పన్నుకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక గ్రామాలలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, కొన్ని చోట్ల ప్రతిఘటిస్తున్నారు. అటువంటి చోట్ల పన్ను వసూలు తాత్కాలికంగా నిలిపివేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యత నుండి తప్పుకొని…ప్రజల నుండి పన్ను వసూలు చేసేందుకు ఉద్దేశించిన…జీవో 2019/సిపిఆర్‌ అండ్‌ ఆర్‌/ఎస్‌డబ్య్లూ/2015, 5/5/2020 రద్దు కోసం పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలి.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates