తరిమి తరిమి కొట్టారు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • వెదురుకుప్పం పోలీసులకు దళితుల ఫిర్యాదు 
  • ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

వెదురుకుప్పం(చిత్తూరు): ‘పొలం దారి విషయమై లంబోధరరెడ్డి వర్గీయులు మమ్మల్ని చెప్పులతో తరిమి తరిమి కొట్టారు. మహిళలనీ చూడలేదు. కులం పేరుతో దూషించారు’ అంటూ వెదురుకుప్పం మండలం మాంబేడు దళితవాడకు చెందిన రాజేంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై మాంబేడుకు చెందిన లంబోధరరెడ్డి, ఆయన వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆదివారం చెప్పారు. బాధితుడు తెలిపిన ప్రకారం.. ‘మాంబేడు రెవెన్యూ లెక్కదాఖలాలోని మా పొలానికి వెళ్లే దారిని కొంతకాలం క్రితం లంభోదరరెడ్డి వర్గీయులు ఆక్రమించుకున్నారు. దీనిపై మా అభ్యర్థనతో రెవెన్యూ అధికారులు స్పందించి దారి చూపించారు.

ఆ నేరేడుకుంట దారిలో శనివారం సాయంత్రం రాళ్లు, ముళ్లకంపలను శుభ్రపరుస్తుండగా లంభోదరరెడ్డి, అతడి వర్గీయులు రాళ్లు, కత్తులు, కర్రలతో వచ్చి మాపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మేమంతా భయపడి పరుగులు తీశాం. మా వదిన మహాలక్ష్మిని లంబోధరరెడ్డి కొట్టాడు. ఈ క్రమంలో ఆమె దంతాలు ఊగిపోయి రక్తమొచ్చింది. కులం పేరుతో దూషించాడు. ధర్మారెడ్డి, లంబోధరరెడ్డి నా చొక్కా చించి చెప్పుతో కొడుతూ ఊరేగిస్తామని బెదిరించి, కులం పేరుతో దూషించారు. చంపేస్తామని బెదిరించారు. దీనిపై శనివారం రాత్రి మాంబేడుకు చెందిన లంబోధరరెడ్డి, ధర్మారెడ్డి, శంకరరెడ్డి, దాము, ఈశ్వరరెడ్డి, సుజాతపై పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని రాజేంద్ర వివరించారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, దారి విషయమై గొడవ పడిన ఇరువర్గాల వారు వైసీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఈ వివాదంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

దళితుల ఎదుగుదల ఓర్వలేకనే..
దళితుల ఎదుగుదల చూసి ఓర్వలేని పెత్తందారులు చెప్పులతో కొట్టారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. గాయపడిన దళిత కుటుంబాన్ని ఆదివారం ఆయన, అడ్వకేట్‌ ప్రసన్నకుమార్‌తో కలిసి పరామర్శించారు. గతంలో పెత్తందారులు దారిని ఆక్రమించుకున్నారన్నారు. దీనిని జీర్ణించుకోలేని రాజేంద్ర తండ్రి చెంగయ్య అదే భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. దీనిని వడదెబ్బగా మార్చి అంత్యక్రియలు జరిపించారని నాగరాజు విమర్శించారు.

ఆ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అప్పట్లో 25 టన్నుల మామిడి పంట పొలంలోనే కుళ్లిపోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెత్తందారులు ఆక్రమించిన నేరేడుకుంట భూములను కాపాడాలని, దళితులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. చెంగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates