అమెరికాలో ఆగని అరాచకం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– జార్జి ఫ్లాయిడ్‌ ఘటన కంటే ముందే..
– సాయం చేయమంటే పోలీసులే చంపేశారు..

న్యూయార్క్‌: అమెరికాలో జాత్యహంకార వ్యతిరేక నిరసలు ఆరని చిచ్చులా మారాయి. అక్కడి పోలీసుల దాష్టీకంతో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్‌-ఆఫ్రికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ సంఘటన అమెరికాలో సంచలనమైంది. ”బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌” ఉద్యమం ఉధృతమయేందుకు ఈ దారుణం కారణమైతే.. అంతకు రెండు నెలల ముందే న్యూయార్క్‌లో ని రోచెస్టర్‌ నగరంలో జరిగిన అతి కిరాతక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తలపై ఓ ప్లాస్టిక్‌ సంచి వంటి ముసుగును కప్పి ఊపిరాడకుండా చేశారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని డానియల్‌ ప్రూడ్‌ (41) అనే మరో నల్ల జాతీయుడు బలయ్యాడు. ఏం జరిగింది..?
చికాగోకు చెందిన ప్రూడ్‌, తన కుటుంబంతో కలసి రోచెస్టర్‌కు వచ్చారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని తమ సోదరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని డానియల్‌ సోదరుడు జో ప్రూడ్‌, మార్చి 23న హెల్ప్‌లైన్‌ నంబరు (911)కు సమాచారం ఇవ్వడంతో… పోలీసులు స్పందించారు. బట్టలు లేని స్థితిలో న్యూయార్క్‌ వీధుల్లో సంచరిస్తున్న ప్రూడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. చేతులు వెనక్కి పెట్టి, నేలపై కూర్చోవాలంటూ అతనికి ఆదేశాలు జారీచేశారు.

నేలకేసి కొట్టి, కాలితో…
మతిస్థిమితంలేని ఫ్రూడ్‌ అరుస్తుండగానే…పోలీసులు అతడ్ని పట్టుకుని సంకెళ్లు వేసి బలవంతంగా పేవ్‌మెంట్‌ మీద కూర్చోబెట్టారు. అయితే ప్రూడ్‌ నోటి నుంచి లాలాజలం స్రవించటంతో పోలీసులు ఆందోళన చెందారు. కరోనా వైరస్‌ అప్పుడప్పుడే ఉధృతమౌతుండటంతో… డానియల్‌ లాలాజలం తమపై పడకుండా సంచి వంటి ‘స్పిట్‌ హుడ్‌’ను ఆయన తలపై కప్పారు. అయితే ఆ ముసుగును తీసేయాల్సిందిగా ప్రూడ్‌ డిమాండ్‌ చేశారు. ఇందుకు ఆగ్రహించిన పోలీసులు ఆయన తలను నేలకేసి కొట్టారు. ఓ అధికారి ఆయన తలను పేవ్‌మెంట్‌కు అదిమిపెట్టాడు. మరో అధికారి ఆయన వీపు మీద కాలువేసి నొక్కిపెట్టాడు. రెండు నిముషాల పాటు అదే స్థితిలో ఉన్న అనంతరం.. ప్రూడ్‌లో కదలికలు, మాటలు ఆగిపోయాయి. అనంతరం మెడికోలు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు.

ఇది హత్యే…
వైద్యసహాయం నిమిత్తం అతన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రోచెస్టర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏడు రోజుల తర్వాత అంటే మార్చి 30న డానియల్‌ ప్రూడ్‌ మరణించారు. కాగా, ”భౌతిక బలం ప్రయోగించటం వల్ల ఊపిరి ఆడక చనిపోయినందువల్ల… ఇది హత్య” అని డానియల్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్య నిపుణుడు తెలియచేశారు.

ఇంకెంతమంది బలికావాలి..?
”నిరాయుధుడై, సంకెళ్లతో ఉన్న మా సోదరుడు బట్టలు లేకుండా, నేలపై పడిఉండటం కళ్లకు కట్టి నట్టు కనిపిస్తూనే ఉంది. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెందరి ప్రాణాలు పోవాలి?ఎందరు తోబుట్టువుల ను పోగొట్టుకోవాలి?” అని డానియల్‌ సోదరుడు జో ప్రూడ్‌ ఆక్రోశించారు. పోలీసులు, మానసిక ఆరోగ్యం సరిగా లేని ప్రూడ్‌కు సహాయపడేందుకు బదులుగా.. ఎగతాళి చేసి, దురుసుగా ప్రవర్తించారని డానియల్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అమెరికా తదితర దేశాల్లో ఉపయోగించే స్పిట్‌ హుడ్‌ అనే ముసుగులు.. పలువురు బందీల మతికి కారణమౌతున్నట్టు గమనించారు. అమెరికన్‌ పోలీసులు ప్రజలను రక్షించడంలో కాక.. చంపటంలో మంచి నైపుణ్యం కలిగిఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును న్యూయార్క్‌ రాష్ట్ర అటార్నీ జనరల్‌ విచారిస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates