రైతు బాధ పట్టని మోడీ సర్కారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పలు పథకాలకు నిధులలేమి
– వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచనలు బేఖాతర్‌
– బడ్జెట్‌ పెంచడం పక్కనబెట్టి కుదిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
– పైసలు లేక పథకాలు వెలవెల
– ఆర్టీఐ సమాచారంతో వెలుగులోకి

న్యూఢిల్లీ : మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు దేశంలో అన్నదాత పట్ల శాపంగా మారుతున్నాయి. కేంద్రం విధానాలతో దేశంలోని రైతులు ఇప్పటికే విసిగిపోయారు. అకాల వర్షాలతో పంట నష్టం, పండిన పంటకు మద్దతు ధర లభించకపోవడం వంటి సమస్యలతో రైతన్నలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే రైతుల తాము ఏదో చేస్తున్నామన్న భ్రమ కల్పించే ఉద్దేశంతో మోడీ సర్కారు కొన్ని పథకాలను ప్రవేశపెడుతున్నది. కానీ, అవి సరిగ్గా అమలు కావడం లేదు. కారణం పథకాలకు కావాల్సినన్ని పైసలను కేంద్రం విదల్చకపోవడమే. దీంతో అనేక వ్యవసాయ పథకాలు నిధుల కొరతతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా రైతులు గోసను అనుభవిస్తున్నారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అందిన సమాచారం మేరకు ఈ విషయం బయటపడింది. ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో వ్యవసాయ పథకాలకు నిధులు కేటాయించి పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పథకాలకు నిధులు పెంచాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేసిన సూచనలను పెడచెవిన పెడుతున్నది. దీంతో నిధుల కొరత కారణంగా పథకాల ప్రయోజనాలను రైతులకు అందడంలేదు. ఏది ఏమైనా వ్యవసాయ పథకాలకు తాము నిధులను పెంచబోమని ఆర్థిక శాఖ నిర్దయగా చెప్తున్నది. దీంతో దేశంలోని రైతుల పట్ల మోడీ సర్కారు ఉన్న ప్రేమ ఏ పాటితో తేలిపోతున్నది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనా(పీఎంఎఫ్‌బీవై), ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజనా(పీఎంకేఎస్‌వై) లతో పాటు పలు పథకాలకు బడ్జెట్‌ను పెంచాలంటూ వ్యవసాయ మంత్రిత్వశాఖ కోరింది. వ్యవసాయ రుణాలు, సబ్సీడీ కింద రాష్ట్రాలు, యూటీలకు ధాన్యాల పంపిణీ, హార్టీకల్చర్‌ అభివృద్ధి కోసం కూడా నిధులను కేటాయించాలని అభ్యర్థించింది.

గతేడాది అక్టోబర్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ శ్యాం లాల్‌.. ఆర్థిక మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ పంట బీమా పథకం కోసం బడ్జెట్‌ను 19,690.19 కోట్లుగా నిర్ణయించినట్టు అందులో ఆయన పేర్కొన్నారు. కేంద్రం తాను చెల్లిచాల్సిన బకాయిలతో పాటు పథకాల కోసం నిధులను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఆ లేఖలో సదరు అధికారి పేర్కొన్నారు. అయితే వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిమాండ్‌ను ఆర్థికశాఖ తిరస్కరించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎంఎఫ్‌బీవై కోసం కేవలం రూ.15,695 కోట్లను ఫిక్స్‌ చేయడం గమనార్హం. కొన్ని నివేదికల ప్రకారం.. 2019-20 రబీ సీజన్‌లో దాదాపు 80 శాతం మంది రైతుల పంట బీమా క్లెయిమ్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సీజన్‌లో మొత్తం రూ.3,750 కోట్ల బకాయిలకు గానూ రూ.775 కోట్ల చెల్లింపులు మాత్రమే జరగడం గమనార్హం.

2019-20లో పీఎంఎఫ్‌బీవై కింద రూ.14వేల కోట్లను కేటాయించారు. ఇందులో రూ.9,620.53 కోట్లను(69శాతం) తొలి ఆరు నెలల్లో ఖర్చు చేశారు. దీని ఆధారంగా, 2019-20 కోసం బడ్జెట్‌ను రూ.14వేల కోట్ల నుంచి 20,465.47 కోట్లకు పెంచాలని వ్యవసాయ మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. కానీ, ఆర్థిక మంత్రిత్వశాఖ మాత్రం బడ్జెట్‌ను పెంచడం పక్కనబెట్టి దానిని మరింత కుదించి రూ.13,640.85 కోట్లకు తగ్గించడం గమనార్హం.

లోన్‌ స్కీంకు కూడా బడ్జెట్‌ను పెంచడానికి కేంద్రం నిరాకరించింది. మరో రూ. 10వేల కోట్లు అదనంగా కేటాయించాలన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ అభ్యర్థనను తిరస్కరించింది. 2019-20 ఆర్థిక సంవత్సంరంలో కేటాయించిన రూ.18వేల కోట్ల బడ్జెట్‌ను..రూ.24 వేల కోట్లకు, 2020-21లో రూ.28వేల కోట్లకు పెంచాలని వ్యవసాయ మంత్రిత్వశాఖ డిమాండ్‌ చేసింది. అయితే ఆర్థిక శాఖ మాత్రం బడ్జెట్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.21,175 కోట్లను కేటాయించగా,2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ 17,863.43 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది.

ధరల మద్దతు పథకాల(పీఎస్‌ఎస్‌)కు కూడా మోడీ సర్కాకు కేటాయించిందీ, ఖర్చు చేసింది కూడా తక్కువగానే ఉన్నది. 2019-20లో రూ. 800 కోట్లు మాత్రమే కేటాయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 2250 కోట్లకు బడ్జెట్‌ను పెంచాలంటూ వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు పంపింది. కానీ, గతేడాది లాగే రూ.800 కోట్లను ఆర్థికశాఖ కేటాయించడం గమనార్హం. కాగా, 2019-20లో ఈ పథకం కింద తొలి ఆరు నెలల్లో 22శాతం మాత్రమే ఖర్చు చేయడం గమనించాల్సిన అంశం.
నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ)కు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయడంతో పాటు రూ.879.70 కోట్లను కేటాయించా లంటూ వ్యవసాయ మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. కానీ, 2020-21 కోసం బడ్జెట్‌లో కేవలం రూ.400 కోట్ల కేటాయింపు మాత్రమే ఆర్థిక శాఖ జరిపింది.

అలాగే రైతు సంక్షేమ పథకాలైన మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం- ప్రైస్‌ సపోర్ట్‌ సిస్టం(ఎంఐఎస్‌-పీఎస్‌ఎస్‌), ప్రధాన మంత్రి అన్నదాత ఆరు సంరక్షణ్‌ అభియాన్‌ (పీఎం-ఆశా) వంటి పథకాలకు బడ్జెట్‌ను పెంచాలంటూ సంబంధింత శాఖ డిమాండ్‌ చేసింది. కానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారీగా కోతలు విధించడం గమనార్హం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates