ప్రశ్నోత్తరాలే ప్రజాస్వామ్య సారం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని విధంగా బడ్జెట్‌ భేటీ దరిమిలా 174రోజుల సుదీర్ఘ విరామానంతరం పార్లమెంటు వానకాల సమావేశాలు వచ్చే 14వ తేదీ నుంచి జరగనున్నాయి. పార్లమెంటు రెండు సమావేశాల నడుమ ఆర్నెల్లకు మించి విరామం ఉండరాదన్న రాజ్యాంగ నియమాన్ని మన్నించి నిర్వహిస్తున్న వర్షకాల భేటీని వాస్తవానికి కొవిడ్‌ కాల సమావేశాలనాలి! దేశవ్యాప్తంగా 41 లక్షలకు పైగా కేసులు, 70వేల పైచిలుకు మరణాలతో కొవిడ్‌ మహమ్మారి చెలరేగుతున్న వేళ ఇది. కేంద్రం ప్రకటించిన ఆరోగ్య ఆత్యయిక స్థితి పార్లమెంటు సమావేశాల్నీ గణనీయంగా ప్రభావితం చేసింది. సెప్టెంబరు 14నుంచి అక్టోబరు ఒకటో తేదీదాకా సెలవులేవీ లేకుండా జరిగే సమావేశాలు- రెండు షిఫ్టులుగా ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ భేటీల రూపేణా సాగనున్నాయి. ఒక్కో షిఫ్టు నాలుగ్గంటలకు కుదించుకుపోగా, ప్రశ్నోత్తరాల సమయం ఉండదని, శూన్యగంట (జీరో అవర్‌) అరగంటకే పరిమితమని, ప్రైవేటు సభ్యుల బిల్లులకూ అనుమతి లేదని తాజా విధివిధానాలు నిర్దేశిస్తున్నాయి. సరిహద్దుల్లో చైనా అతిక్రమణలు, దేశీయంగా కరోనా మృత్యుఘంటికలు, మైనస్‌ 23 శాతానికి వృద్ధిరేటు కుంగుబాటు, ఉసూరుమనిపిస్తున్న ఉపాధి, కానరాని పారిశ్రామిక ప్రగతి- ఎక్కడికక్కడ దారుణ సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించి, సమాధానాలపై తర్కించి విశాల జనహితం సాధించడానికి ప్రశ్నోత్తరాల సమయమే సరైన వేదిక కాగలుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసినా, ‘అన్‌ స్టార్‌’ ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలిస్తామని కేంద్ర సర్కారు చెబుతున్నా- మౌఖిక సమాధానాలకు అవి ప్రత్యామ్నాయం కావు. ప్రజాస్వామ్య సారమే జవాబుదారీ పాలన అయినప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చెయ్యడంలో అర్థం లేదు. లోగడ చైనా, పాక్‌ యుద్ధకాలంలోనూ ఆత్యయిక పరిస్థితి వేళా ప్రశ్నోత్తరాల్ని రద్దుచేసిన సందర్భాలున్నా- ఇప్పటి సంక్షోభం వాటికి భిన్నమైనది. సంక్షుభిత సమయంలో పార్లమెంటు విజ్ఞతాయుత వర్తనకు పరిణత ప్రశ్నోత్తరాల సమయమే సరైన గీటురాయి!

పార్లమెంటు పని పరిపాలించడం కాదు, తర్కించడమన్న విఖ్యాత రాజ్యాంగ కోవిదుడు సర్‌ విలియం ఐవర్‌ జెన్నింగ్స్‌ మాట అక్షరసత్యం. పరిపాలించే ప్రభుత్వాన్ని సరైనదారిలో ముందుకు నడిపించేందుకు ప్రతిపక్షాలకు గల విమర్శనా హక్కు దోహదపడితేనే- అది మేలిమి ప్రజాస్వామ్యం! 1957లో బిహారుకు చెందిన ఎంపీ రామ్‌ సుభాగ్‌సింగ్‌ అప్పటి విత్తమంత్రి టీటీ కృష్ణమాచారికి ప్రశ్నోత్తరాల సమయంలో సంధించిన ప్రశ్న- స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటి కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. ప్రజల పక్షాన నిశిత ప్రశ్నలు సంధించి కార్యనిర్వాహక వర్గాన్ని చట్టసభకు జవాబుదారీ చెయ్యడమే మాన్య సభ్యులు నిష్ఠగా నిర్వర్తించాల్సిన జనస్వామ్య విధి. అందుకు వీలు కల్పించేలా ప్రతి బుధవారం అరగంటసేపు నేరుగా ప్రధానమంత్రే సమాధానమిచ్చే ప్రశ్నల సమయం 1961 నుంచి బ్రిటన్‌లో అమలులో ఉంది. ఏడాదికి కనీసం 160 రోజులు సమావేశమయ్యే అక్కడి పార్లమెంటులో- ప్రతి సమావేశంలో 20 రోజుల అజెండాను ప్రతిపక్షాలే నిర్ధారించే సంప్రదాయం ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తోంది. పార్లమెంటులో ప్రశ్నలు అడగడం సభ్యుల తిరుగులేని హక్కు అని లోక్‌సభ సచివాలయమే చాటుతున్నా- గత లోక్‌సభాకాలంలో ప్రశ్నోత్తరాల సమయం 67 శాతమే సద్వినియోగమైంది. అదే రాజ్యసభ 2009-’19 నడుమ 41 శాతం ప్రశ్నోత్తరాల కాలాన్నే వినియోగించుకోగలిగింది. ప్రశ్నోత్తరాల రద్దు ప్రజాస్వామ్య ఘాతుకమంటూ గళమెత్తుతున్న పార్టీలు- గతంలో విలువైన సమయాన్ని వృధా చేసిన తీరుపై ఆత్మావలోకనం చేసుకోవాలి. నయా ఇండియా ఆవిష్కరణ దిశగా సాగించాల్సిన కృషిలో- ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’లను నిరుడు ప్రస్తావించిన మోదీ, సభాపర్వంలో ఆ స్ఫూర్తికి ఎత్తుపీట వేయాలి!

RELATED ARTICLES

Latest Updates