బజ్‌ విమెన్‌… మహిళల ఆర్థిక పాఠశాల

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కోటి మంది మహిళల సాధికారతే లక్ష్యంగా ‘బజ్‌ విమెన్‌’ వాహనం గ్రామాల వైపు పయనిస్తోంది. నైపుణ్యాల పెంపూ, ఆర్థిక ప్రణాళికలపై పాఠాలు చెబుతూ… ఎందరినో చిరువ్యాపారులుగా మార్చింది లక్షలాదిమందిని రుణ విముక్తులను చేసింది. మహిళల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ప్రయాణిస్తున్న ఈ వాహన సృష్టికర్త ఉత్తరా నారాయణన్‌.

కర్ణాటకలో అదొక కుగ్రామం. ఉదయమే ఓ వాహనం రయ్యిన అక్కడికి దూసుకొచ్చింది. అందులోనుంచి దిగిన ఇద్దరు మహిళలు కళ్లు మూసి తెరిచేలోపు అక్కడ ఓ చిన్న గుడారం, దాని కింద పది కుర్చీలను ఏర్పాటు చేశారు. స్థానికులకు వారెవరో, ఆ వాహనం అక్కడికి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఈలోగా ఇద్దరిలో ఒకామె మైకు తీసుకుని ‘మీ కష్టాలను తెలుసుకొని చేయూతనందిస్తాం’ అనే అర్థం వచ్చేలా ఓ పాట పాడింది. అది విన్న వారంతా ఆ వాహనం తమకు ఆర్థిక సాయం అందించేందుకే వచ్చిందనుకున్నారు. మొహమాటపడుతూనే ఆ కార్యకర్తను విషయం అడిగారు. అది ‘బజ్‌విమెన్‌’ వాహనం అనీ ఆర్థిక సాయం చేయదు కానీ అప్పులు తీర్చేందుకు, సాధికారత సాధించేందుకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తుందని ఆమె చెప్పింది.

ఏంటీ బజ్‌ విమెన్‌
బజ్‌ విమెన్‌ సృష్టికర్త ఉత్తరా నారాయణ్‌. కర్ణాటకలో ‘పైసా ఫర్‌ పంచాయతీస్‌ స్టడీ’ అనే పాలసీ రీసెర్చి కేంద్రంలో కన్సెల్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేశారు. ఆ సమయంలో క్షేత్ర స్థాయిలో తిరిగినప్పుడు గ్రామాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే అక్కడి స్త్రీ సాధికారత కుంటుపడుతోందని అర్థం చేసుకున్నారు. అందుకే వారికి నైపుణ్యాల శిక్షణ, అర్థిక విషయాలపై అవగాహన, అవకాశాల కల్పన ద్వారా చేయూతనివ్వాలి అనుకున్నారు. అందుకోసం 2012లో ‘క్లాసెస్‌ ఆన్‌ వీల్స్‌’గా ప్రాజెక్టును ప్రారంభించి పల్లెపల్లెకూ ఈ వాహనాన్ని నడిపించారామె. తరువాత కాలంలో ఇది బజ్‌విమెన్‌ సంస్థగా మారింది. ‘ఆరునెలలపాటు వందలాది గ్రామాల్లో పర్యటించా. ఇక్కడి మహిళలతో మమేకమవ్వడానికి కన్నడ భాషను నేర్చుకున్నా. పరిస్థితులపై అవగాహన వచ్చాక ఆర్థికప్రణాళిక, వాణిజ్యం, వ్యక్తిగత నాయకత్వ లక్షణాలు వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని మహిళలకోసం ప్రత్యేకంగా పాఠ్యాంశాలను రూపొందించా. ఇందులో నా స్నేహితులు దేవ్‌జాంగ్‌నీలెన్‌, సురేశ్‌ కృష్ణల సహకారమెంతో ఉంది’ అంటారామె. ప్రస్తుతం ఈ వాహనం ద్వారా కర్ణాటకలోని 200 గ్రామాల్లోని మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. రానున్న పదేళ్లలో కోటిమంది నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే వీరి లక్ష్యం.

నాన్న స్ఫూర్తితో…
గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచన ఉత్తరా నారాయణన్‌కు ఎనిమిదేళ్ల క్రితం వచ్చింది. ఇందుకు ఆమెకి స్ఫూర్తి తండ్రే. బ్యాంకర్‌ అయిన ఆయన ఏటా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేటప్పుడు ఇంటి బడ్జెట్‌ను ఉత్తరకీ, ఆమె తల్లికీ వివరించేవారట. ‘మహిళా సాధికారత సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం అని ఆయన తరచూ అనే మాటలే ఈ దిశగా నడిపించాయి’ అంటారు ఉత్తర.

సవాళ్లెన్నో…
గ్రామాల్లో శిక్షణాతరగతులు మొదలుపెట్టడం ఉత్తరకు అనుకున్నంత తేలిక కాలేదు. ఒకరిలో మార్పు తేవడంకన్నా, ఒక బృందాన్ని మార్చగలిగితే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నించారు. క్రమంగా అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఆయా గ్రామాల్లోని మహిళలు కుట్టుపనీ, హస్తకళలు, కప్పుల తయారీ వంటివాటిలో శిక్షణ పొంది చిన్న చిన్న ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు. బ్యాంకు ఖాతాలు తెరిచి పొదుపు చేస్తున్నారు. రుణాలు తీర్చేశారు. ఇలా క్రమంగా వారి సమస్యలకు వారే పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు గృహహింసకు ఎదురుతిరగడం, చెడు అలవాట్లకు బానిసలయ్యే భర్తల్లో అవగాహన తేవడంతో పాటు కుటుంబాలకు ఆర్థిక చేయూతగా మారుతున్నారు. వీరికి అవసరమైన ఆర్థిక సాయం సిటీ ఫౌండేషన్‌ వంటి పలు ఎన్జీవోలు అందిస్తున్నాయి. బజ్‌ వుమెన్‌ వాహన సేవలు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ‘బజ్‌ జాంబియా’ పేరుతో మొదలయ్యాయి.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు ఉత్తర. కర్ణాటక, ముల్‌బగల్‌లో పంచాయత్‌ ఫైనాన్సెస్‌కు సంబంధించి 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ బృందంలో సభ్యురాలిగానూ ఉన్నారు. అలానే ‘పైసా ఫర్‌ పంచాయతీస్‌ స్టడీ’ అనే పాలసీ రీసెర్చి కేంద్రంలో కన్సల్టెంట్‌గానూ విధులు నిర్వహించారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates