పిల్లో కవర్ల నుంచి బైక్‌లు, కార్ల దాకా అన్నీ అద్దెకే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకుపోండి
  • నచ్చినంత కాలం హ్యాపీగా వాడుకోండి
  • కంపెనీలు, పలు స్టార్టప్‌ల ఆఫర్లు 
  • కరోనా తర్వాత పెరిగిన వ్యాపారం
  • బ్యాచిలర్స్‌, కొత్త దంపతుల్లో ఆదరణ 
  • కట్టుబట్టలతో వచ్చి సకల సౌకర్యాలు
  • తరచూ బదిలీ అయ్యే వారికి బేఫికర్‌ 
  • అద్దె ఇల్లు మారడం చిటికెలో పని
  • మంచం, పరుపు, దిండ్లు నెలకు 700
  • మంచి ల్యాప్‌టాప్‌ 1200తో మొదలు

బ్యాంకు ఉద్యోగి జగన్మోహన్‌రావు (పేరు మార్చాం)కు తరచూ బదిలీలుంటాయి. ఇంట్లో సామాన్లు సర్దుకోకముందే బదిలీ అయిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల ఆయన హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు. కేవలం రెండు సూట్‌కేసుల్లో బట్టలు, గ్యాస్‌ స్టవ్‌ తీసుకొచ్చారు. అయితే కొత్తింట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఫర్నిచర్‌, టీవీ, ఫ్రిజ్‌, బెడ్‌, వంట సామాను, వాటర్‌ ఫిల్టర్‌ అన్నీ ఉన్నాయి! 

రజనీశ్‌, ఓ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌. పెళ్లి కాలేదు. బ్యాచిలర్‌ రూం అన్నట్లే గానీ ఇంట్లో లగ్జరీ ఫర్నిచర్‌, వాషింగ్‌ మెషిన్‌, ఏసీ, కంప్యూటర్‌ అన్నీ ఉన్నాయి. అందులో ఏ ఒక్కటీ ఆయన సొంతం కాదు.

జగన్మోహన్‌ రావు, రజనీశ్‌ ఇంట్లో ఉన్నవన్నీ అద్దె వస్తువులే! వారు మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు వాటిని సింపుల్‌గా తిరిగిచ్చేస్తారంతే. రవాణా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇందుకుగాను ఇంట్లో ఉపయోగించే అన్ని వస్తువులను సమకూర్చేందుకు సిద్ధమంటున్నాయి కొన్ని కంపెనీలు, స్టార్ట్‌పలు. నచ్చినన్ని రోజులు హ్యాపీగా వాడుకోండి… నచ్చకపోతే తిరిగిచ్చేసి.. మరోటి తీసుకోండి.. వాడుకున్న రోజులకే అద్దెను చెల్లించండి  అని ఆఫర్‌ ఇస్తున్నాయి. అద్దెకు తీసుకోండి, నచ్చినంత కాలం వాడుకోండి. దానిమీద మమకారం పెరిగితే సొంతం చేసుకోండి అని చెబుతున్నాయి.

ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేకించి జీతాల కోతతో ఇబ్బంది పడుతున్నా కరోనా తర్వాత ఈ ధోరణి బాగా పెరిగింది. రెండు చేతులా సంపాదిస్తున్న బ్రహ్మచారులు, పెళ్లయిన నవ దంపతుల్లో ఎక్కువ మంది దీన్నే ఫాలో అవుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఉద్యోగ బాధ్యతల్లో పలు ప్రాంతాలను చుట్టొచ్చేవారే! ఇల్లు మారిన ప్రతీసారి సామానును ప్యాక్‌ చేయడం.. వ్యానులో తరలించడం అనే సమస్యను అధిగమించేందుకు అద్దె వస్తువులకు జై కొడుతున్నారు. కొత్తగా ఇల్లు మారితే బట్టలు, మందులుల్లాంటివి కొన్ని సూట్‌కేసుల్లో సర్దుకొని వెళుతున్నారు. భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేవారైతే ఎక్కువగా హౌస్‌హోల్డ్‌ ఐటెమ్స్‌ అద్దెకు తీసుకుంటున్నారు. ఫర్నిచర్‌, గృహోపకరణాలను ఎక్కువ మంది అద్దెకు తీసుకుంటున్నారు.

మారుతీ సంస్థ కూడా..
గతంలో గ్రాబ్‌ ఆన్‌ రెంట్‌, రెంటికల్‌, రెంట్‌వాలా, రెంట్‌మోజో, ఫర్లెంకో, సబ్‌రెంట్‌కరో కేవలం కొన్ని స్టార్టప్స్‌ ఈ తరహా రెంటల్‌ వ్యాపారాలు సాగించగా ఇప్పుడు మారుతీ లాంటి సంస్థలూ ముందుకొచ్చాయి. తమ కార్లను రెంటల్‌ విధానంలో అందిస్తున్నాయి. వాటర్‌ ఫ్యూరిఫయర్లు లాంటి వాటిని సైతం కొన్ని సంస్థలు రెంటల్‌ విధానంలో ఇస్తున్నాయి. ఇటీవల ఎక్కువమంది రెంటల్‌ కాన్సెప్ట్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారని ‘గ్రాబ్‌ ఆన్‌ రెంట్‌’ ప్రతినిధులు చెప్పారు. ‘పలు వస్తువులును అద్దెకు తీసుకోవడం వల్ల కలిగే సౌకర్యాలపై ప్రజల్లో అవగాహన పెరగడం ఈ రంగానికి ఊతమిస్తోంది. విద్య, కెరీర్‌ అవకాశాల కోసం పలు  ప్రాంతాలకు వలస వెళుతున్నవారిలో ఎక్కువమంది వస్తువుల కొనుగోలుకు భారీగా ఖర్చు చేయకుండా అద్దెకు తీసుకోవడానికి ప్రాధన్యమిస్తున్నారు’ అని చెప్పారు. విద్యా, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.  ఐటీ, ఐటీఈఎస్‌, ఫార్మా, ఏవియేషన్‌ ఇలా పలు రంగాల్లో భారీ కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్రం కావడంతో ఇక్కడ పనిచేసేందుకు వస్తున్న యువత రెంటల్‌ కాన్సె్‌ప్టను ఇష్టపడటంతో ఈ బిజినెస్‌ పెరుగుతోందని ఓ స్టార్ట్‌పతో ఫర్నిచర్‌ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సుభాష్‌ అగర్వాల్‌ చెప్పారు. ఖరీదైన వస్తువులను కొంటే వారితో అనుబంధం పెరుగుతుందని, వృథా వదిలేసేందుకు మనసొప్పదని.. అదే అద్దెకు తీసుకుంటే ఆ సమస్య ఉండదని మదాపూర్‌లో ఓ ఎంన్‌ఎసీలో పనిచేస్తున్న సాయి అనే ఉద్యోగి చెప్పారు. ఇన్నాళ్లు తాను పుణెలో పనిచేశానని.. హైదరాబాద్‌లో మంచి ఆఫర్‌ రావడంతో వచ్చానని చెప్పారు. ఒక్క సూట్‌కే్‌సతో వచ్చి.. ఇంట్లోకి కావాల్సినవన్నీ అద్దెకు సమకూర్చుకున్నానని చెప్పారు. ప్రత్యేకించి రెంటల్‌ వ్యాపారంలో ఫర్నిచర్‌దే సింహభాగమని గ్రాబ్‌ ఆన్‌ రెంట్‌ ప్రతినిధులు చెబుతున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరిస్థితి  కారణంగా ఆఫీస్‌ ఫర్నిచర్‌కు డిమాండ్‌ పెరిగిందని, ఫర్నిచర్‌ రంగంలోని సంస్ధలు ఈ డిమాండ్‌ను అందుకోవడానికి సృజనాత్మక మార్గాలను అనుసరిస్తుండటమూ వినియోగదారులు రెంటల్స్‌ వైపు చూడటానికి కారణంగా చెప్పారు.  ప్రస్తుతం డెస్క్‌లు, చైర్స్‌, మల్టీపర్పస్‌ ఫర్నిచర్‌కు డిమాండ్‌ బాగుందన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరంగా ఆఫీస్‌ ఫర్నిచర్‌కు డిమాండ్‌ పెరిగిందన్నది ఎంత వాస్తవమో, సౌకర్యవంతమైన ఫర్నిచర్‌ కోరుకునే వారు కూడా అంతే పెరిగారంటున్నారు రెంటికల్‌ సంస్థ ఉద్యోగి అమిత్‌. ఇంటిలో ఎక్కువ సమయం గడుపుతుండడంతో సోఫాసెట్లు, బెడ్స్‌ కు కూడా డిమాండ్‌ పెరిగిందన్నారాయన.

అద్దెతో ఈ ప్రయోజనాలు
వస్తువుల మీద భారీ పెట్టుబడి పెట్టనవసరం లేదు. నచ్చిన ఫర్నిచర్‌ను ఎంచుకుని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికి తీసుకువచ్చి ఫిట్‌చేసే సంస్ధలు ఉన్నాయి.

రీలొకేషన్‌ సమస్యలు ఉండవు. మనకు వద్దనుకున్నప్పుడు ఆ విషయాన్ని సదరు సంస్థకు చెబితే వారే వచ్చి తీసుకువెళ్తారు.

ఒకే వస్తువును పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.  సీజన్‌తో పాటుగా ఇంటీరియర్స్‌ సహా వార్డ్‌రోబ్‌ మార్చుకోవచ్చు. వేసవిలో ఏసీలు, శీతాకాలంలో హీటర్లు, అందానికి ఇండోర్‌ ప్లాంట్‌లు ఇలా ఏవి కావాలన్నా అద్దె చెల్లిస్తే చాలు.

నెలకు రూ.99తో మొదలు
ఇప్పుడు బెడ్‌రూమ్‌ మొదలు డైనింగ్‌ రూమ్‌ వరకూ, కిడ్స్‌ రూమ్‌ మొదలు వర్క్‌ స్టేషన్ల వరకూ ప్రతి చోటా అవసరాలను అందిస్తున్నాయి కంపెనీలు. ఇవి గాక ద్విచక్రవాహనాలు, ఫ్యాషన్‌ వస్త్రాలు, ట్రావెల్‌, లగేజీ, మెడికల్‌ సప్లయ్స్‌, ఫిట్‌నెస్‌ సామగ్రి, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ లాంటివి కూడా అందిస్తున్నాయి. వీటి అద్దెలు నెలకు రూ.99 నుంచి ఉంటాయి. ఓ బెడ్‌రూమ్‌కు అవసరమైన మంచం, పరుపులు, బెడ్‌షీట్స్‌, పిల్లో, వాటికి కవర్లు లాంటివి కావాలంటే నెలకు రూ.700 అద్దె నుంచి అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టా్‌పలు లాంటివి కావాలంటే రూ.1200 నుంచి ఉన్నాయి.

RELATED ARTICLES

Latest Updates